శ్రీవాణీవీణానా
దావిర్భావాంధ్రవరసుధాపదచయమున్
ఠావుల్ దప్పక నిలుపన్
భావికినందిచ్చితివిప్రబంధములప్రభూ !
తెలుగదేలయంచు తెలియకో చర్చకో
అడిగెనెవడొగాని ఆంధ్రభోజ!
మారిడితివి మరల వేరొక్కడడుగక,
తెలిసి కొనగ జగతి తెలుగు ఖ్యాతి.
ఆంధ్రు లొక్కొ? గారు ఆరంభ శూరులే
ఆశు పద్య ధార నరసి చెపుడి
యని సవాల్ విసిరితి వన మాకిడితివయ్య!
భువనవిజయ మనెడు కవన విధిని.
రాసుల బోసివీధులను రత్నము లమ్మిన గాధవింటిలే
దూసిన కత్తులన్ రిపుల దూరము ద్రోలెడుశౌర్యమెంతులే
రోసము బెంచుపండితుల రోయక మన్నన జేసిబంపవే
దోసములెంచువార బడదోయగ రాముని పెంపుజేయవే
వాసక సజ్జికల్ వలపు వాకిట వేచుట జూచి బ్రోవవే
దాసుల భృత్యులన్ మిగుల దానము లిచ్చియనుగ్రహింపవే
బాసలు చాలనేర్చియు నృపాల!తెనుంగనముద్దుచూపవే
నీసభ నున్నసత్కవులు నిత్యముసొంపగు కైతలల్లరే
వ్రాసియె ఏడుకొండలనివాసికి నీవిడ కబ్బమొప్పెలే
భాసుర దేహకాంతులను భానుని రూపున నాకుదోపవే
భూసఖ! సాంద్రకీర్తిగని బోలవె పున్నమిచందమామతో
నీసరి లేరురారెవరు నిక్కమిదయ్య!నృపాలపాలకా!
జనజీవనసుఖమయ పా
లనమునను సుకవులకైతలను రాజకవీ!
గనుగొన సులువుగనిలను,గ
గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే!
సప్త దిగ్గజముల సాహితీ సభదీర
ఒప్ప దేమొ మనసు ఊహ సేయ
రామ కృష్ణ కవిని రాజ!జేర్చుకొనుట
పురి తెనాలి కీర్తి పుడమి నిండె.
సరసవచోభూషణులే
వరుసగ కైతలనుజెప్ప వాణియె ముదమున్
పరికింపనెంచి స్వయముగ
అరుదెంచినదేమొసభకు ఆదినములలో
పదములమృదుపదములను వెదకి బట్టి
తెలుగు పద్యములను మాల వలెను గట్టి
పదములనుమృదుపదముల వద్ద నుంచి
తృప్తి గొననిమ్ము శ్రీకృష్ణ దేవరాయ!
-ఊకదంపుడు
3 కామెంట్‌లు:
అద్భుతమైన ధారతో వ్రాశారు. చాలా బావున్నాయి.
రాయల వారికి మీరు వేసిన ఉత్పలమాలలు బహు సొగసుగా ఉన్నాయండి.
పద్యాలన్నీ బాగున్నాయి సార్. ఇలా ఇక ఇతర బ్లాగులలో కూడా ఊకదంచుతూ, రాయల స్ఫూర్తితో బ్లాగ్విజయాలను నమోదు చేసుకుంటూ పోతారన్నమాట! కానివ్వండి.
"పదముల మృదుపదములను -పదములను మృదుపదముల" - భేష్!
తెనాలి రామునికి ప్రత్యేకపద్యమా! ఈ ప్రత్యేకాభిమానమెందుకంటారూ? :)
’తెలుగదేలయని యనుకొందువేమో..’ యని ప్రస్తావించింది శ్రీకాకుళాంధ్రదేవుడుగదా, రెండో పద్యం పర్లేదంటారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి