...

...

16, ఏప్రిల్ 2012, సోమవారం

కస్తూరి పరిమళం

కృష్ణాజిల్లా చల్లపల్లి నుండి వెలువడుతున్న సన్‌ఫ్లవర్ వార పత్రిక తాజా సంచిక(18-4-2012)లో ప్రముఖ రచయిత విమర్శకులు కస్తూరి మురళీకృష్ణ సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పై బుక్ రివ్యూ వ్రాశారు. 


ఆ రివ్యూ తాలూకు పూర్తి పాఠం తురుపుముక్క పాఠకుల కోసం ఇక్కడ. 


తమ పూర్వీకులను, పెద్దలను, మహానుభావులను గౌరవించలేక పోవటం ఒక దారిద్రమయితే, వారిని గుర్తుంచుకోలేక పోవటము అంతకన్న దుర్భరమైన స్థితి. ప్రస్తుతం తెలుగు సాహిత్య రంగాన్ని అలాంటి దుస్థితి వేగవంతంగా అలముకుంటూ వస్తోంది. అనేక కారణాల వల్ల సాహిత్య ప్రపంచం ముక్కలు చెక్కలయి పోతోంది. విశాల విశ్వాన్ని ప్రతిబింబించవలసిన సాహితీవేత్తలు చిన్న చిన్న ప్రాంతాలకి, చిన్న చిన్న వీధులకీ పరిమితమైపోతున్నారు. పదిమందిని చేర్చుకోగలిగిన వాడు ఈనాడు తెలుగు సాహిత్య పథ నిర్దేశకుడై 'తనదే సాహిత్యం, తానే ఔన్నత్యం' అన్నట్టు చిందులు వేస్తూ సాహిత్య రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో 'విద్వాన్ విశ్వం' అన్న పేరు కొందరు పాతకాలపు సాహితీ ప్రియులకు తప్ప కొత్త తరం సాహిత్యాభిమానులకే కాదు రచయితలకూ తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు.  అందుకే ఇటీవలే ప్రచురితమై విద్వాన్ విశ్వం సాహిత్య సాగరంలోని తరగల నురుగుల తాలూకు తళుకుల రుచి చూపించే 'సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అన్న పుస్తకం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

ఇదొక విలక్షణమైన పుస్తకం. సూక్ష్మంలో రచయితగా, మేధావిగా వ్యక్తిగా  విద్వాన్ విశ్వం విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందీ పుస్తకం. ఈ పుస్తకంలోని నాలుగు అధ్యాయాలలో విశ్వం గురించి ఇతరులు రాసిన రాతలు, విశ్వం నడిపిన శీర్షికలు, సమీక్షలు, సందేశాలు, ఇంటర్వ్యూలను పొందుపరచారు. ఇవి వరుసగానయినా చదువుకోవచ్చు లేక పోతే మధ్యనుంచయినా చదువుకోవచ్చు. ఇతరులు విశ్వం గురించి రాసిన రాతలు చదివి విశ్వం రచనలు చదివితే, ఇతరులు విశ్వం రచనల ఔన్నత్యాన్ని ఎంత చక్కగా విశ్లేషించారో, ఆనాటి విమర్శకుల స్థాయి ఎంత ఉన్నతమో బోధపడుతుంది.  అలాకాక, ముందుగా విశ్వం రచనలు చదివి, ఇతరుల విశ్లేషణలు చదివితే, కొండంతటి విశ్వం రచనలను అద్దమంత పరిధిలో ఇమిడ్చేందుకు ఆనాటి విమర్శకులు, పండితులు ఎంత శ్రమ పడ్డారో బోధ పడుతుంది. ఏది ఏమైనా ఈ పుస్తకం చదువుతుంటే, మన తెలుగు సాహిత్య ప్రపంచం ఒకప్పుడు ఎంతటి మేరు శిఖర సమాన వ్యక్తిత్వాలతో, విమర్శన విద్యా విచక్షణులతో, సారస్వత విశారదులతో నిండి వుండేదో తెలుస్తుంది.  అలాంటి అత్యద్భుతమైన సాహిత్యం మనదనీ, దానికి మనం వారసులమనీ గర్వించాలనిపిస్తుంది.

ముఖ్యంగా, ఈ పుస్తకంలో అత్యంత ఆనందం కలిగించే అంశం భాష. 'శ్రీ విద్వాన్ విశ్వం గారు' అంటూ దివాకర్ల వేంకటావధాని వ్యాసంతో ఆరంభిస్తే, చివరి రచన 'గోర్కీ జీవితం' వరకూ తెలుగు భాషలోని సౌందర్యం, గొప్పదనం, లేత కొబ్బరి నీళ్లలోని తీయదనం లాంటి మాధుర్యం అడుగడుగునా ద్యోతకమవుతూంటుంది. పదం పదం చిలుకుతూంటుంది. ఇప్పటి సాహిత్యంతో తుప్పు పట్టిన చెవులు, కళ్లు, మేధల కొక్కసారి అమృతం లభించినంత ఆనందం కలుగుతుంది.

సాహిత్యం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్న వారయినా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. ప్రస్తుత పరిస్థితులలో ఈ పుస్తకం ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంస్థలు సాహిత్యం పేరిట కుప్పిగంతులు వేసి సాహిత్యాన్ని అభాసు పాలు చేస్తూంటే, ఇద్దరు వ్యక్తులు మరపున పడుతున్న ఒక మహా సాహితీవేత్త సాహిత్యాన్ని దుమ్ముదులిపి, సాహిత్యం ఇలా ఉంటుందంటూ సంస్థలు చేయలేని పనిని వ్యక్తుల వల్ల సాధ్యమవుతుందని నిరూపించారు. ఈ పుస్తకం ఇలాంటి అనేక విస్మృత మహా సాహితీవేత్తల సాహిత్యం వెలుగు చూడటానికి దోహద పడితే, బహుశా విశ్వంగారి సాహిత్య తపన సార్థకమయినట్టేననిపిస్తుంది. ఆయన రచనల్లో కనిపించే సమన్వయ వాదం, అవగాహన, లోతైన ఆలోచనలు, అర్హులకు తగిన గౌరవం లభించాలన్న ఆతృతలు వెరసి, ఒక గతించిన కాలపు అద్భుతమైన జ్ఞాపకాల సాక్ష్యంగా నిలుస్తుందీ "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" పుస్తకం. ఆలస్యంగానైనా విశ్వంగారికి అందిన అతి చక్కని నివాళి ఇది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి