నవ్య వీక్లీ ఈవారం శ్రీశ్రీ ప్రత్యేక సంచికను తీసుకు వచ్చింది. ప్రస్తుతం స్టాండ్స్‌లో ఉన్న ఈ సంచిక (17-6-2009)లో శ్రీశ్రీ రచనలు కవితా!ఓకవితా!, మానవుడా!, బాలల వత్సరం, చరమరాత్రి (కథ)లతో పాటు శ్రీశ్రీతో పరిచయమున్న ప్రముఖ సాహిత్య వేత్తల వ్యాసాలున్నాయి. అద్దేపల్లి రామమోహన్‌రావు, రావికొండలరావు, కొలకలూరి ఇనాక్, కేతు విశ్వనాథ రెడ్డి, చలసాని ప్రసాద్,అదృష్ట దీపక్, అబ్బూరి చాయాదేవి, పాపినేని శివశంకర్, ఎం.వి.రమణారెడ్డి, పంతుల జోగారావు, శైలకుమార్, బి.కె.ఈశ్వర్, శ్రీపతి, ఎన్.వేణు గోపాల్, ప్రయాగ రామకృష్ణ, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, డి.వెంకట్రామయ్య,నిఖిలేశ్వర్, భూమన్ తదితరులు శ్రీశ్రీ తో తమ ప్రత్యక్ష అనుబంధాన్ని వివరిస్తే, వసంత లక్ష్మి, ఓల్గా తదితరులు శ్రీశ్రీ రచనలపై తమ వ్యాసాలను రాశారు. శ్రీశ్రీ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడంలో ఈ ప్రత్యేక సంచిక కృతకృత్యమయ్యింది. సాహిత్యాభిలాషులందరూ ఈ ప్రత్యేక సంచికను కొని చదివి దాచుకోవలసినదిగా నేను రికమెండ్ చేస్తున్నాను.
శ్రీశ్రీ జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది. ఆయన బలహీనతలను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. తన జీవిత చరిత్ర అనంతంలోను బయట అనేక సందర్భాలలోనూ తన బలహీనతల గురించి చెప్పుకున్నాడు.శ్రీశ్రీ జీవించి ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం మీద, దుర్వ్యసనాల మీద అనేక దుమారం రేగింది. అదంతా బహిరంగ రహస్యమే.అయితే ఇన్నేళ్ల తరువాత కూడా ఆ మహాకవి మరణించిన తరువాత కూడా శ్రీశ్రీ శతజయంతి జరుపుకుంటున్న ఈ తరుణంలో ఆయనను జ్ఞాపకం చేసుకునే నెపంతో అనవసరమైన విషయాలను ప్రస్తావించడం ద్వారా ఆయన జీవితంపై బురద జల్లడం, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటి చర్యలకు పూనుకోవడం హేయమనిపిస్తుంది. మన మధ్య లేని వ్యక్తిపై ఇలా వ్యక్తిత్వంపై దాడి చేయడం ఉద్దేశ్య పూర్వకంగానేమో అని అనుమానం కలుగక మానదు. ఈ పనికి పూనుకున్నది ప్రముఖ రచయితలంటే ఆశ్చర్యం కలుగకా మానదు.
ఈ రచయితలంతా కలిసి శ్రీశ్రీని ఒక తాగుబోతుగా మనకు పరిచయం చేస్తున్నారు అక్కడికేదో కొత్త విషయం కనుగొన్నట్టు.
అద్దేపల్లి గారు శ్రీశ్రీతో మరిచిపోలేని అనుభవాలు ఇలా తెలుపుతున్నారు.
ఆ రాత్రి వారిద్దరూ బస చెయ్యడానికి ఒక గెస్ట్‌హౌస్ తీసుకున్నాం. అక్కడ శ్రీశ్రీ, హరనాథ్, నేనూ, మరి నలుగురు విద్యార్థులు ఉన్నాం. వారిద్దరికీ మధువు కావాలి. అవి మద్య నిషేదం రోజులు. విద్యార్థుల్లో ఒక గొప్ప వ్యాపారస్థుడి కుమారుడున్నాడు. అతని ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించి మద్యం సీసాలు తెప్పించాలి....
...............
శ్రీశ్రీకి మద్యపానంలోని పరాకాష్ఠ దశ వచ్చింది.
...... శ్రీశ్రీ మధుపాన అనంతరం కుర్చీలో కూర్చొనే గాఢ నిద్ర పోతున్నాడు.......
....శ్రీశ్రీ క్రమక్రమంగా పైజామా పైకి లాగాడు. నిరాఘాటంగా మూత్రీకరణ జరిగింది.
కేతు విశ్వనాథరెడ్డి తన వ్యాసంలో ఎలా శ్రీశ్రీని డీఫేం చేస్తున్నారో చూడండి.
ఆయన అరచేతుల చొక్కా చిరిగి ఉంది.పైజామా కూడా అంత బాగాలేదు. మరో ఇస్త్రీ చేసిన బట్టల జతలేదు. అప్పటి కప్పుడు ఆలోచించి ..... చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చాడు. శ్రీశ్రీ ఒక్క ముక్క మాట్లాడకుండానే ప్రవక్త లాంటి చిరునవ్వుతో ఆ దుస్తులు వేసుకున్నాడు. టక్ చేసుకున్న ఆ దుస్తులతోనే అందరం ఫోటొ దిగాం.
ఇంతవరకు ఓర్చుకోవచ్చు. ఇది చదవండి.
... ఒకటి రెండు రోజుల్లో మద్రాసు వెళ్తారనగా ఆయనకు సరిగ్గా మంచి దుస్తులు లేని విషయాన్ని బంగోరె పసిగట్టాడు. యిద్దరం తిరుపతిలోని గాంధీరోడ్‌లో తీర్థకట్ట వీధికి ఆనుకుని మేడ మీద ఉన్న టైలర్ వద్దకు వెళ్లాం. తెల్లటి శ్రీశ్రీ మార్కు బట్టను కొని నాలుగు జతలు కుట్టించి తెచ్చాము.... శ్రీశ్రీకి నాలుగు జతల బట్టలు కుట్టించి ఉంటే కుట్టించి ఉండొచ్చు గాక. ఆ విషయాన్ని పేర్కొని శ్రీశ్రీ దారిద్ర్యాన్ని ఇప్పుడు ప్రస్తావించడం సబబేనా?
ఇక శ్రీశ్రీ తాగుడుకు సంబంధించి కేతు విశ్వనాథరెడ్డి ఇలా చెబుతున్నారు. .... సభానంతరం ఆ రాత్రి సన్నిహిత మిత్రులం ఓ ఐదారు మంది పార్టీ ఏర్పాటు చేసుకున్నాం..... శ్రీశ్రీకి కావలసిన ఏర్పట్లు ఉదయం నుంచీ చేయనే చేశాం. ఆ రాత్రికీ చేశాం.......
"ఇంకా వుందా" అనడిగాడు..... మాలోమేము గుసగుసలాడుకుని రమ్ము తెప్పించాము.....
తిరుపతిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న కవి శ్రీశ్రీ అభిమాని మా మిత్రుడు సమ్మద్ రెండు 'రాయల్ చాలెంజ్' సీసాలు తెచ్చి నా చేతికి ఇచ్చి "అవి మద్రాసుకు చేరే ఏర్పాట్లు చెయ్యండి" అన్నాడు. ఈ విషయాలన్నీ పేర్కొనడం అవసరమా?
ఇక కొలకలూరి ఇనాక్ గారి వ్యాసం కొంచెం, కొంచెం ఏమిటి పూర్తి తేడాగా ఉంది. శ్రీశ్రీ వర్ణ వివక్షత పాటిస్తాడన్న అర్థం వచ్చేటట్లు ఈ వ్యాసం కొనసాగుతుంది. కుమ్మరి కమ్మరి సాలెల అన్నారు గానీ మాలలు మాదిగలు అనలేదని అరోపిస్తున్నారు.తనతో తోడుండి భోజనం చేయమంటే తిరస్కరించి కుల వివక్షతను పాటించి ఆనేరం శ్రీశ్రీ పై వెయ్యడం ఇనాక్కే చెల్లుతుంది.
ఇంకా శ్రీశ్రీ మందు పురాణాన్ని ప్రస్తావించిన వారిలో అబ్బూరి చాయాదేవి, ఎం.వి.రమణా రెడ్డి, మురారి మొదలైనవారున్నారు.
శ్రీశ్రీ మద్యం గొడవ ఇన్నాళ్లైనా ఇలా కొనసాగించడం కేవలం యాదృచ్చికమేనా? లేక ఇంకా కుట్ర జరుగుతోందా? ఏది ఏమైనా శ్రీశ్రీ ఘనతకు లవలేశమైనా నష్టం వాటిల్లదు.
20 కామెంట్లు:
ఇవన్నీ నాకు ఇంతకు ముందు తెలీదు. ఇప్పుడే తెలిశాయి. ఇప్పటిదాకా ఆయనో మహాకవి అని మాత్రమే తెలుసు.
వాళ్ళేమో గానీ వాళ్ళన్నారని చెప్పి వాళ్ళ మాటలని మీరు బాగా ప్రచారం చేస్తున్నారు!
@abracadabra
Who gave the title "mahakavi" to srisri? He was just a drunkard with a few kavitalu and such. He is a nobody in fact. When he came to USA on the invitation of TANA or such one well known person asked him to write an introduction for his own book and if you read that book you will think there is no bigger idiot thatn sri sri.
ఈ తాగుబోతు గురించి ఇంతవరకూ తెలియని విషయాల్ని తెలియజేశారు.
తమిళులు సుబ్రమణ్య భారతిని, బెంగాలీలు రవీంద్రనాథ్ టాగోర్ నీ గర్వంగా ప్రపంచానికి ప్రాజెక్ట్ చేసుకుంటున్నట్టు తెలుగు వాళ్ళు ఇదిగో మా మహా కవి అని గర్వంగా చాటుకోవలసిన మహనీయుడిని గురించి అయన శాత జయంతి సందర్భం గా స్మరించు కుంటున్న తీరు చాలా బాధాకరం గా వుంది.
" మనవాళ్ళుట్టి వేద వాయిలోయ్ " అన్న గురజాడ మాట గుర్తుచేసుకోవడం తప్ప చేసేదేముంది.
జీడి పప్పు గారి వ్యాఖ్య " ...ఈ తాగుబోతు ... గురించి ఇంతవరకూ తెలియని విషయాల్ని తెలియజేశారు." పుండు మీద కారం చల్లినట్టు గా వుంది.
ఈ సంచిక రూపకర్తలలో ఒకరైన వేమన వసంతలక్ష్మి వ్యాసం చదివితేనే "నవ్య" శ్రీ శ్రీ ని ఈ నూరేళ్ళ పండుగ సందర్భంగా ఏవిధంగా సంస్మరణ (!) చేసుకోవాలనుకుందో బోధ పడుతుంది. అందులోనూ ఒక బ్లండర్ "" నేను రాసిన అద్భుతమైన కవితా పాదాలు ఇన్ని వుండగా నేను తాగి పడేసిన మందు సీసాల ఊసెందుకు"" అని శ్రీ శ్రీ అన్నట్టు రాసారు.
నిజానికి ఆ మాటలు అన్నది శ్రీ శ్రీ కాదు కాళోజీ !!
అప్పట్లో శ్రీ శ్రీ కీ దాశరధి కీ మధ్య గొడవయింది. ఇద్దరూ ఒకర్నొకరు దారుణంగా పత్రికలకెక్కి తిట్టుకున్నారు.
" మా తరానికి గురువు శ్రీ శ్రీ ... మా కలాలకు బలము శ్రీ శ్రీ " అన్న దాశరధే అదే నోటితో " ఒర్ శ్రీ శ్రీ నీ మహా ప్రస్థానం నీ పాలిటి మహా స్మశానం " అని అన్నారు.
అప్పడు ప్రజా కవి కాళోజీ జోక్యం చసుకుని ఇలా అన్నారు.
"వాడు రాసిన కవితలు గుబాలిస్తున్నప్పుడు
వాడు తాగి పారేసిన సీసాల కంపు మనకేదుకు రా ?"
అక్కడితో ఆ గొడవ సద్దు మణిగింది.
ఆ మాటలని శ్రీ శ్రీ చెప్పినట్టు చెప్తే ఎబ్బెట్టుగా అనిపించింది. ఎడిటర్ గారే ఈ తప్పు చేస్తే ఇక అడిగే దిక్కెవరు.
మొత్తం మీద ఆ నవ్య సంచిక జీడి పప్పు , అబ్రకదబ్ర లాంటి వారికి తప్ప శ్రీ శ్రీ అభిమానులకు ఏమాత్రం స్ఫూర్తి దాయకంగా లేదు.
నవ్య ఎలా ఉన్నదో, ఆ సంచిక ఏమి రాసిందో నేను చూడలేదు కానీ - ఇక్కడ వ్యాఖ్యలు చూసిందాని ప్రకారం అర్థం అయ్యింది ఏమిటయ్యా అంటే - ఎవరి నోటికొచ్చినట్టు వారు మాట్టాడ్డం అన్నది ఈ మధ్య కాలంలో గుత్తకి తీసుకోవటం ఎక్కువ అయ్యింది అని ......ఆయన తాగాడో, తాగిన విషయాలు తెలివి లేక నవ్య తెచ్చిన ప్రత్యేక సంచికలో ఇష్టం లేకున్నా ఏదో మాటాడాలని ఇరుక్కున్న మహానుభావులు తాగినోడి మీద చెబుతే అది కడుపుబ్బించే హాస్యం అనుకున్నారో, ఇక్కడ కామెంటేటర్లు తాగి మాట్టాడుతున్నారో తెలియట్లా...... నాకు ఆయన రాతలంటే అంత ఇష్టం లేకున్నా, సభాముఖంగా ఒక పెద్దాయనకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం కూడా తెలియని మూర్ఖులు , అది ప్రముఖ రచయితలు కానివ్వండి - కొద్దిగా సాహిత్య సంబంధ తెలివి ఉన్న మనిషి కానివ్వండి - ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. ఒక మనిషిని శతాబ్దపు కవి అనీ, మహా కవి అని సరుకు లేకుండా ఊరకే సంబోధించరు అన్న చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా...ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం, ఆయన రాతలా, ఆయన తాగుబోతు అనా.. తల ఎత్తుకుని ఈయన మనవాడు అని చెప్పుకోవాల్సిన మనిషిని, అది ఎవరయినా కానివ్వండి (ఒక విశ్వనాథ, ఒక జరుక్ శాస్త్రి, ఒక గిడుగు.....ఇలా బోలెడు - చాంతాడంత).- ఎందరో, కించపరచడం మానుకోవడం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే ప్రగతి......సమకాలీకులు, సమవయస్కులు, సమీప సంబంధాలు, సమీప మిత్రత్వాలు కలవాళ్ళు, కొట్టుకున్నారంటే అర్థం ఉంది, వయసుకి తగ్గ వ్యాఖ్యలు చేస్తే అర్థం పరమార్థం....వ్యక్తిగత జీవితమే రాతల తీరు నిర్దేశిస్తే, ఆ వ్యక్తిగత జీవితం వచ్చే వ్యాఖ్యలకి సగుణ రూపం అయితే అంతకన్నా దురదృష్టం లేదు.... ఇప్పుడు నేను తాగి మాట్టాడుతున్నానని అన్నా ఆశ్చర్యం లేదు.....ఎప్పుడయినా సరే , సాహిత్యం చదివేటప్పుడు రాతలను పట్టించుకోండి , రాసిన మనిషిని కాదు....నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి, వీలయితే నచ్చని ఆ రాతల కన్నా బాగా రాయడానికి చేతయితే ప్రయత్నించండి....సంస్కారం అబ్బితే సంతోషం ...
ఎవరేమన్నా "మరో ప్రపంచం"లో , "మహా ప్రపంచం"లో కూర్చున్న మనిషికి, శ్రీ శ్రీ యే కాదు - అది ఎవరయినా సరే శతకోటి నమస్కారాలతో....
శ్రీ శ్రీ గారు నా అభిమాన రచయిత. ఆయన ను ఇలా కించ పరచడం చాలా బాధాకరం
శ్రీశ్రీ తాగితే నాకేంటి? వ్యభిచరిస్తే నాకేంటి? హత్యచేస్తే నాకేంటి? తను రాసిన కవిత్వం నాకు ముఖ్యం. అంతే!
ఎవరిలో నైన లోపాలు మాత్రమె వెతకటం మనకున్న జబ్బేమో.
పైగా చనిపోయిన తర్వాత..
చలం, శ్రీ శ్రీ ల మాటికేమీ జిళ్ళేళ్ళ మూడి అమ్మ, సత్య సాయి బాబా అందరూ మన తో తిట్లు తిని మన (సమాజం) గూర్చి ఆలోచించిన వాళ్ళే.
వాళ్లకు మనమే మీ రూపాయి కూడా ఇవ్వలేదు కదా వాళ్ళను అనే హక్కు మనకేది?
అసలు సమస్య ఏమిటంటే మనకు తెలుపు, నలుపు రెండే తెలుసు. గొప్పవాడు అవ్వాలంటే పూర్తీ గా లోపాలు లేని వాడు అవాలి , దేవుడు లాగ. (అన్నట్టు మనం దేవుళ్లను కూడా వదలం రాముడు పెళ్ళాన్ని ఒదిలేసిన పురుషాహంకారి , కృష్ణుడు వ్యభిచారి, శివుడు కోపిష్టి మన దృష్టిలో )
ఈ మనస్తత్వం వాళ్ళ ఎవరికీ నష్టం. ? వాళ్ళు చెప్పిన మంచి వినలేని మనకే నష్టం.
వాళ్ళు చక్కగా మంచి పుట్టుకలు పుట్టి వుంటారు
ఓ వారం బట్టీ ఈ సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్నా. మీ బ్లాగు టపా చూసాక... చదవకపోవడమే మంచిదేమో అనిపిస్తోంది....
తెలుగు బ్లాగర్లు సంయమనం పాటించాలి.అబ్రకదబ్ర,అజ్ఞాత,జీడిపప్పు లకు తొందరపాటు తప్ప తెలుగు కవిత్వపు దారి మళ్ళించిన వ్యక్తి ని గుర్తించలేకపోవడం మరేం కాదు.
ఏమైనా కామెంట్ చేయొచ్చు,ఏదైనా రాయొచ్చు అనేది పోక పోతే తెలుగు బ్లాగు నాణ్యత ఇంకా దిదజారిపోతుంది.ఇప్పటికే జారుడు మెట్ల పై ఉంది.
తురుపు ముక్క గారి విమర్శనాత్మక వ్యాసం మాత్రం మంచి సాహిత్య గుళిక.
శ్రీ శ్రీ గారి అభిమానులకోసం వెలువరించిన పత్రిక ఇన్ని విమర్శలకు గురి అవ్వడం ..అదీ ఎవరకూ నచ్చినట్లు వారు రాయటం చూస్తే చాల భాధగా అన్పించింది .ఒక "కవి" అదీ కాలచక్రంలో మరుగయిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుకోవడం ! అయిన రచయిత అనగానే వారికేమయిన స్పెషల్ క్యారెక్టర్ వుండాలా,,వారు సామాన్యులే కదా అందరికి లానే వారికుండే భలహీనతలు వారికి వుంటాయి .నాకు తెలిసి శ్రీ శ్రీ తనకు నచ్చినట్లు తను వున్నాడు తనను మార్గదర్శకంగా తీసుకోమని ఎక్కడ చెప్పలేదు .....కే.మహేష్ గారు చెప్పినట్లు "ఆయన తాగితేనేమి .".........ఆయన కవిత ఇష్టం ....మహాప్రస్థానం చదివితే మనస్సు ఉప్పొంగదా...వ్యధతో మనస్సు తల్లడిల్లదా.....ఆయనలోని కవిని చూద్దాము ,వారి వ్యక్తిగతం మనకు అవసరం లేదు ..
@అమ్మలారా, అయ్యలారా:
శ్రీశ్రీ మీద ఉన్న అభిమానం మీలో కొందరు నా వ్యాఖ్యని తప్పుగా అర్ధం చేసుకునేట్లు చేసిందని చెప్పటానికి చింతిస్తున్నాను. నేనన్నది మరోసారి చదవండి.
>> "ఇవన్నీ నాకు ఇంతకు ముందు తెలీదు. ఇప్పుడే తెలిశాయి. ఇప్పటిదాకా ఆయనో మహాకవి అని మాత్రమే తెలుసు"
ఒక్క శరత్ మాత్రమే నేనన్నది సరిగా అర్ధం చేసుకున్నట్లున్నాడు ("వాళ్ళేమో గానీ వాళ్ళన్నారని చెప్పి వాళ్ళ మాటలని మీరు బాగా ప్రచారం చేస్తున్నారు"). నా వ్యాఖ్యలో దాగుంది కూడా అదే ఎత్తిపొడుపు. శ్రీశ్రీ ఓ మహాకవి అన్నది మీ అందర్లాగానే నా అభిప్రాయమూనూ - అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ.
ఇప్పుడు చెప్పండి. ఎవరిది తొందరపాటు?
అబ్రకదబ్ర, శరత్ 'కాలమ్', అజ్ఞాత, జీడిపప్పు,ప్రభాకర్ మందార, Vamsi M Maganti, కత్తి మహేష్ కుమార్,S, Sudha, చిన్ని గార్లకు మీ కౌంటర్లకు నా ధన్యవాదాలు. శ్రీశ్రీ సంస్మరణ పేరుతో ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపడంపట్ల కించిత్ ఆవేదనతో రాసిన టపా ఇది. అంతే కానీ ఆ అప్రాచ్యపు మాటలకు ప్రచారం కల్పించడం నా ఉద్దేశ్యం కాదు. నేను 'కోట్' చేసినవే కాకుండా మరికొన్ని మాటల్ని మినహాయిస్తే ఈ ప్రత్యేక సంచిక నిజంగా చాలా గొప్పగా వచ్చింది. భద్రంగా దాచుకోదగిన విలువైన సంచిక ఇది, కాబట్టి S గారూ తప్పకుండా ఈ సంచిక చదవండి. నా బాధ అంతా శ్రీశ్రీని స్మరించుకునే విధానంలో అసందర్భమైన, అసమంజసమైన విషయాలు చెప్పడం ఏమైనా విజ్ఞతగా ఉందా అన్నదే!
గొప్ప కవి మహగొప్ప వ్యక్తిగా మిగిలిపోవాలని లేదుకదా! శ్రీశ్రీ తాగితే, తాగి రోడ్డున పడితే, కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టాడన్న నిజాలు తెలిస్తే మాత్రం వారి కవితలకు విలువ తగ్గిపోతుందంటారా?
ఆయన కవితలతోపాటూ ఆయన వ్యక్తిత్వాన్నీ ప్రేమించగలిగితే ప్రేమిస్తాం. లేదా తన వ్యక్తిత్వాన్ని తగలబెట్టి కవిత్వాన్ని నెత్తికెక్కించుకుంటాం. ఇందులో బాధపడ్డానికి ఏమీ లేదనే అనుకుంటాను.
ఇదంతా చూస్తుంటే అరసం సభ్యులు నవ్య వీక్లీతో కలిసి పన్నిన కుట్ర అనిపిస్తోంది. అద్దేపల్లి, కేతు వీళ్లంతా అరసం వాళ్లే కదా?
...... నాకు ఆయన రాతలంటే అంత ఇష్టం లేకున్నా, సభాముఖంగా ఒక పెద్దాయనకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం కూడా తెలియని మూర్ఖులు ,
well said sir
its a good post with love and affection towards srisri.
as maganti said above, it is unfortunate to hear insulting remarks on great people, from certain bloggers, especially who donot know anything about their greatness or so.
some one referred a great poet who died fifty years back as goondaa, rowdy, murderer etc which is utterly a nonsence.
శ్రీశ్రీ కవిత్వం మొదట చదివిన వారు ఎవరూ ఈ Propoganda పట్టించుకోరు.
అయినా శ్రీశ్రీ ఏనాడూ తన కవిత్వంలో తాగుడు చెడ్డదనో మరో వ్యసనం చెడ్డదనో,వాటివల్ల సమాజం చెడిపొయిందనో ప్రస్తావించలేదు/బాధపడలేదు. There is no contradiction. మీరు అన్నట్టు శ్రీశ్రీ 'అనంతం'లో ఇంకా పెద్ద విషయాలే రాసుకున్నాడు. వీళ్ళందరికీ చెప్పాల్సిన సమాధానం మళ్ళీ మహాప్రస్థానం చదువుకోమనే !
కవితా కమలాలను ఏరుకో, అవి పుట్టిన వ్యక్తిత్వపు బురద నెంచక
క్షమించండి ఓ మహామహుడైన మహా కవి గురించి మీరు ఇలా కుసంస్కారం గా మాటలాడటం బాగోలేదు
కామెంట్‌ను పోస్ట్ చేయండి