...

...

28, ఫిబ్రవరి 2011, సోమవారం

మానవ ప్రయాణంపై ఒక సమీక్ష!

మానవ ప్రయాణం - కథాజగత్ పోటీ         
         
         ఈ కథ చదవాలంటే మీరు ఇక్కడ చదవొచ్చు.

         వారణాసి నాగలక్ష్మిగారి  ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే అన్ని రకాలుగానూ సుఖంగా వున్నా కూడా మానవుడికి ఇంకా ఈ అసంతృప్తి ఎందుకనుకుంటూ దానిని మానవుల జీవన విధాన పరిణామక్రియకి అనుసంధానించి కథ చెప్పడమనేది అంత తేలికైన విషయం కాదు. అందుకే నాకు నచ్చింది. 
            

            జీవన్మరణాలనేవి మానవ జీవితం లో్ జరిగేవే. పుట్టాక మనిషి ఎలా జీవించాడో, జీవిస్తున్నాడో మనకి తెలుస్తుంది. భౌతికంగా కనిపిస్తుంది. కాని మరణానికి చేరువయిన మనిషి అంతరంగాన్ని శతాబ్దాలుగా మానవ జీవనవిధాన పరిణామదశతో పోల్చి చెప్పడమన్నది మామూలు విషయం కాదు. అక్కడే కథ మొదలౌతుంది.
            
                మనిషి ఆటవిక దశ నుండి, పరిపాలనాధికారం కోసం యుధ్ధాలు చేసే కాలం దాటి, బానిసత్వ శృంఖలాల నుండి బయటపడేందుకు స్వతంత్ర పోరాటం సాగించే అధ్యాయం ముగించుకుని, స్వతంత్ర భారత దేశంలో రైతుల ఆత్మహత్యల పర్వం దాటి, సాంకేతిక విద్యని సమర్ధవంతంగా వుపయోగించుకుంటూ, తన చుట్టూ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగే నవ నాగరిక సమాజం వరకూ సాగించిన ప్రయాణం ఈ కథలో చెప్పబడింది.
             
                 నవనాగరిక సమాజం ఏర్పడ్డాక , ఈ కథలో ప్రధానపాత్ర అయిన "మానవ్" తను విలాసంగా బ్రతకడానికి అన్ని హంగులూ అమర్చుకుని కూడా, దానితో తృప్తి పడలేక ఇంకా ఏదో చేసెయ్యాలనే తపనతో చేసిన పనే "బంగీ జంపింగ్". దీనినే "థ్రిల్" అంటుంటారు కొంతమంది. ఇది ప్రమాదకరమని తెలిసికూడా ప్రమాదం అంచులకి వెళ్ళినప్పుడు ఎలా వుంటుందో ననే ఒకరకమైన థ్రిల్ కోసం చేసిన సాహసం. ఆ సమయంలో అతను మరణం అంచులను స్పృశించినప్పుడు కలిగే భావాల మాలికే ఈ కథ.            

                   ఒకప్పుడు కడుపు కింత తిండి, అది దొరికాక ఎండావానలకు రక్షణగా బట్ట, అదీ దొరికాక స్థిరనివాసాలు ఏర్పరచుకోవడంలో వుండడానికో ఇల్లూ ఇలాంటివన్నీ ప్రాధమికావసరాలు. రోజులు గడిచేలొద్దీ ఆ తిండిలోనే రకరకాల రుచులు, కట్టుకునే బట్టలోనే వివిధరీతులు, ఆఖరికి నివసించే ఇల్లు కూడా రూపాలు మారడమే కాదు దాని భావాలు కూడా మారిపోతూ వచ్చింది.
           
                 ప్రకృతికి అనుగుణంగా మెలగవలసిన ఈ పాంచభౌతిక శరీరం కోసం ప్రకృతి లోని వనరు లన్నింటినీ పీల్చి పిప్పిచేసి కృత్రిమంగా తన విలాసాల కోసం వినియోగించుకుంటున్న ఈ నవ నాగరిక మానవుడు ఇంకా ఏదో కావాలనీ, ఇంకా ఏదో సాధించాలనీ తహతహలాడిపోతున్నాడు. దేనికోసం అతని తపన? ఇంకా ఏమి సాధించాలని అతని ఆతృత? మరి మనిషికి ఇంక తృప్తి అంటూ వుండదా..
                
                     అన్నీ అనుభవిస్తూకూడా ఇంకా ఏదో కావాలనుకుంటూ తృప్తి లేకుండా పరుగులు పెట్టే ఈ మనిషి అసలైన తృప్తి ఎక్కడుందో తెలుసుకుందుకు ఎఫ్ఫుడైనా ప్రయత్నించాడా? నిజంగా చెప్పాలంటే మనిషికి తృప్తి అన్నది బైట ఎక్కడో లేదనీ, అతని లోకి అతను చూసుకుంటే అతనిలోనే వుందనీ తెలుస్తుంది. మనిషి అంతర్ముఖుడైతే కలిగే ఆత్మతృప్తి మరింక ఎక్కడా కనపడదు. అసలైన ఆ విషయం తెలీక మానవుడు అంతరిక్షానికి ప్రయాణించగలిగి కూడా ఇంకా ఏదో తెలీని తపనతో కొట్టుకుపోతున్నాడు. మనిషి తనలోకి తను చూసుకోకపోవడం వల్లే ఈ తపనంతా.
         
                 చివరలో మానవ్ అవిశ్రాంత ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది అనే మాటతో ముగిసిన ఈ కథ చరిత్ర పునరావృత మవుతుందన్న సత్యాన్ని మరోసారి చెప్పినట్టయింది.   
- శ్రీలలిత 

(సౌజన్యం:శ్రీలలిత)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి