...

...

2, ఆగస్టు 2010, సోమవారం

కవితాభిషేకం! - 28

వీర, సార భూమి విజయ నగరమందు
తెలుగు ధీర యుక్తి, ధిషణ శక్తి
ఒక్క రూపమందె ఉద్దీపనము చెంద
’కృష్ణ రాయ’డగుచు కీర్తి నొందె !


కత్తి కలమ్ముగా సమర కావ్యమునన్ రుధిరాక్షరంబులన్
విత్తగ ’కృష్ణ రానృపుడు’, విక్రమ గీతులు పొంగె ! ఆతడే
మెత్తని పాళి గల్గు కలమే ఝళిపింపగ కత్తిగాన్, సిరా
హత్తుకొనన్, సుకావ్యమె మహా రస యుద్ధము నాయె వింతగాన్ !రాజ సూర్యుడు, కవిరాజునున్ రెండయి -
తెలుగు రాజ్య రమకు దీప్తి గలుగ -
దిద్దె వీర రక్త తిలక మామె నుదుట !
అద్దె కవన మధువు నామె నోట !


అష్ట దిగ్గజాల్ మోయగా, ఆంధ్ర సాహి
తీ ప్రబంధ మండిత మహా దివ్య ’భువన
విజయ’ విస్తృత విఖ్యాత విశ్వ మకుట
ధారి - సర్వజ్ఞ శేషాహి తానె యయ్యె !పలుకది యున్నంత వరకు -
తెలుగది యున్నంత వరకు - దేదీప్యముగాన్
వెలుగది యున్నంత వరకు -
నిలుచును శ్రీకృష్ణరాయ నృప ! నీ యశమున్ !

                   
                   - ’పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి