...

...

5, మార్చి 2010, శుక్రవారం

శ్రీకృష్ణ సంకీర్తనములు - ఐదవ భాగము


ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు 
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప

71.గంగ తుంగ యమున - కావేరి నదులలొ
   మంగళముగ చేయు - మజ్జనమున కంటె
   రంగైన భక్తిని - రామ భజనము చేయు
   సంగతి ఫలమునకు - సాటిరాదు కృష్ణా                
 llకృష్ణll

72.అణురేణు తృణ కాష్ట - మన్నిటి యందును
   అణగి యుందువు నీవు - అఖిలలోకముల
   గణుతింప భక్తులకు - కల్పవృక్షము నీవు
   ప్రణుతి సేయుదు నిన్ను - పద్మనాభయ్య              
 llకృష్ణll
        

73.అంగన పనుపున - అటుకులను ధోవతి
   కొంగున ముడిచిన - కూరిమి భక్తుని
   సంగతి కనుగొని - సంతసమందితివి
   రంగుగ భాగ్యము - రయమున నిచ్చితివి              
 llకృష్ణll

74.కుక్షిని భువనములు - కుదురుగ కూర్మిని
   నిక్షేపము జేసి - నీరధి నడుమను 
   రక్షక వటపత్ర - రాజిని వెలుగుచు
   దక్షత పవళించు - ధన్యశ్రీకృష్ణా                         
 llకృష్ణll

75.ఆదణ్డకాటవిని - కోదండమును దాల్చి
   కోదణ్డ రాముడౌ - కోమలంబగు మూర్తి
   నాదణ్డ నిలిచి న - న్నయముగ రక్షింపు
   వేదణ్డమును బ్రోచు - విశ్వమోహన కృష్ణా               
 llకృష్ణll

76.తనువు మనువు హితులు - తల్లిదండ్రులు భార్య
   తనయులు సోదరులు - తథ్యములు గారయ్య
   వినయమున నమ్రత - వినుతింతు ప్రణుతింతు
   అనవరతము నిన్ను - ఆది దేవుడ! కృష్ణ                
 llకృష్ణll

77.విశ్వోత్పత్తికి - విరించివయితివి
   విశ్వరక్షణ జేయ - విష్ణువైతివి దేవ!
   విశ్వము జెరుపను - విశ్వనాథుడవు
   విశ్వాత్మక నిన్ను - వినుతింతు కృష్ణా                    
 llకృష్ణll
            

78.చూపు నీరూపము - సుందర దేవా!
   పాపములెల్లను - బాపుము స్వామీ!
   శ్రీపతి నిను భక్తి - స్థిరముగ నమ్మితి
   కాపాడు కరుణించి - కంజలోచన కృష్ణ                    
 llకృష్ణll

79.పాపములెల్లను - హరియించి జ్ఞాన 
   దీపము నాలోన - తేజరింపుము స్వామి
   తాపమునార్పుము - ధన్యునిగ జేయుము
   ప్రాపున జేరితి - పాహిమాం కృష్ణయ్య                     
 llకృష్ణll

80.అగణిత వైభవ - ఆదిపరబ్రహ్మ
   నగధర! కేశవ! - నారాయణ! కృష్ణ!
   భగవాన్ శ్రీహరి - భక్తజనవత్సల
   జగదీశ శౌరీ! - శరణు శ్రీకృష్ణయ్య                          
 llకృష్ణll

81.నీనామ భజనమున - నిరయము మాయమౌ
   నీనామ స్మరణమున - నిఖిల సౌఖ్యములు
   నీనామామృతమును - నెల్లపుడు జుఱ్ఱుచు 
   నీనామ భజనమున - నిరతముందును కృష్ణా              
 llకృష్ణll

82.అతిపాప కర్ములై - అవని చరియించిన
   మతిహీనులై స్త్రీల - మమతబడియుండిన
   సతతము నీనామ - స్మరణమున దవిలిన
   అతుల సౌఖ్యములెల్ల - అందరె కృష్ణయ్య                      
 llకృష్ణll

83.అపరాధములు గాక - అఘము పెక్కులు జేసి
   చపలుడై కపటుడై - చరియించి నానయ్య
   శ్వపచుడౌ దౌర్భాగ్యు - శాంతమౌన క్షమియించి
   కృపయుంచి నన్ను బ్రోవు - కృష్ణ! ముకున్దా                   
 llకృష్ణll

84.పాలు వెన్న మ్రుచ్చి - పారిపోవగ నీవు 
   ఱోల నిను గట్టినది - రోషమున నీ తల్లి
   లీలా వినోదమున - ఱోలను యీడ్చితివి
   బాలుడవు చూచితే - బ్రహ్మ గన్నయ కృష్ణా                     
 llకృష్ణll

85.పరమ దయానిధె - పతిత పావన రామ
   హరి హరి! గోవిన్ద - ఆనంద హరియనుచు
   స్థిరమతిని భజనమును - చేయుదులెల్లపుడును
   కరుణగాపాడుము - కంజ లోచన కృష్ణా                          
 llకృష్ణll

86.వనజాక్ష! వనమాలి! - భక్త వత్సల కృ
ష్ణ
!
   ఘనత చెందితివయ్య - కలుష సంహార దేవ!
   సనకాది మునులైన - సన్నుతింపగ లేరు
   నను బోటి వాడెంత - నిను వర్ణింపగ కృష్ణా                         
 llకృష్ణll

87.రఘు వంశ నాథా! - రామా నీజపము
   లఘుమతి కలవియె - లక్ష్మీశ! కృష్ణా!
   అఘములను బాపుము - ఆత్మ పరాయణ!
   రఘురామ రామ! - రామ శ్రీకృష్ణా!                                 
 llకృష్ణll

88.కరణ త్రయంబులను - కలిమి పేదలనైన
   నరుడే కర్మమైన - నయమొప్ప జేసినను
   హరికర్పణంబనుచు - ఆత్మ పలుకుట యెల్ల
   పరమ సుజ్ఞానము - పరికింప భువిలోన                           
 llకృష్ణll

89.నరపశువ మూఢుఢను - నయము కొంచెము లేదు
   దురితములు చేసి నే - దోషుడై బరగితిని
   అరయ నిను గుర్తింప - అలవి కాదు నాకు
   పరికింప దాపును - ప్రాపు నీవే కృష్ణా                               
 llకృష్ణll

90.కంటికి ఱెప్ప యే - కరణి రక్షించునో
   బంటును నన్నట్లు - బాయకను బ్రోవుము
   జంట నీవుండిన - జమునికైనను వెఱవ 
   కంటక పాపములు - కడచెదను కృష్ణా!                                
 llకృష్ణll

(సశేషము)

కామెంట్‌లు లేవు: