...

...

21, ఫిబ్రవరి 2011, సోమవారం

అంతర్ముఖం - కథావిశ్లేషణ


అంతర్ముఖం..రచన:అడపా చిరంజీవి 

జీవితం ఒక వరం,ఒక బహుమతి,ఒక అనుభూతి.ఇలాంటి ఎన్నో విశేషణాలకు ఆధారం జీవితం.జీవించడం తెలిసినవారికి జీవితమొక మురళీనాదం,వీణాగానం.జీవించడంలో లయ ఉండాలి.జీవితాన్ని శృతి చేయడమెలాగో తెలియాలి.లయబద్ధమైన,శృతిపక్వమైన జీవితం జీవన వేదమే!

మరయితే జీవితం అందరికీ వరమేనా?కాదు..జీవితం మాకు వరం కాదు, మాకు జీవితమొక శాపం అంటారు మరి కొందరు.అందుకే జీవితానికి చరమగీతం పాడాలనుకుంటారు. మనిషి అస్తిత్వానికి జీవించడమే మార్గం. ఎన్నో జన్మలక్కరలేదు ఒక్కసారి మాత్రమే జీవించగలిగే జీవితాన్ని సరియైన పంథాలో జీవిస్తే చాలు.

చేతకానితనం, అశక్తత, భయం, విరక్తి, విసుగు - ఇవన్నీ సంఘర్షణకు కారణాలే. సమస్యలను పరిష్కరించుకోలేక, సంఘర్షణకు తలవంచిన ఓ వ్యక్తి జీవితం చివరికెలాంటిమలుపు తిరిగిందో విశ్లేషణాభరితంగా చెప్పే కథే అడపా చిరంజీవి రచించిన అంతర్ముఖం.

సాధారణంగా మరణవేదన సహజమరణాలలో లేదా ప్రమాదాలలో మరణించేవారికి అనుభవైకవేద్యం.కాని ఇక్కడ మరణించేందుకు ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలియక మరణవేదనకు గురవుతాడు ఒక వ్యక్తి.చివరకు శిఖరాగ్రమే తనను క్రిందకు తోసి పైకి పంపగల చక్కటి మార్గం అనుకుని ఆచరణ దిశగా అడుగులు కదపాలనుకుంటాడు.

సరిగ్గా ఆ క్షణం అతడి భుజంపై పడ్డ చెయ్యి, ఆవ్యక్తిని ఆ దుష్ట క్షణానికి దూరంచేస్తుంది. అయ్యో!ఆత్మహత్యలతో అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యులకు ఇలాంటి చెయ్యి దొరకివుంటే, అనుకున్నప్పుడు మనసులు కలుక్కుమనక మానవు.ఆ చెయ్యినందించిన ఋషివర్యుడు తనతోపాటు ఆ వ్యక్తిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి తన శిష్యులద్వారా అతనికి భోజనం, వ్యాహ్యాళి,పడక ఏర్పాటు చేస్తాడు. అక్కడ లభించిన ప్రశాంతత అతడిలో మరణించాలనే నిరాశను దూరంచేసి బతకాలనే ఆశను కల్పిస్తుంది.అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఋషి సంధించిన ప్రశ్నావళి అతడిలో ఆలోచనలను కదుపుతుంది. అతడికి జీవితంపై ఆశ ఎందుకు తగ్గిందో తెలుసుకోవాలనుకుంటాడు ఋషి. ఆర్థిక ఇబ్బందులే తనను ఆవేదనకు గురి చేస్తున్నాయంటాడు ఆవ్యక్తి.

మరి అతని జీతంపై ఆధారపడ్డ ఇంటి యజమాని, బియ్యం, సరకులను అమ్మే వ్యాపారి, క్షురకుడు, రవాణా సౌకర్యాన్ని అందించే ప్రభుత్వము---ఇలా ఆధారపడ్డవారు ఆవ్యక్తి మరణంతో ఎంత నష్టపోతారో వివరిస్తాడు ఋషి. కోరుకున్నవేవి అందుబాటులోకి రావనే బెంగ ఆవ్యక్తిని తొలుస్తూనే వుంటుంది. చివరికతడు ఋషి మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించి తన అసంగత ధోరణిని విడనాడడం ఆశావహమార్పు. కథలోని కీలకాంశం ఇదే!ఏ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు.

మనిషికి కావలసిన కనీసవసరాలు తిండి, బట్ట, నీడ. ఇవికాక కోరి కావాలనుకున్న అవసరాలు మనిషిని వక్రమార్గాన ఆలోచింప చేస్తాయి. మంచి మార్కులు రాలేదని,ఉద్యోగాలు పోయాయని, జీతం చాలదని, ఈ జీవించే జీవితం బాగాలేదని ఇలాంటి వక్రపుటాలోచనలతో జీవితాన్ని మరణానికి ఎరగా వెయ్యడం మనిషి ఆలోచనాశూన్యతను తెలియచేస్తుంది. కోరికలే బాధకు, ఆవేదనకు,సంఘర్షణకు మూలకారణం. చివరికి తీరని కోరికలే మరణ మృదంగాలుగా మారి దుర్బల హృదయులను ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆత్మీయులకు తీరని శోకానికి గురిచేస్తున్నాయి. జీవితంలో ఒక్కసారే జీవించగలిగే మానవ జన్మ చరితార్థంకావాలి అనే నిజాన్ని ఈ కథ చక్కగా ఉద్భోదించింది. అసలీకథ బలహీన మనస్కులకు పాఠ్యాంశం కావాలి. వారి జీవితాలను శృతిచేయగల జీవన కృతి అనదగ్గ కథ అంతర్ముఖం.  

- C.ఉమాదేవి 

 

కామెంట్‌లు లేవు: