...

...

3, మార్చి 2010, బుధవారం

శ్రీకృష్ణ సంకీర్తనములు - నాలుగవ భాగము


ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు 
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప


61.దేవేంద్రుడుగ్రుడై - తీవ్రముగ వర్షింప
   గోవర్ధనాద్రిని - గొడుగుమాదిరినెత్తి
   గోవులను గోపకుల - కోరి రక్షించితివి
   దేవేంద్రు గర్వమును - దేవ! ఖండించితివి              llకృష్ణll
      

62.ఎటువలె ప్రహ్లాదు - నేలితివి కరుణ
   ఎటువలె కరిమొఱను - ఎఱిగి బ్రోచితివి
   కుటిలుడ చపలుడ - క్రూరుడగు నన్ను
   అటువలె రక్షింపు - అచ్యుత! కృష్ణా!!                  llకృష్ణll
           

63.గారడి మాయగ - గన్పడి  సర్పము
   వారక నాశము - వనరుహ లోచన!
   సారహీన సం - సారమసారము
   ఘోరవిపత్తులొ - గూల్పకుము కృష్ణా!                llకృష్ణll
            

64.దుర్జనులైనట్టి - దుష్టరాజులను
   నిర్జింప మనసిడి - నిఖిలాధారా!
   దుర్జనుల రణమున - దునుమాడుటకై
   అర్జునకు సారథి - వైతివి కృష్ణయ్య                    llకృష్ణll
          

65.తారల లెక్కలను - త్వరగ జెప్పగవచ్చు
   భూరేణు గణితము - బోల్చి పల్కగ వచ్చు
   నారాయణ నిన్ను - నయముగ వర్ణింప
   అరయ తరమౌనె - హర బ్రహ్మాదులకైన               llకృష్ణll
          

66.గ్రహభయదోషములు - గ్రక్కున మాయమౌ
   బహు పీడలు కూడ - బాసిపోవు వేగ
   ఇహపరసౌఖ్యములు - ఇమ్ముగ గలుగుటకు
   బహుయోచనలేల - భక్తిని భజియింప                llకృష్ణll
          

67.అండజ వాహన! - బ్రహ్మాండములనెల్ల
   చెండులుగ నెత్తుచు - చెలగియాడు నీకు
   కొండల నెత్తుట - కొండిక పని గాక
   కొండ నీకు దొడ్డ - కొండ గాదు కృష్ణ                 llకృష్ణll
               

68.కందర్ప సుందర! - కరుణ సింధు మూర్తి!
   మందరధర కృష్ణ! - మధుకైటభాంతక!
   సుందర విగ్రహ! - సుర ముని గుణ వంద్య!
   వందనములు భక్త - వత్సల! శ్రీకృష్ణ !                llకృష్ణll
                

69.పదియారు వేలుగ - పద్మాక్షులు నీకు
   ముదితలై యుండగ - ముద్దుగ కులుకుచు
   విదితముగ వారలకు - వేడుకల జూపుచు
   వదలక రమియించి - వసుధ బరగితివయ్య           llకృష్ణll
               

70.భవబంధ మోచన - భక్త జన పోషణ
   పవనజ నుత రామ - భద్రాద్రి రామా!
   అవని నాయకుడ - ఆశ్రిత పోషకుడ
   భవహర! మురహర - భక్త కల్పవృక్ష!                 llకృష్ణll
                

(సశేషము)

    

2 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

ఓ సత్కవి స్వామివారిని వేడిన గీతాన్ని అందించారు . ధన్యవాదములు

mmkodihalli చెప్పారు...

ఈ సత్కవి మా ముత్తాతగారే (మా తల్లిగారికి మాతామహులు)నండీ. క్రిమికీటకచ్ఛటాపూరితమై వృథసెడెడి అముద్రిత పంక్తిని ఇలా కంప్యూటరీకరించానంతే.