...

...

14, ఏప్రిల్ 2012, శనివారం

విభిన్న ధోరణులు     ఆరంభించకూడదు కాని, ఒకసారి ఏదో మొదలుపెట్టాక దాని అంతేమిటో చూడవలసిందే నన్నది ఒక పద్ధతి.

     ఏదో చూచాం, అయితే ఒకటీ, కాకపోతే రెండూ అనుకోవడం మరొక పద్ధతి.

     అసలు అవుతుందో కాదో ఎందుకు వచ్చిన శ్రమా - అని అసలు చేతులు ముడుచుకొని కూర్చోవడం మూడో పద్ధతి. 

     ఈ సంగతి పూర్వంనుంచీ కాస్త మాటల మార్పుతో పెద్దలు అంటున్న సంగతే.

     మూటికి ముమ్మారు ప్రయత్నించిచూచే వారేకాదు, ఎన్నిసార్లైనా సరేనని కంకణం విడవకుండా కూర్చునేవారు కొందరు. 

     అసలు అశ్వత్త ప్రదక్షిణం ఆరంభించీ ఆరంభించకనే కడుపు తడివి చూచుకునే వారు కొందరు. 

    ఎంత కాలంమారినా, ఎంతగా పరిస్థితులు మారినా ఇదేమో మారడం లేదు.


*    *    * 


     కాంటర్బరీ నుంచి ఈ వారం వచ్చిన ఒక వార్త ప్రకారం డొరొథీ బటర్ అనే ఆవిడ కారు నడపడంలో శిక్షణ పొందుతూ వచ్చింది. 

     ఎలాగో ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలై ఆ లైసెన్సు కాస్తా సంపాదించి మగని మెప్పు పొందాలనుకున్నది.

     కడకు, "ఒకట, రెంట, మూట ఒనరంగ నాల్గింట" కూడా చూచింది. ప్రతిసారీ అపజయమే తనపాలబడ సాగింది. 

     కడపటిసారి అయ్యా నేనిక నా మగనికి మొగం చూపించలేను - నన్ను ఉత్తీర్ణురాలిని చెయ్యమని రవాణాశాఖ ఉద్యోగికి పది పౌనులు లంచమివ్వబోయింది.

    అతగాడు కాస్త శఠుడేమో పైకి తెలియ జేయగా, న్యాయాధికారి మరో 25 వడ్డించాడు.

    ఎందుకమ్మా ఇలా చేశావంటే తుదకు ఆ మాటే చెప్పింది. మరీ అపజయం పొంది మగనికి మొహం చూపించే సాహసం లేక పోయిందట.

    మరి ఈవారంలోనే వచ్చిన మరొక వార్త చూడండి:

    లండన్‌లో ఆర్థర్ రీస్ అనే అతనూ ఇలాగే కారు డ్రైవింగ్ లైసెన్సుకోసం ఒకటా రెంటా మూటా నాల్గింటా కాదు, పదిహేడంటే పదిహేడు మారులు పరీక్షకు వెళ్లాడు.

    ప్రతీసారీ పాపం నెగ్గలేక పోతూ వచ్చాడు.

    ఇక తనకూ విసుగెత్తిందో ఏమో పాపం! ఒక పని చేశాడు...

    ఇక ఇదేం లాభం లేదనుకొని నాటకాల్లో విదూషక పాత్రలు ధరించడానికి తాను నిర్ణయించుకొన్నట్టు ప్రకటించాడు. 

    పైగా అతను మోటార్లు నడపడంగూర్చీ, ఈ డ్రైవింగ్ పరీక్షలగూర్చీ వ్యంగ్య చిత్రాలు విపరీతంగా వేసి అందులో సెబాసనిపించుకో దలచు కున్నట్టున్నాడు.

   అదీ ఇదీ చాలు పొట్టపోసుకునేందు కనుకున్నాడేమో మరి!

*    *    *  


       ఒకరేమో ఓటమికి సహించలేక ఎలాగో గెలుపు సంపాదించాలని లంచమివ్వడానికైనా దిగి తుదకు కులం పోయినా సుఖం దక్కలేదనిపించు కున్నారు. 

    మరొకరేమో అన్నిమారులు ఓపికగా వెళ్లి వెళ్లి ఎటూకాకపోయేసరికి, అందులోనే తన అనుభూతులను కాస్త నవ్వుటాలగా తీసుకొని, స్వయంగానే ఉన్న హాస్యదృష్టిని మరింత పెంచుకొని ఏవో హాస్య చిత్రాలూ అవీ గీసుకుంటూ, ఏవో హాస్యగాని వేషాలు వేసుకుంటూ ఆ అపజయాన్ని విస్మరించి విజయం సాధించాలని చూస్తున్నారు. 

    ఎవరి దారి వారిది.

*    *    *

     ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క రకం.

     ఒకే పరిస్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. 

     ఒకరు ప్రతి చిన్న విషయానికీ కలగిపోయి, కంగారు పడిపోయి, తల పగులగొట్టుకుని తహతహపడిపోతారు. 

    మరొకరు మిన్ను విరిగి మీద పడినా చెక్కు చెదరకుండా ఓరిమి క్రక్కదలి పోకుండా, దిమ్మతిరిగి పోకుండా చిరునవ్వు నవ్వివేస్తారు. 

    తన్ను తనే చూచి నవ్వుకోగల మనః పాటవం కలవారు కొందరుకాగా, కాస్త వేలిమీద గోరు మొలిస్తే కళవళపడిపోయేవారు కొందరు. 

    ఈ విభిన్న మనస్తత్వాల మూలంగానే లోకం ఇంత విభిన్నంగా కనబడు తున్నది. 

    ఏవో కొన్ని సమానధర్మాలున్నా ఈ విభిన్నతలెక్కువ.

     పట్టువిడుపు లెరిగినవారేమో గెలుపూ ఓటమీ అన్నదంత పట్టించుకోకుండా, ఎటైనా తమ స్థైర్యం కోల్పోకుండా ముందుకు అడుగు వేస్తారు. 

   అది తెలియనివారేమో కాస్త ఎదురుదెబ్బ తగలగానే బెంబేలెత్తిపోతారు. 

   ఇందులో ఏది మంచీ, ఏది చెడ్డా అన్న ప్రశ్న లేదు. 

   అదో పద్ధతి, ఇదో పద్ధతి. అంతే.


- విశ్వం

(విద్వాన్ విశ్వంగారు నిర్వహించిన మాణిక్యవీణ శీర్షిక క్రింద ఆంధ్రప్రభ దినపత్రిక 5 జూన్ 1966నాటి సంచికలో ప్రచురింపబడిన వ్యాసం ఇది. ఇలాంటి మరికొన్ని వ్యాసాలు, తెలుపు నలుపు శీర్షికతో వచ్చిన కొన్ని వ్యాసాలు సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంలో చదవవచ్చు)   
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి