...

...

24, జులై 2011, ఆదివారం

ఆంధ్ర నాటక మణి మాణిక్యాలు ధర్మవరం – కోలాచలంసాహిత్య రంగంలో గాని, సాంస్కృతిక రంగంలో గాని ఆ మాటకు వస్తే మరే రంగంలో గాని సమ ఉజ్జీలయిన వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.  ఆయా రంగాలకు విశేషమైన ప్రాచుర్యం  కలుగుతుంది.  ఈ విషయం నిరూపించే తార్కాణాలు మనకు చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ఈ వ్యాసంలో అటువంటి ఇద్దరు మహానుభావుల వలన ఆంధ్ర నాటక రంగానికి లభించిన కీర్తి ప్రతిష్ఠలు మనం గమనించవచ్చు.  

ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853 - 1912), కోలాచలం శ్రీనివాసరావు(1854 - 1919) వీరిరువురి మధ్య చాలా సారూప్యవిబేధాలు వున్నాయి.  ఇరువురూ నాటక రంగంలో ఉద్దండులే.   వీరిద్దరూ నాటకాలు వ్రాసినవారే. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగు కన్నడ ఆంగ్లభాషలలో సుమారు 31 నాటకాలు వ్రాశారు. కోలాచలం వారు కూడా దాదాపు 32కి పైగా నాటకాలు, ప్రహసనాలు రచించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు పౌరాణిక, చారిత్రక నాటకాలు వ్రాస్తే, కోలాచలం మొదట్లో సాంఘిక నాటకాలు వ్రాసినా తరువాత చారిత్రక పౌరాణిక నాటకాలు వ్రాశారు. ఇరువురూ దర్శకులు ప్రయోక్తలు కూడా. ఒకరు ఆంధ్రనాటక పితామహులుగా పేరునొందితే మరొకరు ఆంధ్ర చరిత్ర నాటక పితామహులుగా ప్రసిద్ధి చెందినారు.  

ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు మంచి నటులు. వీరి నాటకములలో ప్రధానపాత్రలను వీరే పోషించేవారు. వీరు దశరథ, బాహుక, రాజరాజనరేంద్రచిరాకారి, అజామిళ పాత్రలు అభినయించటంలో దిట్ట. సంగీతంలో కూడా వీరికి ప్రవేశం వుంది. పాటలకు పద్యాలకు వీరే రాగాలు నిర్ణయించేవారు. శ్రావ్యంగా పద్యాలను పాటలను అభినయం చెడకుండా ఆలపించేవారు.  మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు మొదలైన రాగాలంటే వీరికి ప్రీతి.

ఇక కోలాచలం శ్రీనివాసరావుగారు నటించిన దాఖలాలు లేవు. అయితే వీరిరువురి నాటకాల మూలంగా తెలుగుజాతికి ఒక అద్భుతమైన నటుడు లభ్యమయ్యాడు. అతనే బళ్ళారి రాఘవ. కోలాచలంవారి రామరాజు (విజయనగరపతనం అని మరోపేరు) నాటకంలో పఠాను, సునందిని నాటకంలో దుష్టబుద్ధి, సుల్తానా చాంద్ బీబీ నాటకంలో ఉస్మాన్ ఖాన్, భారత ధర్మ యుద్ధములో దుర్యోధన, హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రలు బళ్ళారి రాఘవకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.  రామకృష్ణమాచార్యులు వ్రాసిన సారంగధర నాటకంలో నాయకపాత్ర సారంగధరుడు, పాదుకాపట్టాభిషేకంలో దశరథుడు, ప్రమీళార్జునీయంలో అర్జునుడు, చిత్రనళీయములో నలుడు, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రుడు, విరాటపర్వములో కీచకుడు, సావిత్రి నాటకంలో యముని పాత్ర మొదలైనవి బళ్ళారి రాఘవను ఉత్తమ నటునిగా నిలబెట్టాయి.

ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు సంస్కృత నాటక లక్షణాలను, పార్సీ, ఆంగ్ల నాటక లక్షణాలను కలిపి కొత్తపద్ధతిలో నాటకాలు వ్రాశారు. సంస్కృత నాటకాలలోని పద్యాలను, ఇంగ్లీషు నాటకాలలోని అంకాలు - రంగాలు, పార్సీ నాటకాలలోని పాటలు మొదలైన వాటిని మేళవించి తెలుగు నాటక రంగంలో కొత్త ఒరవడిని తెచ్చారు. తెలుగు నాటకాలలో రాగయుక్తంగా పద్యాలు, పాటలు పాడటం ప్రవేశపెట్టింది ధర్మవరం వారే.  రామకృష్ణమాచార్యుల నాటకాలు ఎక్కువగా విషాదాంతాలే.

కోలాచలం శ్రీనివాసరావుగారు తమ నాటకాలలో దీర్ఘ స్వగతాలు ప్రవేశ పెట్టారు. వీరి నాటకాలపై షేక్స్‌పియర్ నాటకాల ప్రభావం వుంది. కోలాచలం వారికి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది 'ప్రపంచ నాటక చరిత్ర' అనే నాట్య శాస్త్ర గ్రంథం.

ధర్మవరం వారు తమ నాటకాలను ప్రదర్శించటానికి సరసవినోదినీ సభ అనే సంస్థను నెలకొల్పితే కోలాచలం వారు సుమనోరమ సభను నెలకొల్పారు.  ఆ కాలంలో బళ్ళారిలో నాటకాలను ప్రదర్శించటానికి పక్కా నాటకశాలలు లేవు. శ్రీనివాసరావు గారు ఈ లోటును భర్తీ చేయడానికి 'వాణీవిలాస నాటకశాల'ను నిర్మించి బాలగంగాధర తిలక్ చేత ప్రారంభింపచేశారు. దీనికి పోటీగా రామకృష్ణ విలాస్ అనే నాటకశాల ప్రారంభించబడింది. వీరి తదనందరం ఈ నాటకశాలలు ప్రభాత్ సినిమా, స్టార్ సినిమా అనే పేర్లతో సినిమా థియేటర్లుగా రూపాంతరం చెందాయి.

వృత్తిపరంగా కూడా ధర్మవరం కోలాచలం ఇద్దరూ న్యాయవాదులే. వీరిరువురి కార్యస్థానం బళ్ళారి. వీరి గురించి కల్లూరు అహోబలరావు గారు తమ రాయలసీమ రచయితల చరిత్రలో ఇలా పేర్కొంటారు. "ఆంధ్ర నాటక పితామహులు, ఆంధ్ర చరితనాటక పితామహులు వీరిద్దరి వలన యాంధ్రనాటక కళ తన జీవితమును మూడు పూవు లారు కాయలు గావించుకొన్నది. ఈ కవిద్వయము నాటక కళాభివృద్ధికి పాటు పడుటకు, భాషా సేవ చేయుటకు రంగస్థలమైన బళ్ళారి పుర మెంతయు ధన్యమైనది."  


(సాహితీకిరణం మాసపత్రిక రంగస్థల ప్రత్యేక సంచికలో ప్రచురితం) 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి