...

...

7, మార్చి 2010, ఆదివారం

శ్రీకృష్ణ సంకీర్తనములు ఆఖరిభాగము


ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు 
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప



91.జనములు నిను భక్తి - జగతిసేవింపని
   దినములు వ్యర్థమై - తిరిగిపోవుగాదె?
   తనువులస్థిరమనుచు - తమ మదిని దెలియక
   ధన కనక స్త్రీలను - దగిలి చెడుదురు కృష్ణా!                    
llకృష్ణll


92.కొంచెపు వాడనుచు - కోపగింపకు స్వామి!
   ఎంచకుము తప్పులను - ఇన్దిరేశా! కృష్ణా!
   కొంచమధికములు నీ - కృపకు గలేదే దేవా!
   అంచితముగ నన్ను - ఆదరింపుము కృష్ణా!                    
llకృష్ణll


93.పరనారి ముఖపద్మ - పయకుమ్భ మధ్యమును
   అరసి మోహింతురు - అజ్ఞానులై దేవా!
   నిరతి భక్తిగ నిన్ను - నిజమరసి సేవించు
   పురుషులకు నిరయములు - పూని అంటునె కృష్ణా           
llకృష్ణll


94.యమధర్మరాజునకు - అలుకగనేటికి
   కమలాక్ష! లక్ష్మీశ! - కామిత ఫలదా!
   విమలయౌ నామమును - వినుతి చెసేయుచును
   అమరనే దలచెదను - అనిశము కృష్ణా!                           
llకృష్ణll


95.కొన్ని మానిని బుట్టు - కొన్ని గ్రుడ్లను బుట్టు
   కొన్ని ధరణిని బుట్టు - కొన్ని భువి చమటలను
   అన్ని జన్మలకన్న - అరయ మానవ జన్మ
   సన్నుతింపగ శ్రేష్ఠ - జన్మము భువిలోన                          
llకృష్ణll


96.మానవ జన్మంబు - మహిని గల్గిన యపుడె 
   హీనుడై చెడిపోక - హితమైన మతి గలిగి
   జ్ఞానవంతుడగుచు - జ్ఞప్తీని సతతమును
   శ్రీనాథు శ్రీకృష్ణు - సేవించి మనుడయ్య                           
llకృష్ణll


97.భూధర! హర వినుత! పురుషోత్తమ నీదు
   పాదయుగళంబును - పాయక గొల్చెదను
   శ్రీధర! శ్రీకృష్ణ! - శ్రీనాథ యనుచును
   మోదమున భజియిన్తు - ముద్దు కృష్ణయ్య                       
llకృష్ణll


98.దుష్టుండ చాల నే - దుర్బుద్ధి గల వాడ
   దుష్ట చారిత్రుడను - ద్రుమార్గుడని యండ్రు
   నిష్టుడై నిను గొలువ - కష్టమని శరణంటి
   ఇష్టముగ చే బట్టి - ఏలుకొను కృష్ణయ్య                          
llకృష్ణll


99.దేహధర్మములకు - దీడై చెడిపోక
   మోహము లెగగోసి - బాహుళ్యమును బాసి
   శ్రీహరి! శ్రీకృష్ణ! - పాండు రంగయ్య
   పాహిమామ్యనుచును - భజియించి మనుడయ్య              
llకృష్ణll


100.అంభోజ నేత్రా! - అబ్ధిగంభీరా!
    జంభాసుర వైరి - సన్నుత చారిత్ర!
    కుంభీద్ర వరద - వైకుంఠవాసా! కృష్ణా!
    డింభకుడ! రక్షింపు - దేవ! పరమాత్మా!                        
llకృష్ణll


101.కర యుగ్మమున శం -ఖ చక్రములు గలిగి

    ఉరమున వజ్రాలు - మెఱయగ పతకమును
    శిరమున రత్నాల - చిన్ని కిరీటమును
    సిరినాయకుడైన - శ్రీహరి కృష్ణయ్య                              
llకృష్ణll


102.అప్పా! యని నిన్ను - ఆదరమున బిల్తు

    తప్పులెల్లను సైచి - దయ బ్రోవు దేవా!
    ముప్పున నీ స్మరణ - మోదమున స్మరణకు
    తప్పక గలిగింపు - తండ్రి కృష్ణయ్య                               
llకృష్ణll


103.శరణము నీ దివ్య - చరణ పద్మములు

    తరణములు భవ జలధి - దాటుటకెల్లన్
    హరణములు దురితౌఘ - ఆపదలకు, ఆ
    భరణములు ఆర్తులకు - భద్రముగ కృష్ణా!                      
llకృష్ణll


104.నీ పాద కమలములు - నిత్యము గొల్చుటయు

    నీ పాదార్చకుల తా - నేస్తమ్ము నాకున్
    అపారమైనట్టి - అఖిలభూత ప్రేమ
    తాపస మందార! దయసేయు కృష్ణా!                            
llకృష్ణll


105.మంగళము కేశవ! మాధవ! కృష్ణా

    మంగళము అచ్యుత! మధుకైటభాన్తక
    మంగళము నిత్యము - రంగుగశ్రీహరికి
    మంగళమనరయ్య - మహిత పూజ్యులారా                      
llకృష్ణll


106.జనులార! హరికీ - ర్తనములు భక్తిని 

    వినిన పఠించినను - వేడుక వ్రాయన్
    ఘనతర భోగభా - గ్యములను బొందుచు
    ఘనమైన ముక్తిని - కడకు సాధింతురు                         
llకృష్ణll


107.హరిహర బ్రహ్మ చై - తన్య త్రిమూర్తులు

    పురముఖ ద్వారమున - పూజ్యులై యుండగ
    బరగును గ్రమమ్ము - ధర కోడీహళ్ళి
    పురమున నివసింతు - పుణ్యాత్ములారా                        
llకృష్ణll


108.చెలువాంబ రామార్యు - శ్రేష్ఠా గర్భమున

    చెలువున బుట్టితిని - చెన్నరాయప్పనుచు
    చెలిమి నీకీర్తనల - చెన్న కేశవ స్వామి
    కలకాలమును బ్రోచి - కాంక్షలిచ్చుత                             
llకృష్ణll


109.కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!

    అప్రమేయ వరద! హరి! ముకున్ద!
    మిమ్ము జూడగంటి - మీ కృప గనుగొంటి
    అఖిల సౌఖ్య పదవు - లంద గంటి

110.శ్లో. కాయేన వాచా - మనసేన్ద్రియైర్యా
      బుధ్యాత్మ నావా -ప్రకృతే స్వభావాత్
      కరోమి యద్యత్య - కలం పరస్మె
  శ్రీమ్మన్నారాయణౌ యేతి సమర్పయామి

ఓమ్ తత్సత్
శ్రీకృష్ణార్పణమస్తు
శ్రీకృష్ణ సంకీర్తనములు  సంపూర్ణము

1 కామెంట్‌:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మురళీ,
ముత్తాత గారు శ్రీ. చన్న రాయప్ప గారి శ్రీ కృష్ణ సంకీర్తనలు నెట్లో ఉంచి దానికి శాస్వతత్వాన్ని కల్గించావు. ధన్యవాదాలు.

ఫణి