...

...

17, డిసెంబర్ 2010, శుక్రవారం

భరత సుతుడా మేలుకో! -2

9.'మీది కాదరుణాచల'మ్మని
   చైనావారలు అరచుచుండగ
   మనది మనదని గొణుగుచుంటిమి
   భరత సుతుడా మేలుకో!

                                     10.చైనా నేలిన నేత పేరిట
                                          గద్దెనెక్కగ దేశమగ్నికి
                                          ఆహుతిచ్చెడు వారి దునుమగ
                                          భరత సుతుడా మేలుకో!

11.పేల్చి కూల్చుచు గద్దె నెక్కుటె
     శ్రేష్ఠ మార్గమ్మనుచు చెప్పెడు
     రాక్షసాథము నణచుకొరకని
     భరత సుతుడా మేలుకో!

                                     12.కాశ్మీరములేని భారత
                                          దేశపటమును చైనావారలు
                                          పంచినను మన రక్తముడుకదు
                                          భరత సుతుడా మేలుకో!

13.ఓడిపోతిమి గడ్డి కూడా
   మొలవదనుచును వదిలిపెడితిమి
   మానమెరుగని దేశమా ఇది
   భరత సుతుడా మేలుకో!

                                      14.ఆక్రమిత కాశ్మీరమందున
                                           'పాక్'వారలు ఫ్యాక్టరీలను
                                           పెట్టుకొనుటకు చైనా సాయం
                                           భరత సుతుడా మేలుకో!

15.మనదె దేశము మనదె పాలన
   తిరుగబోవగ చైనావారలు
   ఆంక్షలిడుచో అడుగజాలము
   భరత సుతుడా మేలుకో!

                             16.తల్లి భారతి చీరకొంగును
                                  చైనావారలు లాగుచుండగ
                                 మిన్నకుండెడు కొడుకులేటికి
                                 భరత సుతుడా మేలుకో!

- వరిగొండ కాంతారావు        

16, డిసెంబర్ 2010, గురువారం

భరత సుతుడా మేలుకో! -1

1.భరతమాతకు కనుల నెత్తుటి
  చుక్కలెన్నియొ కారుచున్నవి
  చూడజాలక వ్రాయుచుంటిని
  భరత సుతుడా మేలుకో!


                                         2. భరతదేశము ధ్వంసమైనది
                                             తిరిగి ఇటుకలు పేర్చుకొనుచును 

                                            జాతిభవనము కట్టుకొందము
                                            భరత సుతుడా మేలుకో!


3. దేవుడిచ్చిన మురుగుకాలువ
   పేరు నదియను శాస్త్రజ్ఞానము
   మనకు వలదని తెలుసుకొనుటకు
   భరత సుతుడా
మేలుకో!


                                       4.తీర్థమందున స్నానమాడగ
                                          సబ్బునూనెలు వలదు వలదని
                                          మనదు పూర్వులు చెప్పినారలు
                                           భరత సుతుడా మేలుకో!


5.నదులకడ్డముగానకట్టలు
  కట్టి కాల్వలు తవ్వుకొనుటయె
  నీటి వనరుల వాడకమ్మట
  భరత సుతుడా మేలుకో!


                                       6.కుంట చెరువులు పిల్ల కాల్వలు
                                          చెరువు అలుగులో చెరువు నిండుట
                                          నీరు దాచెడు పద్ధతిది గద
                                          భరత సుతుడా మేలుకో!


7.వర్షమనగా నీటి చుక్కలు
  నదిని చేరక మున్నె వానిని
  వాడుకొనడము మరచిపోతిమి
  భరత సుతుడా మేలుకో!


                                       8.నీటి యుద్ధాల్జరుగ గలవని
                                          ఊహసేయుటె గొప్పయందురు
                                         నీటి వాడుక మేలు విధమును
                                         భరత సుతుడా మేలుకో!  


                                                                  - వరిగొండ కాంతారావు        

భరత సుతుడా మేలుకో!

సాహితీ మిత్రులు శ్రీ వరిగొండ కాంతారావు గారి రచన భరత సుతుడా మేలుకో! బ్లాగు వీక్షకుల కోసం సమీక్షిద్దామని మొదట భావించాను. అయితే ఈ పుస్తకంపై సమీక్ష వ్రాయటం కంటే మొత్తం పుస్తకాన్ని అందిస్తే బాగుంటుందని అనిపించి శ్రీ కాంతారావుగారి అనుమతి కోరాను. వారు సంతోషంగా అంగీకరించారు. మాత్రా ఛందస్సుతో సాగే ఈ గేయ ద్విశతకాన్ని  ధారావాహికగా మీకోసం ప్రత్యేకంగా తురుపుముక్క అందించనున్నది.. చదివి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయండి. 

15, డిసెంబర్ 2010, బుధవారం

వస్తున్నాయొస్తున్నాయి...

వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో త్వరలో ప్రకటించబోయే కథల వివరాలు!
1.సగ్గురాజయ్య - కలిసుందాం రా!
2.పిడుగు పాపిరెడ్డి - శాలువా 3.పారుపూడి వెంకట సత్యనారాయణ -కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన 4.పి.వి.శేషారత్నం - సంకల్పం
5.రేగులపాటి కిషన్‌రావు - సౌజన్యం 6.రేగులపాటి విజయలక్ష్మి - కీడు జరుగుతుందా? 7.కొలకలూరి స్వరూపరాణి - ఫ్రిజుడిటీ 8.కొవ్వలి రామకృష్ణ పరమహంస - కనువిప్పు 
9.శ్రీవిరించి - పుడమి-పోడిమి

పుస్తక సమీక్ష - 19 గమనం


[పుస్తకం పేరు: గమనం, రచన: సత్యభాస్కర్, వెల: రూ.75/-, ప్రతులకు:జనమిత్ర ప్రచురణలు, 3-8-7, ఫ్లాట్ నెం.101, రాధాదేవి అపార్ట్‌మెంట్స్, ఫేజ్-1, రామాంతపూర్, హైదరాబాద్ 500 013 మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు]

      మిత్రుడు సత్యభాస్కర్ కలంనుండి జాలువారిన కథల సమాహారమే ఈ గమనం. శ్రామిక పక్షపాతమైన కథలు, ఉద్యమస్ఫూర్తిని ఇచ్చే కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. మహిళలు ఇంటా బయటా పడుతున్న శ్రమను గుర్తించే కథలూ ఉన్నాయి. వ్యక్తిగౌరవాన్ని, స్వాభిమానాన్ని ఎత్తిచూపే కథలున్నాయి. సంఘటిత వ్యవస్థ చూపించే పరిష్కారాలు ఈ కథలలో కనిపిస్తాయి.


   ఈ కథలలోని పాత్రలు నిష్కల్మషంగా ఉంటాయి. ఎదుటివారి సమస్యలకు పరిష్కారాన్ని చూపేవిగా ఉంటాయి. ప్రగతిశీల భావాలను కలిగి ఉంటాయి. సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కోవాలనుకుంటాయి. తాము అనుభవించిన కష్టాలు ఇంకొకరు అనుభవించరాదని మనస్ఫూర్తిగా కోరుకుంటాయి. తమ సహచరులు పడే శ్రమను గుర్తించగలుగుతాయి. పోరాటంలో అంతిమ విజయం ఎప్పటికైనా తమదే అనే విశ్వాసంతో ఉంటాయి. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆత్మాభిమానాన్ని మటుకు చంపుకోవు. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తాయి. కానీ తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటాయి. తమకోసమే కాకుండా ఎదుటివారి కోసంకూడా పోరాటానికి సిద్ధపడతాయి. కొత్తతరం ఆలోచనలను స్వాగతిస్తాయి. ఈ పాత్రలలో ఎక్కడా తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి కనబడదు. తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సాధు స్వభావం కల పాత్రలివి.

   ప్రతి కథా చదివించేదిగా ఉంది. కథ ద్వారా తాను చెప్పదలచినది ఏమిటో రచయిత సమర్థవంతగా, స్పష్టంగా చెప్పగలిగారు. ఏదో సందేశాన్ని ఇచ్చినట్లు కాకుండా కథలో అంతర్లీనంగా తన అభిప్రాయాన్ని చొప్పించగలగటం ఈ రచయిత సామర్థ్యానికి అద్దం పడుతోంది.

   ఈ సంపుటికి ముందుమాట రాసిన వారు 'ఆకాశంలో సగం'కథలో రొమాంటిసైజేషన్' తారాస్థాయికి చేరుకుందని, ఉద్యమాలను రొమాంటిసైజ్ చేయడం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. హెచ్చుతగ్గుల మాట పక్కన పెడితే వ్యక్తి జీవితంలో రొమాన్స్, ప్రేమవంటివి ఒక భాగమని అంగీకరించాలి. ఉద్యమంలో ఉన్న వ్యక్తులు కూడా వీటికి మినహాయింపు కాదు.

  సత్యభాస్కర్ ఈకథల నేపథ్యాన్ని వివరిస్తూ తాను సంపాదకత్వ  బాధ్యతలునిర్వహిస్తున్న ఒక కార్మిక పత్రికలో ప్రచురణకోసం వ్రాసినట్లు తెలుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రొజెక్ట్ చేయటంలో సత్యభాస్కర్ కృతకృత్యులైనారు. అయితే 'బ్రాండెడ్' రచయితగా ముద్రపడకుండా వైవిధ్యభరితమైన ఇతివృత్తాలను ఎన్నుకుని విస్తృతంగా కథలను వ్రాయాల్సిన అవసరాన్ని ఈ రచయిత గుర్తించాలి.   మునుముందు సత్యభాస్కర్‌నుండి మరిన్ని మంచి కథలను ఆశించవచ్చు.  

9, డిసెంబర్ 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 33 సమాధానాలు!


అడ్డం: 
1. లీడర్‌లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది.  - డాబర్‌వాటికా 
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది. -  కొలనుపా (క)  
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్‌కూ ఉన్న సామ్యము. - హనుమాన్‌చాలీసా (తులసీదాసు రచించిన హనుమాన్‌చాలీసాను ఆంధ్రీకరించిన ఎం.ఎస్.రామారావుగారు సుప్రసిద్ధులు)   
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం. - బురుజు (కొండారెడ్డి బురుజు)
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :) - అనామకుడు (రామాశాస్త్రిగారి కలం పేరు.)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది. - టకోలోపాగా (కోటలోపాగా) 
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి. - గుహము (గుహము = గుఱ్ఱము)
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ. - నక్షత్రమండలము  
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక. - పాలపిట్ట
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి! - డుకుయనాథాక (కథానాయకుడు)
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో. - డా.సి.నా.రె.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా? - కామన్‌షేరు (common share)
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు. - పాడుతా తీయగా 
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట! - హరి నామ కీర్తన
6. కడగంటి చూపు! - సాచివిలోకితము 
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా. - బుడుగు 
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది. - జుటము (జూటము = ౙడముడి) 
9. అప్పుడప్పుడు! - అడపాదడపా
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. -  హనుమంతుడు 
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా? -  అనామిక (అనామిక = ఉంగరపు వేలు) 


8, డిసెంబర్ 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 33


ఆధారాలు: 
అడ్డం: 
1. లీడర్‌లో నటించిన ముద్దుగుమ్మ రిచా ఈ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తుంది.
3. నల్లగొండ, వరంగల్లు జిల్లాల సరిహద్దులోనున్న ప్రసిద్ధ జైనతీర్థం తోక తెగింది.
5. మోపర్తి సీతారామారావుకు, తులసీదాస్‌కూ ఉన్న సామ్యము.
7. కర్నూలులో కొండారెడ్డి పేరుమీద ఉన్న ఈ కట్టడం దర్శనీయం.
9. పేరున్న పేరులేని రచయిత. కాదు...కాదు...పేరులేని పేరున్న రచయిత. ఏమిటో అంతా తికమకగా ఉంది :)
10. 1975నాటి విఠలాచార్య సినిమా మొదట్లో తడబడింది. 
11. గుహ ముంగిట గుఱ్ఱం కట్టేశారేమో చూడండి.
14. ఎరిడనస్ దీనికి ఒక ఉదాహరణ. 
15. గుడిపాటి నడుపుతున్న సాహిత్య పత్రిక.
16. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి... ఈ పాట ఉన్న సినిమా కుడి నుంచి ఎడమకి!
నిలువు:
1. కర్పూర వసంతరాయలు కావ్యకర్త పొడి అక్షరాల్లో.
2. ఆంగ్లంలో ఉమ్మడి వాటా?
4. ఒక దశాబ్దం పైగా బాలసుబ్రహ్మణ్యం టీవీల్లో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం పేరు.
5. "యిది లేని కావ్యం, ఎన్ని అందమైన పదాలతో,అలంకార ప్రయోగాలతో ఉన్నా బురదకాలువలాగే అనిపిస్తుంది..." అని వ్యాసునితో నారదమహర్షి అన్నాడట!
6. కడగంటి చూపు!
7. హాస్యమందున అఋణ/అందె వేసిన కరుణ/___ వెంకటరమణ/ఓ కూనలమ్మా.
8. ౙడముడి మొదట్లో కుఱచ అయింది.
9. అప్పుడప్పుడు!
12. అంజనాదేవి, కేసరిల పుత్రుడు.
13. అడ్డం9.కి లింగమార్పిడి చేస్తే ఉంగరపు వేలు స్ఫురించిందా?