...

...

18, మార్చి 2010, గురువారం

మనిషి - కథల సంపుటి



మిత్రుడు యస్.డి.వి అజీజ్ గారి కథల పుస్తకం మనిషి ఎట్టకేలకు ప్రకటింపబడింది. ఈ పుస్తకాన్ని మా సంస్థ అబ్జ క్రియేషన్స్ ద్వారా ప్రచురించాలని అజీజ్‌గారు ఆశించారు. కానీ వ్యక్తిగత కారణాలవల్ల అది వీలు పడలేదు. చివరకు పాలపిట్ట బుక్స్ వారు ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని తురుపుముక్క పాఠకులకు టూకీగా పరిచయం చేయాలనిపించి ఈ టపా వ్రాస్తున్నాను. మూడు దశాబ్దాలకు పైగా రచనావ్యాసంగంలో ఉన్న యస్.డి.వి.అజీజ్ సుమారు 200పైచిలుకు కథలు వెలువరించారు. దాదాపు అన్ని పత్రికలు వీరి కథల్ని ప్రచురించాయి. ఈ కథల్లో 18 కథల్ని ఎంపిక చేసుకుని ఈ పుస్తకరూపంలో మనలకు అందిస్తున్నారు. ఈ కథల్లో మనకు రచయిత అంతరంగం, సమాజం పట్ల వీరికి ఉన్న అవగాహన స్పష్టంగా గోచరిస్తున్నాయి. సర్వోత్కృష్టమైన మనిషి జన్మనెత్తినందుకు మనం మనజీవితాన్ని ఏదోరకంగా సార్థకత చేకూర్చాలన్న కోరికను  ఈ కథల్లో రచయిత బలంగా చెపుతున్నారు. ఈ సంపుటంలో వీరి మొదటి కథ ఎర్రకాగితాలు మొదలుకొని  మొన్న కర్నూలును ముంచెత్తిన వరద తాలూకు అనుభవాల కథ ఉప్పెన దాకా రచయిత రచనానైపుణ్యం మనకు కనిపిస్తుంది. ఎక్కడా విసుగు కలిగించకుండా చదివించే ఈ కథల్లో మనకు ఎటువంటి ఆసక్తిని కలిగించే సంఘటనలుగానీ ఉత్కఠతను రేపే మలుపులు కానీ కనిపించవు. కానీ మంచి కథను చదివామన్న తృప్తి మాత్రం మిగులుతుంది. ఈ పుస్తకాన్ని కీ.శే.హేమలతాలవణం గారికి అంకితమివ్వడం ఉచితంగా ఉంది. ఇంకో విశేషమేమిటంటే నాకు మొదటిసారి ఒక పుస్తకానికి ముందుమాట వ్రాసే అవకాశం ఈ పుస్తకం కల్పించింది. నా అభిప్రాయాలతో పాటు డా.కొలకలూరి ఇనాక్ గారి పీఠిక కూడా ఈ పుస్తకంలో ఉంది.  ఈ పుస్తకంలోని కథల్ని వివరంగా పరిచయం చేయడం లేదు. ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును చూస్తే సరిపోతుందనే చందంగా ఈ సంపుటిలోని కథలు ఎలావుంటాయో తెలియాలంటే ఒక కథను చదివితే సరిపోతుంది కదా! ఈ సంపుటిలోని ఒక కథ రుణం నా కథాజగత్‌లో ఇదివరకే ప్రకటింపబడింది. మీలో చాలామంది ఇదివరకే ఆ కథను చదివేవుంటారు. చదవనివారు ఇప్పుడైనా చదవండి. ఈ పుస్తకానికి దానికి మించిన పరిచయం మరొకటి అవసరం లేదు. ఈనెల 21న కర్నూలు పట్టణంలో ఆవిష్కరింపబడుతున్న ఈ పుస్తకం వెల 60 రూపాయలు. ప్రతులకు పాలపిట్ట బుక్స్,16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సి, సలీంనగర్,మలక్‌పేట్, హైదరాబాద్ 500 036,సెల్:+919848787284 ను సంప్రదించండి.

కామెంట్‌లు లేవు: