...

...

3, జులై 2011, ఆదివారం

రూపు సనాతనం ఆలోచన అధునాతనం

ఇరవయ్యో శతాబ్దపు తెలుగు భాషాసాహిత్యాల చరిత్రలో డా.తిరుమల రామచంద్రకు సముచితమైన, సుస్థిరమైన స్థానం ఉంది. గొప్ప పండితునిగా, కవిగా, బహుభాషా కోవిదునిగా, పాత్రికేయ శిరోమణిగా, పరిశోధకునిగా, ప్రాచ్య లిఖిత గ్రంథాల పరిష్కర్తగా, లేఖకునిగా పేరొందిన తిరుమల రామచంద్ర 1913 జూన్ 17న జన్మించి 1997 అక్టోబరు 12 వరకు జీవించారు. భారతి, మీజాన్, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెయిలీ టెలీగ్రాఫ్ తదితర పత్రికలద్వారా పాఠకులకు చేరువైన తిరుమల రామచంద్ర మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు, నుడి - నానుడి, సాహితీసుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, తెలుగుపత్రికల సాహిత్య సేవ మొదలైన గ్రంథాలెన్నో వ్రాశారు. హైదరాబాద్ నోట్‌బుక్, హైదరాబాద్ లేఖ వంటి శీర్షికలను నిర్వహించారు. 


1953-56ల మధ్యకాలంలో పరిశోధన అనే ద్వైమాస పత్రికకు సంపాదకత్వం వహించి సుమారు 20 సంచికలు ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలకు ఆదర్శంగా, నిస్పక్షపాతం, నిర్భీతి సాధనాలుగా ఈ పత్రిక వెలువడింది. ప్రభాకర సంస్మరణ సంచిక, సోమనాథ సంచిక, ఆంధ్ర నాటక పితామహ సంచిక, గురజాడ అప్పారావు సంస్మరణ సంచిక, బుద్ధ సంచిక మొదలైన ప్రత్యేక సంచికల ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధకుల వ్యాసాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించారు. ఈ పత్రికద్వారా కుంటిమద్ది శేషశర్మ అలంకార సర్వస్వం, బులుసు వేంకట రమణయ్య అలంకార చరిత్ర మొదలైన గ్రంథాలను ప్రకటించారు.


ఈ భాషాసేవ అంతా ఒక ఎత్తు. స్వీయ చరిత్రాత్మక వృత్తాంతం 'హంపీ నుంచి హరప్పా దాక' మరొక ఎత్తు. ఈ ఆత్మకథ ఒక గొప్ప ఆధునిక ఇతిహాసం. మనోహర మంజులమైన మహాకావ్యం. ఈ గ్రంథం చదివినంత సేపు పాఠకులు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. భావుకతా సముద్రంలో ఈదులాడుతారు. తన్మయత్వంతో ఆయా సంఘటనలలో మమేకమై ఆశ్చర్యానందాల వంటి భావోద్రేకాలకు లోనవుతారు. గత శతాబ్దపు అత్యుత్తమ తెలుగు గ్రంథాలలో 'హంపీ నుంచి హరప్పా దాక' మొదటి వరుసలో ఉంటుంది.


తిరుమల రామచంద్ర జీవితంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు. బ్రిటీష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాలలో పనిచేశారు. అచ్ఛర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సర్సవతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిలీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన వీరే మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామావిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమాస్తాగా, కాన్పూర్‌లో మరి కొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు. వీరి జీవన యానం సరియైన లక్ష్యంలేక సాగినప్పటికీ, అంది వచ్చిన కొన్ని అవకాశాలు జారవిడిచినప్పటికీ పలువురు ప్రముఖుల పరిచయాలు వీరి జీవితంపై అంతులేని ప్రభావాన్ని చూపించాయి. 


తన ఆత్మకథను తిరుమల రామచంద్రగారు సుమారు 78యేళ్ల వయసులో వ్రాయడం ప్రారంభించారు. తమ మూడేళ్ల వయసు నుండి జరిగిన సంఘటనలను గుర్తుపెట్టుకొని ఎంతో హృద్యంగా వర్ణించడం చూస్తే వీరి జ్ఞాపక శక్తికి జోహారులర్పించక తప్పదు. చిన్ననాటి వీరి ముచ్చట్లు పాఠకుల మనసును దోచుకుంటాయి. తమ పెద్దల ద్వారా విన్న రాఘవమ్మ కథ, హంపి చరిత్ర, తెనాలి రామన మంటప వృత్తాంతం, గొడుగు పాలుని కథ మొదలైన వాటిని ఎంతో ఆసక్తితో చదివేలా రాశారు. 


వీరి జీవితంలో తారసిల్లిన ఎంతో మంది ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలు ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కోలాచలం వెంకటరావు, కోలాచలం శ్రీనివాసరావు, పానుగంటి నరసింహారావు, రూపనగుడి నారాయణరావు, కుంటిమద్ది శ్రీనివాసాచార్యులు, కుంటిమద్ది శేషశర్మ, బళ్ళారి రాఘవ, వావికొలను సుబ్బారావు, మానవల్లి రామకృష్ణ కవి, కలచవీడు శ్రీనివాసాచార్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేదం వెంకటరామ శాస్త్రి, కామరాజ నాడర్, మద్దూరి అన్నపూర్ణయ్య, గుమ్మడిదల దుర్గాబాయి, ఆదిభట్ల నారాయణదాసు, దువ్వూరి రామిరెడ్డి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, సంగెం లక్ష్మీబాయి, కాశీనాథుని నాగేశ్వరరావు, విస్సా అప్పారావు, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.వి.రామన్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, విన్‌స్టన్ చర్చిల్ మొదలైన ప్రముఖుల ప్రస్తావన వీరి జీవన విస్తృతికి తార్కాణం.


వీరి సామాజిక జీవిత పరిశీలన, మానవ స్వభావ చిత్రణ, మనస్తత్వ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉన్నాయి. బసివి నాగమ్మను గురించి వ్రాస్తూ "మా అమ్మ తర్వాత స్త్రీల ఎడల నాకు గౌరవం చిన్ననాటి నుంచే కలిగించింది నాగమ్మ. తన చేతులతో పెంచింది. ఆమెను తలుచుకుంటే నాకు వేద, పురాణ మహిళలందరూ గుర్తుకు వస్తార"ని అంటారు. వీరి పిన్నయ్యగారి చేతికి ఉన్న గరుడ రేఖను చూసి పాములు తోక ముడుచుకుపోయిన సంఘటనను వివరిస్తూ "ఆయన ధైర్యం, ఆత్మస్థైర్యమే గరుడరేఖ అని ఇప్పుడు నేను భావిస్తున్నా"నంటారు. ఆనెగొంది విద్యభ్యాస సమయంలో వీరిని కనిపెట్టిన కొండమ్మవ్వను గురించి ఇలా విశ్లేషిస్తారు. "ఆమె మనసున్న మరమనిషి. ఏ పనీ ఆమెది కాదు, కానీ అన్ని పనులూ ఆమెవే. క్రమశిక్షణలో ఆమె ఒక సైనికురాలు. సమయపాలనలో సూర్యచంద్రులకు దీటు. నా చిన్నతనంలో దాదాపు ప్రతి బ్రాహ్మణ కూటుంబంలోను అలాంటివారు ఉంటూనే ఉండేవారు. సేవ చేస్తూనే ఉండేవారు. చందనం చెక్కలాగా అరిగిపోతునే ఉండేవారు."  తమ చిన్నతనంలో చిరుతపులిని వేటాడి చిత్రవధ చేసే క్రమాన్ని వివరిస్తూ "ఎంతటి అమానుష వినోదం! చిత్రవధ చేయడంలో శాడిస్టుకు ఎంత సంతోషం?" అంటూ వాపోతారు.   


తమ అవలక్షణాల గురించి ప్రస్తావించడానికి వీరు వెనుదీయలేదు. మూఢత్వం, మనో చాంచల్యం, పెద్దల మాటలను పెడచెవినపెట్టడం, సరైన లక్ష్యం లేకపోవడం వంటి లక్షణాలను అక్కడక్కడా ప్రస్తావించారు. వీరి విధేయత, సౌజన్యశీలత, సౌహార్ద్రత ఈ గ్రంథంలోని ప్రతిపుటలోను స్పష్టంగా కనిపిస్తుంది. తమ జన్మ వృత్తాంతాన్ని వివరించడంలోనే వీరి విధేయత, వ్యక్తిత్వం బయటపడుతుంది. "నేను పుట్టినప్పుడు దేవదుందుభీలు మోగలేదు. అట్లని భయంకరంగా పిడుగులు పడలేదు. భూమి కంపించలేదు. నేను పుట్టాను. కొన్ని వేలమంది పుట్టినట్లుగా, కొన్ని లక్షల మంది పుట్టినట్లుగా, కోటానుకోట్లమంది పుట్టినట్లుగా పుట్టాను. అంతే..." అని అంటారు. 


తిరుమల రామచంద్రగారి ఆత్మకథ ఒక పెద్ద బాలశిక్ష వంటిది. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన అంశాలెన్నో దీనిలో లభిస్తాయి. 1917 నుండి 1944 వరకు సూమారు 27 సంవత్సరాల జీవితాన్ని ఈ "హంపీ నుంచి హరప్పా దాక"లో పొందుపరిచారు. వీరి తదుపరి జీవితంలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ జీవిత విశేషాలను చరిత్ర రూపంలో గ్రంథస్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(రాజకీయ సామాజికార్థిక వారపత్రిక ఈవారం జనవార్త అక్టోబర్ 5-11, 2008 సంచికలో ప్రచురితమైనది)     
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి