...

...

11, ఏప్రిల్ 2012, బుధవారం

నవ్య వీక్లీలో పుస్తక సమీక్ష!

నవ్య వీక్లీ ఏప్రిల్18,2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై రామరాజ భూషణుడు వ్రాసిన సమీక్ష ప్రచురించారు. 


ఈ వ్యాసం పూర్తి పాఠం ఇదిగో.

ప్రవహించే నది విద్వాన్ విశ్వం


సమీక్ష : రామరాజ భూషణుడు


          మహాత్మాగాంధీని హాఫ్ నేకెడ్ ఫకీర్ అని గేలి చేసిన ప్రబుద్ధులే అనతికాలంలో (ఇటీవలే) 'ఆ మహాత్మునికి జీవించి ఉండగా నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చి సత్కరించుకోలేక పోయాం' అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు శతాబ్దాల వారి పాలనా తామసత్వమే మనకీ అబ్బింది. సర్వత్రా ఉపన్యాసభారాలే తప్ప ఓ జాతి భాషోన్నతికి, దాని పరిపుష్ఠికి తద్వారా ఆ ప్రాంతాభ్యున్నతికీ అహరహం బహుముఖీన సేవలందించిన మహనీయులను ఆలస్యంగా గౌరవించుకోవడం మనకలవాటైన విద్యే! మాతృభాషకు గొప్ప సేవలు అందించిన అలాంటి మహనీయులలో ఒకరు విద్వాన్ విశ్వం. 

                  'కడుపు కాలిన వాడు ప్రజా కవి. కడుపు నిండిన వాడు సినీ కవి' అన్నాడో ప్రబుద్ధుడు. కానీ కాలిన కడుపుల, ఎండిన డొక్కల ఎడారి బతుకుల దీనస్థితిని సాహితీ రూపాలలో గ్రంథస్థం చేసి, రాయలసీమ కన్నీటి పాటను కోటి గొంతుల కిన్నెర పాటగా మలిచి, నీటి చుక్కకోసం పెన్నేటి పాటగా సుళ్ళు తిరిగిన మానవతావాది విశ్వం. సాహిత్యం, పత్రికా రచన, స్వాతంత్ర్యోద్యమంలో చేసిన కృషీ ముప్పేటగా ఆయన జీవితాన్ని పెనవేసుకు పోయాయి. సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారాలని ఆయన తపన చెందారు. అందుకే ఆయన నిజంగా సాహితీ విరూపాక్షుడయ్యారు. 

                 విశ్వంజీ విరాడ్రూపానికి దోసిలి పట్టి అర్ఘ్యమర్పించిన చందంగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌ల సంపాదకత్వంలో వెలువరించిన సంకలనమిది. విశ్వంజీ హృదయావిష్కరణ, ఆయన జీవితం, సాహిత్యం, వారిపై ఎంతోమంది ప్రముఖుల అభిప్రాయ మాలికలు, వారితో పరిచయాలను వివరిస్తూ ఆ సాహితీ పూర్ణచంద్రుని శతజయంతి (2015) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని వెలువరించారు. 

            బాల సాహిత్యంతో సహా అనేక శీర్షికలతో ఆబాలగోపాలాన్నీ అలరించిన అక్షర యోధుడు. 16 వయసులోనే విరికన్నె వంటి కావ్య రచనతో సత్కారమాలలందుకున్న సృజనజీవి. 'భారతి'లో సాహితీ వ్యాసాలు, సమీక్షలు, పద్య గేయ రచనలు చేశారు. ఆకాశవాణి నాటకాలు రాశారు. 

          బళ్ళ మీద, కాలి నడకనా, ఊరూరా తిరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు. వార మాస పత్రికలంటే ఉబుసుపోని కబుర్ల కుప్పలు కావనీ మానసిక సామాజిక చైతన్యానికి దోహదం చేసేవనీ నిరూపించారు. ఆయనో ప్రవహించే నది. పురోగమించే సమాజం. జనం గుండె చప్పుడు. జీవితాన్ని వివిధ కోణాల నుండి అర్థం చేసుకున్న విశ్వం తన సాహిత్యంలో సామాన్య ప్రజల జీవితాన్ని అతి సహజంగా ప్రతిబింబింపజేశారు. అజ్ఞాన సంహారమే దైవత్వ సిద్ధి. అజ్ఞాన సంహారమే ఆత్మ సందర్శన మార్గం. భారతీయ వాఙ్మయ దృక్పథమూ అదే!తమసోమా జ్యోతిర్గమయా అంటూ అపౌరుషేయాలు చూపిన మార్గమే విశ్వం మార్గం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న విశ్వం ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల లాభం లేదనీ, మూఢనమ్మకాల్లో, అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న భారతీయ జనసామాన్యానికి 'సాహిత్య ఉగ్గు' పట్టించాలని విశ్వసించి రాజకీయం నుండి వైదొలగి సాహిత్యమార్గంలో అక్షరతుణీరమయ్యాడు. జనం గుండెల్లో నిలిచి, కవన సేవలో పునీతమైనవాడు.

                        సంస్కృతాంధ్రాలు, ఆంగ్ల భాష అధ్యయనం, స్వయంకృషితో అర్థశాస్త్రం, మనస్తత్వ శాస్త్రాల్లో సమగ్ర జ్ఞానం సంపాదించిన వాడు. పాఠశాల పండితుడు. పాత్రికేయ ప్రముఖుడు. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సేవలందించారు. అటు కాంగ్రెస్ వాదులూ, ఇటు విప్లవ వాధులూ కూడా ఆయనకు స్నేహితులే! ఆయన సుధీర్ఘ సాహితీ ప్రయాణంలో సంస్కృత, పాశ్చాత్య భాషల నుండి అపరిమిత సంఖ్యలో గ్రంథాలను ఆంధ్రీకరించినవాడు. రష్యన్ సారస్వతాన్ని మనకందించారు. బెర్నార్డ్ షా వంటివారి నాటకాలను అనువదించారు. కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్ర, వచనం చేయడంతో పాటు బాణుడి 'కాదంబరి'ని తెలుగులో అందించి విశిష్టస్థానం పొందినవాడు. నీతిచంద్రికను సరళమైన తెలుగులో (చందమామ) అందించారు. 1938లో నవ్యసాహిత్య మాలను స్థాపించి జన సాహితీ వికాసానికి కృషి చేసినవారు. ముఖ్యంగా ఆంధ్రప్రభ ద్వారా గొప్ప సాహితీ సేవలు అందించారు. 

                       స్త్రీ మానసంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన గుత్తి రైల్వే గేటుకీపర్ హంపన్న కథ (1893లో రాయలసీమలో జరిగిన ఘటన)ను 'ఒకనాడు' కావ్యంగా తీర్చిదిద్ది రాయలసీమ మానుషత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ పుస్తకం చదివితే విశ్వంగారి గురించి స్పష్టత వస్తుంది. ప్రతి జర్నలిష్టూ,రచయితా, పాఠకుడూ చదవాల్సిన సంకలనమిది. 

       

కామెంట్‌లు లేవు: