...

...

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఏకాంతంతో చివరిదాకా

కథాజగత్ లోని కథల విశ్లేషణపై తురుఫుముక్క బ్లాగువారు పెట్టిన పోటీ లో విశ్లేషించటానికి నేను ఎంపిక చేసుకున్న కథ  ఏకాంతంతో చివరిదాకా  -అరుణ పప్పు గారిది.  ఇదే ఎంపిక చేసుకోవటానికి ముఖ్య కారణం చూడగానే ఆకర్షించిన కథ పేరు.  ఆ పేరు ఎందుకు పెట్టారా అని కథ చదివాను.  రెండవ ఆకర్షణ రచయిత్రి  పేరు.  తెలుగు బ్లాగు లోకానికి సుపరిచితమైన జర్నలిస్టు.  ఏం రాశారో చదవాలనే కుతూహలంతో చదివాను.

అబ్బాయి, అమ్మాయి రొటీన్ ప్రేమ కథలు కోరుకునేవారికి నచ్చకపోవచ్చీ కథ.  అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం అనుకునేవారికి ట్రాష్ గా అనిపించవచ్చు.  మనసున మనసై అని పాడుకునేవారికి ఇష్టంగా అనిపించవచ్చు.  లోకోభిన్న రుచికదా.

అస్తిత్వంలో వున్న సాంఘిక, నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించు కున్నవన్న సంపూర్ణమైన అవగాహన గలిగినవాడు... వాటిని అధిగమించటానికి సంశయించని వాడు... కళాకారుడైనప్పుడు.... వాడు సంఘంలో ప్రస్ఫుటమైన అరాచకుడిగా కనపడ్డం చాలా చాలా సహజం.  ఉన్నతమైన భావ చిత్రీకరణకు అద్దం ఈ వాక్యం.  అంతరంగంలో ఎంత మధన జరిగివుంటే ఇలాంటి వాక్యాలు బయటకొస్తాయి.  అలాగే రచయిత్రి కళాకారుడి అరాచకత్వానికిచ్చిన అద్భుత నిర్వచనం ఈ కధని ఉన్నత స్ధానంలో నిలబెడుతుంది. 

మనిషి మనసుని చేతనపరిచేది ఆత్మీయుల చిన్ని ప్రోత్సాహాలు.  అలాంటి ప్రోత్సాహాలని, వాటిద్వారా పొందిన చేతనత్వాన్నీ అందంగా మలచారు కథలో...బొబ్బిలి వీణ దుమ్మయినా దులపాలనిపించటం, కార్టూన్లని కాపీ చెయ్యటం మానేశాననటంద్వారా.

మనుషులు వున్నప్పుడు ప్రేమించాలి, వాళ్ళకోసం చెయ్యాల్సిందేమైనా వుంటే బతికున్నప్పుడే చెయ్యాలి ... తనకి తోచిన మంచిని నిర్భయంగా చెప్పారు రచయిత్రి.  అంత సీరియస్ సంభాషణలో  కాళ్ళొకసారి ఫోన్లో పెట్టమ్మా దండం పెట్టుకుంటా...  రచయిత్రి హాస్య చతురతకి నిదర్శనం.

మధ్యలో అంతరాత్మ మందలింపులతో తరచి చూసుకునే వివేకం.... ఘనీభవించిన మౌనంలో కూడా దొరికే సమాధానాల గురించి చెప్పిన నేర్పు బాగుంది.

అలాగే ఒక మహాద్భుత అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాన్ని బుధ్ధితో బేరీజు వేసుకుని తుడిపేసేంత వెర్రితనం నాకు లేదు మరి......ఉన్నతమైన భావ వ్యక్తీకరణ, చక్కని రచనా శైలి, కథలో అంతర్లీనంగా సాగే మానవత్వ, మమతల విలువలు, అర్ధం చేసుకుంటూ చదవాల్సిన కథ ఇది.  అర్ధమయితే మరచి పోలేని కధ... వెరసి ఒక ఉత్తమ కథ.

కథాజగత్తులోని శ్రీమతి అరుణ పప్పుగారి ఈ ఏకాంతంతో చివరిదాకా మీరు కూడా కొంచెం రుచి చూడండి.  లింకు ఇదుగో.....
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/ekantanto-civaridaka---aruna-pappu
- పి.ఎస్.ఎం.లక్ష్మి

(సౌజన్యం: అంతరంగ తరంగాలు) 

కామెంట్‌లు లేవు: