...

...

16, ఫిబ్రవరి 2011, బుధవారం

శ్రీరమణగారి ధనలక్ష్మి

తురుపుముక్క ఆ మధ్య నిర్వహించిన కథాజగత్ కథావిశ్లేషణ పోటీలో వచ్చిన విశ్లేషణల్లో వేదుల సుభద్రగారి విశ్లేషణ ఇక్కడ చదవండి.

        మిథునం కథ మొదటిసారి చదివినప్పటినించీ నేను శ్రీ రమణ గారికి పెద్ద అభిమానిని. ఇక ప్రస్తుతం నేను ప్రస్తావించదలుచుకున్న కథ ధనలక్ష్మిని మొదటగా వారి కథాసంకలనంలో చదివాను. రమణగారి కథలలో నాకు నచ్చేది ఆద్యంతమూ ఆకట్టుకునే కథా,ఎంతో సులువుగా, అలవోకగా సాగిపోతూనే ఎక్కడా పట్టు సడలని కథనం. తీయని చెరుకురసంలా అనిపించే తేట తేట తెలుగు భాషా. ఒక్క వాక్యం కూడా ఎక్కువగా రాసినట్టు అనిపించదు,  ఏ కలం వాడతారో మరి?

               గారాబంగా పెరిగిన దత్తుడు సీతారామాంజనేయులూ, అష్టవర్షాత్.. అనే మాటకి ఊపిరులూదుతూ ఎనిమిదేళ్ళకే అతని భార్య అయిన ధనలక్ష్మీ, ‘నేను ‘ అని ప్రథమ పురుషలో కథ మనకి చెప్పే పాత్రా, ఆయన బ్రాకెట్ బి.ఏ అర్ధాంగి శకుంతలా కథలో ముఖ్య పాత్రలు. రామాంజనేయులు తండ్రి ఈశ్వరయ్య గారి హయాంలో గుమాస్తాల మోసం వల్ల పోయిన ఆస్థినీ, వ్యాపారాన్ని ధనలక్ష్మి తెలివితేటల వల్ల మళ్ళీ నిలబెట్టుకోవడమే కాక, దానికి నాలుగింతలు ఎలా పెరిగారు అనేది స్థూలంగా కథ. భార్యాభర్తలిద్దరూ చదువుకోలేదు, అయినా బి.ఏ చదివిన మన కథకుడినీ(కథ ఈయన పరంగా చెప్పారు కనక సౌలభ్యం కోసం ఇలా అంటాను), చిన్నప్పుడు చదువు చెప్పిన మేస్టారినీ కూడా వారిదగ్గర పనిలో పెట్టుకుంటారు. అదీ ధనలక్ష్మి చాకచక్యం.

               కథలో ప్రత్యేకతలేమిటి? అని నన్ను అడిగితే  చాలా  ఉన్నాయి. కథానాయకి ప్రదర్శించిన లక్షణాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే ఒక సరికొత్త బిజినెస్స్ మేనేజ్మెంట్ పుస్తకం రాయవచ్చు. ఇదేమాట మన కథకుడి భార్య శ్రీమతి శకుంతల కూడా అంటుంది. “ఓవర్ టైముకి ఓదార్పన్నమాట. తెలివంటే మీ చెల్లిదే. ఈ వ్యాపార మర్మాలన్నీ ఒక పుస్తకం రాయించడి. ఎం.ఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓ పుస్తకంగా పెట్టొచ్చు” అని. నాదీ అదే మాట. వ్యాపారానికీ బడిలో చదివిన చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు అని నిజజీవితంలో చూపించిన గొప్ప వ్యాపారవేత్తలకి నిలువెత్తు దర్పణం మన ధనలక్ష్మి.

          ఆ లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

1. అవకాశాన్ని గమనించడం- ఆలస్యం కాకుండా అందిపుచ్చుకోవడం : ‘చీమలకింత చక్కెర దొరకగా లేనిది మనకి నాలుగు మెతుకులు దొరకవా” అని సాధారణంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా ఊరిలో ఎక్కడా పిండి మర లేదు కదా అని గమనించింది, ఆ దిశగా పావులు కదిపింది.

2. రిస్క్ తీసుకోవడం, దానిని తట్టుకోగలడమూ: ఆమె తలపెట్టిన పనిలో విజయం ఎంతవరకూ దొరుకుంది? అనేది తెలీదు, మాటకారితనం తెలియని భర్త సమర్ధత మీద నమ్మకంలేదు.  అయినా నగా నట్రా అమ్మి మిషను పెట్టడానికి సిద్దపడింది. డబ్బు తక్కువ పడితే తీర్చే ఉపాయాన్నే తనే సూచించింది కూడా. మొదట్లో ఇలా ఉన్నా తరవాత కనీసం కాలిక్యులేటెడ్ రిస్క్ కూడా లేకుండా పని సాధించుకుంటుంది. ఎరువుల వాగను విషయంలో.

3. వనరులు వినియోగం : రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ రిటెన్షన్ చాలా ముఖ్యమైనవి కదా. అందుబాటులో ఉన్నవారిని అనునయంగా చెప్పి వప్పించి ఉపయోగించుకోవడమూ. మంచితనంతోనూ, లౌక్యంతోనూ వారి మనసులు గెలుచుకోవడమూ మన ధనలక్ష్మి కి వెన్నతో పెట్టిన విద్య. మీ కష్టం ఊరికే ఉంచుకోములే అన్నయ్యా, సరుకే లాయికీ.  మీ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మన కొట్లోంచే అని కధ చెప్పినతన్నీ, మల్లెపూలూ, జిలేబీలు ఇచ్చి అతని కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోమని అతనికి చెప్పినా నిజానికి ప్రసన్నం చేసుకున్నది తనే. ఉపకారాన్నీ, ఉపకారులనీ ఎప్పుడూ మర్చిపోదు, సముచితంగా సత్కరిస్తుంది.

4. వ్యాపార విస్తరణ: పిండి మరతో మొదలుపెట్టినా, సున్నిపిండి దానికి జత చెయ్యడమూ ( నిజమైన వ్యాపారస్థులకి వృధా అన్న మాటే తెలియదంటారు), ఊరికెలాగూ సెంటరైపోయింది కనక ఇక్కడే మన కిరాణా కొట్టు మనం పెట్టేసుకుంటే బావుంటుంది అని కిరాణా కొట్టు పెట్టేయడమూ. తీర్థయాత్రల సదుపాయాలు ఊరందరికీ సమకూర్చడమూ, ఊరిలో స్థలం చవగ్గా దొరికితే దాని కొని గోడవున్ గా మార్చేయడమూ.. ఇవన్నీ ఆమె వ్యాపార దక్షతకి తార్కాణాలు.

5. వినియోగదారుల సంతోషం: కస్టమర్ ఈజ్ కింగ్ అన్న సూత్రాన్ని మనస్పూర్తిగా నమ్మడమే కాక ఆచరణలోనూ చూపిస్తుంది ధనలక్ష్మి. దానివల్ల పేరే కాక, నమ్మకమూ, కొత్త ఖాతాలూ సాధిస్తుంది. భర్త కక్కుర్తి దానివి అన్నా పట్టించుకోదు సరికదా. మంత్రసాని తనం ఒప్పుకున్నాకా ఎదొచ్చినా పట్టాల అంటుంది. ఇది తప్పకుండా ఆమె అంకిత భావాన్నీ, పోటీదారులలో పొడుగ్గా ఎదగాలన్న ఆమె తపననీ సూచిస్తుంది.

6. పట్టూ- విడుపూ: ఉత్తమ వ్యాపారులకి ఉండవలసిన లక్షణం పట్టూ విడుపూ ఉన్నట్టు కనపడటం. పట్టు తనదే అయినా విడిచినట్టు నటిస్తూనే భర్తని ఎంతో నేర్పుగా తన వైపు తిప్పుకుంటుంది. తన మనసులోని మాట అతని నోట వచ్చేలా చేసి కధకుడిని కూడా ఆశ్చర్య పరుస్తుంది. “ఎంత ఉన్నా సంసారంలో సుఖశాంతులు లేకపోతే ఏం లాభం?” అని కీలెరిగి వాతలు పెట్టినట్టు తెలియకుండానే పెట్టుకొని గెలుచుకుంటుంది.
ఇవన్నీ చాలవూ మన ధనలక్ష్మి తెలివి తేటలూ, వ్యవహార దక్షతా తెలియజెయ్యడానికి.

అసలు ధనలక్ష్మిలో నాకు చాలా మంది కనిపిస్తారు.
1. “అమ్మా నువ్వు నాతో ఉంటే నేను మిగతా లక్ష్ములనందరినీ వెనక్కి తెచ్చుకుంటానని” అన్నారుట వెనకటికెవరో ధైర్యలక్ష్మితో. ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని నమ్మి ధైర్యం గా ముందడుగు వేసినప్పుడు    ధైర్యలక్ష్మి
2. పేరులో మాత్రమె కాక జీవితంలోనూ ఎదిగే సంపదకి మారుపేరుగా నిలిచినప్పుడు ధనలక్ష్మి
3. తన కొడుకు చక్కగా చదువుకుని ‘ వాళ్ళ నాన్న లా ఉప్పూ, చింతపండు కాక ఏ.బీ.సీ.డీ లు అమ్ముకోవాలని ఆశ పడీ, దాన్ని సాధించేటప్పుడు  సంతాన లక్ష్మి
4. చీటీ డబ్బులు కట్టీ లోటు పూర్తి చేసి స్థలం కొన్నా, ఎరువుల వేగన్ విషయంలో సాహసించి నిర్ణయం తీసుకున్నప్పుడూ ఆమె భయమెరుగని  వీరలక్ష్మి.
5. మూడో క్లాస్ లో బడి చదువు ఆగిపోయినా, పదిహేడేళ్ళకే జీవితం చేదు పాఠాలు నేర్పినా వాటిలోంచి జీవితాన్ని చదువుకుని, తీర్చి దిద్దుకున్నప్పుడు విద్యాలక్ష్మి
6. తలపెట్టిన పని సున్నిపిండైనా, కిరాణా కొట్టైనా మరొకటైనా చేపట్టేది మాత్రం విజయమే అయినపుడు  విజయలక్ష్మి.
7. గజరాజులంత శక్తిమంతులనీ, నమ్మకస్థులనీ తనకు అండగా ఉంచుకుని వారందరి మన్ననలూ పొందినప్పుడు  గజలక్ష్మి.
8. విజయానికీ, ధైర్యానికీ, సంపదకీ, విద్యకీ అన్నిటింకీ మూలంగా నిలిచినప్పుడు ఆదిలక్ష్మి. ఇలా అష్టలక్ష్ములూ కనిపిస్తారు నాకు.
             కథాగమనం ప్రకారం కధాస్థలం ఒక టవునుగా తోస్తుంది. అక్కడే ఇంత సాధించిన ఈవిడ మన ఆధునిక మహానగరాలలో ఉంటే ఒక సామ్రాజ్యమే స్థాపించి ఉండేది అనడంలో సందేహం లేదు. అందుకే నవీన పరిభాషలో మన ధనలక్ష్మి కి నేను పెట్టుకున్న పేరు కార్పోరేట్ కనకమహాలక్ష్మి.
                 నిజ జీవితంలోంచి పుట్టినట్టుండే పాత్రలూ, చక్కటి కథా, అద్భుతమైన కథనమూ, అలరించే సంభాషణలూ వెరసి ధనలక్ష్మి ఒక గొప్ప కథ.

కథాజగత్ లో ఈ కథ యొక్క లింక్: http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/dhanalaksmi---sriramana

-సుభద్ర వేదుల

(కర్టెసీ : మనసు పలికే… )  

3 కామెంట్‌లు:

Sujata M చెప్పారు...

ఖచ్చితంగా... ధనలక్ష్మి చాలా మంచి కధ.

ఎన్ని తెలివితేటలో మా ధనమ్మకు. ఈ మాత్రం లౌక్యం, కష్టపడే మనస్తత్వం ఉంటే చాలదూ జీవితం లో పైకి రావడానికి ? మనం ఒక కధ చదివి, దాన్లో ఒక పాత్ర ని ఇంతగా అభిమానించడం, ఆ పాత్ర సృష్టికర్త గొప్పతనం కాక మరేమిటి ?

సుజాత వేల్పూరి చెప్పారు...

శ్రీరమణ రాసిన అద్భుతమైన అనేక కథల్లో ధనలక్ష్మికూడా ఒకటి!

అర్థ రాత్రి శొంఠి కొమ్ము కోసం వచ్చిన వ్యక్తికి అది ఇచ్చి మర్నాడు వాళ్ళ ఖాతా ఏకంగా తమ కొట్లోకి మార్చుకునేలా చేయడం కస్టమర్ రిలేషన్స్ సబ్జెక్ట్ లో మొదటి పాఠంగా చేర్చ దగ్గ చిత్రణ!

పిండి మర దగ్గర మిగిలిపోయిన అన్ని రకాల పిండ్లూ కలిపి వాణిశ్రీ ఫొటో జత చేసి సున్ని పిండిగా అమ్మేయడం, ఎరువుల లారీ ఆలస్యమయ్యేలా చూడ్డం, కొడుకుని చదివించి వాడి చేత కాలేజీ పెట్టించాలని చూడ్డం, అసలు ఈ కథను బిజినెస్ మేనేజ్ మెంట్ వాళ్ళకి ఒక చాప్టర్ గా పెట్టాలనిపించే కథ!

కామేశ్వరరావు చెప్పారు...

నాక్కూడా బాగా నచ్చిన కథ.
వ్యాపారంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో, మానవ సంబంధాలలో వ్యాపర దృష్టి ఎంత అవసరమో అద్భుతంగా నిరూపించిన కథ! అలాగే థియరీకీ ప్రేక్టికాలిటీకి ఎంత వ్యత్యాసమో చక్కగా చూపించిన కథ.

ఎరువుల సంగతి ఒక్కటీ మాత్రం నాకు అన్యాయమనిపించింది. అది లేకపోతే ఇంకా బాగుణ్ణు.