...

...

13, ఏప్రిల్ 2010, మంగళవారం

ఫణిప్రసన్న పద్యప్రావీణ్యం!


 బ్లాగుల్లో మా తమ్ముడు కె.ఫణి ప్రసన్న కుమార్ వ్రాసిన పద్యాలను మా అమ్మగారికి కంప్యూటర్లో  చూపించటానికి పాత టపాలను తిరిగేస్తుంటే వారు "అన్ని పద్యాలనూ ఒకే చోట ఉంచితే చదవడానికి సులభంగా ఉంటుంది కదా?" అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మా అమ్మగారి కోరిక మేరకు మా తమ్ముడు ఈమధ్య కాలంలో ఆంధ్రామృతం, పద్యం.నెట్, వాగ్విలాసం వంటి బ్లాగుల్లో వ్రాసిన పద్యాలను ఒక చోట కూర్చి ఇక్కడ అందిస్తున్నాను. మీరూ ఆస్వాదించండి.

1.ఖసాబు మావాడు కాడని బొంకిన కుంకలకి 

ఖలురా! తలపై నిప్పిడి
తెలియదు మాకంచు బొంక తలలూచెదమా
ఇలలో సర్వులు మెచ్చగ
వలువల నూడ్పించి మిమ్ము వురికిన్చెదుమీ!
(హాస్యం లాస్యం బ్లాగునుండి) 

2. సత్యము మా ధర్మమనుచ
అత్యుత్తమ సేవలోసగు ఆశ్రిత జనులన్
ఆ ద్యుతుడు రామలింగడు
భత్యములకె ఎసరు తెచ్చె, భాగ్యము మురళీ!
(తురుపుముక్క బ్లాగునుండి)  

3. రాముని భార్యలకు నింద రానే వచ్చెన్‌ అనే సమస్యకు పూరణ.

ఆ మునులు కొల్చిరెవనిని ?
హోమపు ఫలమును దశరథు డెవరికి యిచ్చెన్ ?
సోముని గాంచిన యేమయె ?
రాముని భార్యలకు నింద రానేవచ్చెన్
(తురుపుముక్క బ్లాగునుండి)

4.నిప్పుకుచెదబట్టె నయ్య! నేర్పరి యింట అనే సమస్యకు పూరణ.

తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
(ఆంధ్రామృతం బ్లాగునుండి)

5.పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె అనే సమస్యకు పూరణ.

హరియు లోకపాలన సేసి అలసి జాలి
మీరి యోగనిద్రను చనె మరచె నన్ను
పరగె కాపురమ్మిటని వాపోయి పల్కె
పరమశివునితో, లక్ష్మియు పవ్వళించె.
(ఆంధ్రామృతం బ్లాగునుండి)

6.మణులు మాటలాడె మనసు కరుగ అనే సమస్యకు పూరణ.

వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
జతగాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ 


చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ
(ఆంధ్రామృతం బ్లాగునుండి) 

7. అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి అనే సమస్యకు పూరణ.

అన్న పెండ్లాము అత్తను కన్న తల్లి 
అన్న, పెండ్లాము అత్తను కన్న తల్లి
అనియె! పెండ్లాము అత్తను కన్న తల్లి
కన్న మిన్నగా జూచుట కడు పసందు.
(ఆంధ్రామృతం బ్లాగునుండి)

8.అరయ నాల్గక్షరముల శివాఖ్య యొప్పు 
వాని తలఁ గొట్ట యిందిరా వల్లభుడగు. 
వాని తలఁగొట్ట నర్థంబు భర్త యగును. 
అట్టి పదమేదొ తెలుపుడీ! ఆర్యులార.    అంటూ శ్రీ చింతా రామకృష్ణారావు గారడిగిన ప్రశ్నకు సమాధానం

నను బ్రోవు ముమాపతి దయ
నను బ్రోవుము మాపతి కరుణామృత ధారన్
నను బ్రోవుమా పతీ యని
వినుతించెను ఇంతి ఉదయ వేళల దినమున్
(ఆంధ్రామృతం బ్లాగునుండి)

9.కర చరణంబులు కలిగియు 
కర చరణ విహీను చేత కర మరుదుగ తా 
జల చరుడు పట్టు వడెనని 
శిర హీనుడు చూచి నవ్వె చిత్రము కాగన్. అంటూ శ్రీ చింతా రామకృష్ణారావు గారడిగిన ప్రహేళికకు సమాధానం

కప్ప మింగె పాము కనినవ్వెరా పీత
చనును మూడు చూడ జలమునందు
కాలు చేతులు గల కప్ప లేకయు పాము
తలయు లేక పీత ధరను వెలయు
(ఆంధ్రామృతం బ్లాగునుండి)


10.శుద్ధ కుల జాత యొక సతి 
యిద్ధరణిన్ దండ్రిఁ జంపి సగ విశుద్ధిన్ 
బుద్ధి బితామహుఁ బొందుచు 
సిద్ధముగా దండ్రిఁ గనును. చెప్పుడు దీనిన్. అంటూ శ్రీ చింతా రామకృష్ణారావు గారడిగిన ప్రశ్నకు సమాధానం


తియ్యని మజ్జిగ వచ్చెను
నెయ్యముగా పెరుగు చిలుక నెరజాణ వలెన్
అయ్యది పాలను కలువగ
వయ్యరముతోడ మరల వచ్చెను పెరుగే!
(ఆంధ్రామృతం బ్లాగునుండి)


11.కాయ మీద మ్రాను, కడు రమ్యమై యుండు. 
మ్రాను మీద లతలు మలయుచుండు. 
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచు నుండు. 
దీని భావమేమి తిరుమలేశ.   అంటూ శ్రీ చింతా రామకృష్ణారావు గారడిగిన ప్రశ్నకు సమాధానం


బొబ్బిలి దేనికి నెలవౌ
అబ్బురమౌ అమరగాన మహిమను పెంచన్
అబ్బెడునే వాయిద్యము
అబ్భారతి కరములందు అద్భుత రీతిన్
(ఆంధ్రామృతం బ్లాగునుండి)


12.శ్రీశ్రీ లేకున్న నేమి సిరిసిరిమువ్వా అనే రాఘవ గారి రచనకు స్పందన


హవ్వా ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు కానము
అవ్వార్నిధి ముత్యమట్లు వహ్వా మువ్వా!
(వాగ్విలాసము బ్లాగు నుండి)


13. శారద అనే కలం పేరుతో వ్రాసిన చతుర్విధ కందము


చెలుడా చెంతకు చేరగ
అలుకా? కాంతను,వలచితి పలుకవ కనవా!
వలపున్ కాంతులు మెరిసెను
ఇలలో వింతగ మురిపెపు విరులవి విరియన్.


చెంతకు చేరగ అలుకా?
కాంతను,వలచితి పలుకవ కనవా! వలపున్
కాంతులు మెరిసెను ఇలలో
వింతగ మురిపెపు విరులవి విరియన్ చెలుడా!


వలపున్ కాంతులు మెరిసెను
ఇలలో వింతగ మురిపెపు విరులవి విరియన్
చెలుడా చెంతకు చేరగ
అలుకా? కాంతను,వలచితి పలుకవ కనవా!


కాంతులు మెరిసెను ఇలలో
వింతగ మురిపెపు విరులవి విరియన్ చెలుడా!
చెంతకు చేరగ అలుకా?
కాంతను,వలచితి పలుకవ కనవా, వలపున్!
(పద్యం.నెట్ నుండి)


14. శ్రీరఘురామ భూవరుడు చేకొనె స్త్రీల ననేకమందినిన్   అన్న సమస్యకు పూరణ


మారుతి యేగె ద్వారకకు మాధవు జూడగ ద్వాపరంబునన్
ఆ రఘురామ భక్తు నయనంబులకాతడు రాముడే అయెన్
ధారణ సేయ గోపికలు ధాత్రిజ బోలు ననేక కాంతలై
శ్రీరఘురామ భూవరుడు చేకొనె స్త్రీల ననేకమందినిన్ 
(ఆంధ్రామృతం బ్లాగునుండి)


15.వేయి కనులు గలిగి వెలయు. ఇంద్రుడు కాడు. 
కాళ్ళు నాల్గు కలిగి కాదు పశువు. 
నరుడు పట్టకున్న నడువగా జాలదు. 
దీని భావమేమి? తిరుమలేశ. అంటూ శ్రీ చింతా రామకృష్ణారావు గారడిగిన ప్రశ్నకు సమాధానం


కమ్మని జొన్న కూడు తిని కాయపు కష్టము మాయమౌనటుల్
ఝుమ్మని చేలపై కదలి జోరుగ వీచగ చల్ల గాలియున్
నెమ్మది వేయి కన్నులతొ నేర్పుగ నాలుగు కాళ్ళుకల్గి నన్
రమ్మని పిల్తువో నులక మంచమ కైపగు కున్కు తీసెదన్
(ఆంధ్రామృతం బ్లాగునుండి) 


16.భవశీర్షము ద్రుంచె లోకతత్పరమతియై అనే సమస్యకు పూరణ


అరిహరి తమ్ము గూడి ముని యాగము కావ వనమ్ము చేర నం
బర గతి యాగ భంగరతి బాతకి తాటకి గుబ్బటిల్ల దా
శరథి వధించె దైత్య కుల సంభవ శీర్షము ద్రుంచె లోక త
త్పర మతియై నిశాచర నివార కుశాగ్ర శరాగ్ర ధాటిచే!
(తెలుగు పద్యం బ్లాగునుండి)


17.భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్ అనే సమస్యకు పూరణ


దనుజాధీశుడు బంప పూతన కనెన్ దామోదరున్ వేగమే
చనుబాలిచ్చి వధింప జేర హరి తా జంపెన్ సురుల్ మెచ్చగా
పెను భూతమ్మగు దాని, ప్రీతిమతులై వీక్షించిరద్దేవతల్
ఘనశ్యామున్ వరగోపిగోపహృదయాకాశార్కునిన్ బాలకున్
(తెలుగు పద్యం బ్లాగునుండి)


18.మేరీమాతసుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే అనే సమస్యకు పూరణ


పోరుం డస్సి అయోధ్య జేరి నిదురన్ పోవంగ సౌమిత్రి తా
సారస్యంబగు స్వప్నమందున కనెన్ ఆ రామ సీతమ్మలన్
గారాబంబొక పుత్రునంత చెదరంగా స్వప్న "మేమాయె! తా
మేరీ (తాము + ఏరీ) మాత, సుతుండు, రాముడ?" నియెన్ మేకొంచు సౌమిత్రియే
(తెలుగు పద్యం బ్లాగునుండి)


19. బ్రతికిన పుత్రునిచ్చెద భవన్మృత పుత్రికనిమ్ము సోదరీ! అనే సమస్యకు పూరణ


జతగను చావబోవ విధి! చావడు బాలుడు ప్రేమజంటలో
జితమతు లక్కదమ్ములను చేరిరి పెద్దలు న్యాయవాదులన్
సుత కథ న్యాయముంటగని సోదరుడిట్లనె "వాదులాడగన్
బ్రతికిన పుత్రునిచ్చెద భవన్మృత పుత్రికనిమ్ము సోదరీ!"





20. మగనిన్ కొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకమ్మునన్  అనే సమస్యకు పూరణ


సిగలో పువ్వులు వాలు చూపులు వగల్ సింగంపు లే మధ్యముల్
నగవుల్ బల్ కుచశైలముల్ సొబగులౌ నారీమణుల్ యుల్లముల్
తెగ చీల్చన్ మదనా! మదించితివొ? సీ! తీతూండ్ల మోహమ్ము క
మ్మగ నిన్ కొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకమ్మునన్





21.అత్త, మామ, అమ్మ, నాన్న లు(వేరే అర్థాలతో) ఉపయోగించి శివధనుర్భంగమును వర్ణించమన్న దత్తపదికి పూరణ


హరచాప మవలీల హరి లీల నెత్తంగ
అత్తరి రాజుల అహము డిగ్గె
నరపతి మదనారి నారిని బంధింప
నారి కోర్కెలు స్వేచ్చ నాడ దొడగె
నిరుపమామహితమౌ హరువిల్లు ఫెళ్ళన
మిథిలను సన్నాయి మేళ మలరె
అమ్మహా స్ఫోటన మరుణ ధూమము నింప
ఇల్లు నిల్లున రంగ వల్లులమరె


తెంపనాన్నగేశునివిలు తెగ తెంపు
దుర్జనుం డెవడను రాము ఘర్జనములు
పెండ్లి కొడుకువు కమ్మని ప్రేమ మీర
పలుకు పల్కులుగా రఘుపతియు మెరసె





22.బ్రాకెట్, లాకెట్, రాకెట్, క్రికెట్ పదాలతో దత్తపది.


బ్రాకె టక్కరి యిండ్ల నుట్లను పట్ట రండని గోపికల్
వాకిలాకెటు లూగినా హరి వచ్చెనంచును జూచుచున్
రాకెటుండును చక్రి కెట్టుల రామ కట్టుట పగ్గముల్
మాకు జెప్పను చక్కనమ్మల మాయమౌ కను గప్పుచున్
శ్రీ కరమ్మగు నీదు క్రీడల సేతు మోడ్పుల శ్రీ హరీ!





23.ఈ బ్లాగులోని సంక్రాంతి ముగ్గుల పోటీ అనే టపాకు స్పందన


ఇంతింత ముద్దు గుమ్మలు
అంతంతటి రంగవల్లు లెంతయు నేర్పు
న్పంతమున స్పర్థ గెల్వను
సంతసమున నిడుట మోద మందరికన్నా!
(తురుపుముక్క బ్లాగునుండి)
                                                                                                                      
24.పొద్దు.నెట్‌వారు నిర్వహించిన వికృతి ఉగాది పద్యకవితా సదస్సుకు తనను పరిచయం చేసుకుంటున్న పద్యం.


పుట్టితి హిందూపురమున
పట్టితి వాస్తు పటిమ(architecture) మన భాగ్య నగరిలో
కట్టి తిన బెంగళూరున
పెట్టితి నే కాపురమును పేర్మిగ నార్యా!


25.వికృతి ఉగాది పద్యకవితా సదస్సులో శ్రీ చింతా రామకృష్ణారావుగారి గణపతి ప్రార్థనపై స్పందన.


వినుతించిరి గణనాథుని
తనువంతయు పులకరించె ధైర్యము వచ్చెన్
తనియగ కవిజన గణమున
వినిపించును శ్రావ్య కవిత వికృతికి వేడ్కన్
(పొద్దు.నెట్ నుండి)


26.గరికయొ గడ్డియో మెసవి కైకొనవచ్చుఁ గవిత్వసంపదల్ అనే సమస్యకు పూరణ.


ఎరుగను మున్ను ఎన్నడును ఏర్పడ వ్రాయగ వృత్త పద్యముల్
కరతల మయ్యె భాగవత గానము సేసిన నేడు వ్రాయుటల్
హరిచరితంబు యా మధుర అద్భుత కావ్య మహా వనమ్ములో
గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు కవిత్వ సంపదల్.
(పొద్దు.నెట్ నుండి)


27.లావొక్కింతయు లేదు … ఈ పదాలతో మొదలు పెట్టి, పోతన కవిత్వ ఛాయ పడకుండా రాయాలి అన్న సమస్యకు పూరణ


లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా
సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా
రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?
పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో.
(పొద్దు.నెట్ నుండి)


28.వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖ మాసంబునన్. అన్న సమస్యకు పూరణ


హర్షంబన్నది లేదు ఆశ మనిషిన్ ఆడింపగా కీర్తికై
తర్షుండై వనరాశులన్ దునిపి తా దర్పంపు హర్మ్యంబులన్
కర్షాకర్మము మాని నిల్ప భువిలో కల్లోలముల్ రేగగా
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖ మాసంబునన్.
(వికృతి ఉగాది పద్యకవితా సదస్సు కొరకు వ్రాయబడినది అప్రకటితం)


29.కుందేళులు రెండు వచ్చి కుచముల కరిచెన్.  అన్న సమస్యకు పూరణ


పెందాళే జూకెళ్ళితి
అందాళులు తీర్చిదిద్ద అరుదగు పొదనో
సుందర కన్యగ యచ్చట
కుందేళులు రెండు వచ్చి కుచముల కరిచెన్.
(వికృతి ఉగాది పద్యకవితా సదస్సు కొరకు వ్రాయబడినది అప్రకటితం)


30.ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్ అన్న సమస్యకు పూరణ


గోటేలే పొట్టేలా?
వేటేయు తలారి నెంచు వేడుకె నీకున్?
కాటేయు నేత నెంచెడు
ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్
(వికృతి ఉగాది పద్యకవితా సదస్సు కొరకు వ్రాయబడినది అప్రకటితం)


31.ఎదుటన్నిల్చె సహస్రభోగములు మేలేసేయు వ్యాపారముల్ అన్న సమస్యకు పూరణ.


హృదయంబందున నిన్నె గొల్చు మునులన్ కృష్ణా, దయా సింధు! నీ
పదముంజేర్చుచు గోపకాంతల వలెన్ పాలించి క్రీడించు నీ
మృదు లీలా రస రాస క్రీడలు మదిన్ బృందావనిన్ సేయగా
ఎదుటన్నిల్చె సహస్ర భోగములు మేలే సేయు వ్యాపారముల్.
(వికృతి ఉగాది పద్యకవితా సదస్సు కొరకు వ్రాయబడినది అప్రకటితం)


32.వికృతి ఉగాది పద్యకవితా సదస్సులో ఇచ్చిన ఒక వర్ణనాంశముకు వ్రాసిన పద్యాలు.


అదియొక రైలు పెట్టె, మరి యందొక బాలుడు యౌవనుండు నా
ఎదురుగ నున్నవాడు కను లెత్తుచు దించుచు జూచుచుండె నో
మదనుని తోడు బుట్టువన మత్తును గొల్పెడు ముద్దరాలి నా
వదనము లోన కాననగు వద్దని జూచిన ప్రేమ భావముల్.


చదువునొ లేదొ గాని యొక చక్కని పుస్తక ముండె చేతిలో
అది తన మోము గప్పునటు లాయమ లీలగ త్రిప్పుచుండె  నీ
రదతతి ఇందు బింబమును రాతిరి కప్పుచు తీయునట్లుగా
చదువుచు తీయుచుండె వనజాక్షియు వానిని రెచ్చగొట్టుచున్.


ఎచ్చటి కేగునొ యంచును
ఇచ్చికములాడి దాని మచ్చిక సేయన్
వచ్చును మదిలో జంకుచు
అచ్చటనే యుండిపోవు చచ్చర పడుచున్


హృదయము ముక్కలౌను మతి హీనుని సేయును కంటి చూపుతో
కదలిన గుండె జారు మది కమ్మును మైకము కాలి సవ్వడిన్
రొదరొద సేయు ముంగురులు రూపము జూచుచు సోలె బాలకుం
డదురుచు కూత కూయుచును హాసము సేయుచు సాగె రైలుయున్.
(పొద్దు.నెట్ నుండి)


33. సుందరం ఆర్కిటెక్ట్స్ ప్రై. లి.అధిపతి శ్రీ ఆర్. సుందరం గారి డెభ్భై ఐదవ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చదివిన పద్యం.





నూనూగు మీసాల నూత్న యౌవనమున
ప్రౌఢమౌ గురుభక్తి పొందినావు
అట్టిట్టి వనరాని గట్టి మేడలు వేలు
చిట్టి క్రీడగ నీవు కట్టినావు
సుందర సువిశాల సొబగు గుమ్మటముల
మించు ప్రతిభను నిర్మించినావు
నినుగొల్చు భృత్యుల నీలకంఠుని వోలె
కడు ప్రేమతో నీవు కాచినావు

సంతసము గాగ నూరు వసంతములను
సుందరేశుని కృపచేత పొందుమయ్య
నీదు సత్కీర్తి భువినెందు నిల్చునయ్య
కరుణ తోడను మమ్ముల కావుమయ్య
(హాస్యం లాస్యం బ్లాగునుండి) 


34. ఎవ్వడు తిమిరపు మొరవి
డెవ్వడు పలుమారు తిరిగె నేర్వను వానిన్
ఎవ్వడు హృదయారాముం
వ్వానికి తెలుపుడయ్య అరయుండిటనే !
(ఆంధ్రామృతం బ్లాగునుండి) 


35.టంట టంట టంట టంట టంట  అన్న సమస్యకు పూరణ


విరులు విరిసెనంట మరులు గొలిపెనంట
పర్వులెత్తి వాగు పారెనంట
పరవశమున మనసు పాడెనీ పాటంట
టంట టంట టంట టంట టంట  
(శంకరాభరణం బ్లాగునుండి)


36. శివుడు గరుడునెక్కి సీమ కేగె అనే సమస్యకు పూరణ


వరదు విష్ణు జేరి వైకుంఠమున నుండ
స్వర్గ సీమ యందు సభకు పిలుపు
నందు కొనగ నంది యందుబాటున లేక
శివుడు గరుడునెక్కి సీమ కేగె
(శంకరాభరణం బ్లాగునుండి)


37. సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్ అను సమస్యకు పూరణ

నా తరమా నుతింప యని నారదు డచ్చెరు వొందు రీతిగా
భూతలమంత పీటగ నభోతలమంతయు పెండ్లి పందిరై
శీతల వీక్షణుండు హరి శ్రీ రఘు రాముడు ధర్మ రక్షకై
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.
(శంకరాభరణం బ్లాగునుండి)

38.మేడపై నుండి పడినను మేలు కలిగె అనే సమస్యకు పూరణ

ఏడ నున్నాను నేనను ఎరుక లేక
అంబరమునంట నేనెగుర సంబరమున
కలిగె కనువిప్పు కూలితి కడకు కలల
మేడపై నుండి పడినను మేలు కలిగె
(శంకరాభరణం బ్లాగు నుండి)


39. శ్రీ చింతా రామకృష్ణారావు గారిచ్చిన రాముని జంపి రావణుఁడు రాజ్యమునేలె సుఖింపనెల్లరున్  అన్న సమస్యకు  వ్రాసిన పూరణ

రాముని బంట్లు ముష్కరులు రావణుడా సినిమాకు నాయకుం
డేమి వినాశ కాలమిది ఈ సినిమా కథ ప్రేరణమ్ముగా
ఢీమని వ్రాశె మూర్ఖుడొక ధీటయినట్టి యుదంత మందులో
రాముని జంపి రావణుఁడు రాజ్యమునేలె సుఖింపనెల్లరున్
(శంకరాభరణం బ్లాగు నుండి) 


40.సారా త్రాగుమని చెప్పి సద్గురువయ్యెన్ అనే సమస్యకు పూరణ

పరమును చేరగ జీవుడు
తరుణోపాయమ్ము తెలిసి " కరుణను ఈశున్
శరణను భక్తి రసము మన
సా! రా, త్రాగు " మని చెప్పి సద్గురుడయ్యెన్
(శంకరాభరణం బ్లాగు నుండి) 


41.కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్ అనే సమస్యకు పూరణ
ఎంతయు భక్తి కలిగి యే
కాంతమున గొలువ సుభద్ర చెంతకు చేరన్
కుంతీసుతుండు టక్కరి !
కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్ 
(పై పద్యము అర్జునుడు తీర్థ యాత్ర చేస్తూ ద్వారకకు చేరి అందు యోగి వలె కపట వేషధారియై సుభద్రను కలుసుకొను సందర్భమును వివిరించునది - శంకరాభరణం బ్లాగునుండి)

42.పతిని హత మొనర్చు సతియె సాధ్వి అన్న సమస్యకు చెప్పిన పద్యం.
ఒక్క ముద్ద తినక యుపవాస దీక్షని
కడుపు మాడ మగని కసర కుండ
గృహపు శాంతి నిలుప క్షుద్బాధనది నశిం
ప తిని హత మొనర్చు సతియె సాధ్వి
(శంకరాభరణం బ్లాగు నుండి)


43.బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు అనే సమస్యకు అజ్ఞాత పేరుతో వ్రాసిన రెండు పద్యాలు. 
వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు 


శంక యేల నయ్య శంకరయ్యా మీకు
సంకటములు బాప సంఘమునకు
బొంక వలసి రాగ జంకక గొంకక
బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు
(శంకరాభరణం బ్లాగు నుండి) 


44.కుంటివాడెక్కె తిరుమల కొండపైకి అనే సమస్యకు పూరణ.

ఒంటరగువాడు కనరాదు కంట చూపు
జంట లేమికి ఆకలి మంటనార్ప
కుంటివాడెక్కె తిరుమల కొండపైకి
వెడలు బస్సును భక్తుల వేడుటకును
(శంకరాభరణం బ్లాగు నుండి
)

45.రోయక బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో. ఈ సమస్యకు వ్రాసిన పద్యం.
నాయన కన్న యింతులకు నాథుడె మిన్నని పల్కు పుత్రికన్
గాయమునొంది తండ్రి యలుకన్ గుణసుందరినో కురూపికిన్
యీయగ నిశ్చయింప జగదీశ్వరి యానతటంచు భక్తితో
రోయక బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో
(గుణసుందరి కథ సినిమా ఆధారంగా - శంకరాభరణం బ్లాగు నుండి


46.ఆలినంపుచుంటి నేలుకొనుము అనే సమస్యకు పూరణ

సామరస్యమున్న సంసారమది నిల్చు
సతిని వీడు టదియు సబబు కాదు
అలుక చాలు నింక అల్లుడా యిదె నీదు
ఆలినంపుచుంటి నేలుకొనుము
(శంకరాభరణం బ్లాగునుండి)


47.రాముని వెంట రాము గని రాముని సంఘము మోదమందగన్ అనెడి సమస్యకు పూరణ 
భూమిని శాంతి సౌఖ్యముల పొందుగ నిల్పగ జేయు యాగమున్
తామసులైన రాక్షసులు దాడుల భంగము సేయుచుండ శ్రీ
రాముని యాగ రక్షణకు రమ్మని తాపసి వేడ వచ్చు నౌ
రా! ముని వెంట రాము గనిరా మునిసంఘము మోదమందగన్! 
(శంకరాభరణం బ్లాగునుండి)


48. మూగ గొంతెత్తి పాడును రాగ మలర అనే సమస్యకు పూరణ.

చిన్ని పాపలు పశువులు చిందులేయ
పరవశమ్మున నాడంగ ఫణి తన ఫణ
మూగ గొంతెత్తి పాడును రాగ మలర
గానమందు బాలుకు సాటి కానమెందు.
(శంకరాభరణం బ్లాగునుండి


49.దత్త పది: ఇడ్లీ,పూరీ,ఉప్మా,కాఫీ. ఈ పదాలతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ,మత్తేభంలో పద్యం 

అల వాఘా సరిహద్దులో చివరిలో ఆ మూల శైలంబు దా
పల పూ రీతులు పెక్కు గల్గు వనిలో ప్రాంతంపు ముప్మాప యా
లిలు వీడచ్చట నిల్తువీవు పిరమిడ్లీలన్, ఇటన్ తాజు హో
టలులో నార్తులు పాహి పాహి యనిరే, ఓ సైనికాఫీసరా!
(ఆంధ్రామృతం బ్లాగునుండి)  



50. కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు అనే సమస్యకు పూరణ


క్రోధమది కెంపుజేయును రోదనమ్ము
నిచ్చునిడుగడ గర్వమ్ము నెత్తికంపు
మూయు చిట్లించు ధ్వేషమ్ము దయయును సహ
కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు.
(శంకరాభరణం బ్లాగునుండి) 

51.దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్ అనే సమస్యకు పూరణలు

పున్నెముఁ జేసినాము సుమి భూమిని ధేనువుఁ జేసి పిండె యా
పన్నశరణ్యుడా పృథువు పాలకు మారు సమస్త వస్తువుల్
మన్నన సేసె మా మనవి మానుము శోకము చాలు కర్షకా,
దున్నకు! దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్

ఎన్నడులేని ప్రేమలివి ఎచ్చటనుండి జనించె కౌరవుల్
నిన్నును నన్ను తమ్ములను నేడిటు పంపిరి తల్లి తోడుగా
చెన్నగు వారణావతము చెల్వగు తీరు యుధిష్ఠిరా, కనన్
దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్!

(సాహితీ స్రవంతి త్రైమాసిక నుండి) 

52.గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్ అనే సమస్యకు పూరణ

అడిగినదేతడవనుచును
గడగడమని పద్యవృష్టి విడువక కురియన్
తడవగ కోరే మనసుకు
గొడుగెందుకు కుంభ వృష్టి గురిసెడి వేళన్ !
(శంకరాభరణం బ్లాగునుండి) 

53.ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్ అనే సమస్యకు పూరణ

మెండై, పండిత పామరాళి పొగడన్ మేలౌ యశోవంతుడై,
నిండై, బంధుజనంబునందు తలలో నిక్కంపు మాణిక్యమై,
రెండై యుండని మాటగల్గి మగడే ప్రేమైక సౌశీల్య రా
ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.
(శంకరాభరణం బ్లాగునుండి) 

54. తల లైదు కరంబు లారు తను వది యొకటే! అనే సమస్యకు పూరణ

శిలలోన విశ్వ రూపము
మలచెద నేనంచు బూని మాసము గడిచెన్
ఉలిసాగదించుక మిగిలె
తల లైదు కరంబు లారు తను వది యొకటే!
(శంకరాభరణం బ్లాగునుండి) 

55. భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె అనే సమస్యకు పూరణ

ఏగిరొక జంట వల్లభ యోగి కడకు
కలుగు సంతతి యని మౌని పలికినంత
భార్యతో గూడి తద్దయు భక్తిఁ వల్లభార్య
పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.


(శంకరాభరణం బ్లాగు నుండి)

56. మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా అనే సమస్యకు పూరణ

మకరందము వంటి నుడులు 
మకరధ్వజునమ్ముఁబోలు మైసోయగముల్
మకరారినడక గల భా
మ కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

(శంకరాభరణం బ్లాగు నుండి)  

57. కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్ అనే సమస్యకు పూరణ

మారమదెన్ని జన్మలను మానవులై జననంబునందినా
కోరము ముక్తిరాజ్యమును కోరెదమీ ఇహలోక సంపదల్
వారిశుఁరూపమున్ విడిచి పైడిమెరుంగుల మించు భౌతికా
కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్

(శంకరాభరణం బ్లాగు నుండి)

58. అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు అనే సమస్యకు పూరణ

ఆత్మబంధువు భర్త తానంధుడైన
కనుట యేలని గాంధారి కట్టె కనులు
అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు
పతిననుసరించుటయె గదా సతికి సొగసు

(శంకరాభరణం బ్లాగు నుండి) 

59. పరుని పైన సాధ్వి మరులు గొనెను అనే సమస్యకు పూరణ
సిరియు భీష్మకునకు వరపుత్రికగ పుట్టె
విష్ణుడిలను బుట్ట కృష్ణుడగుచు
శౌరి లీలలెల్ల సభలందు విని పరా
త్పరుని పైన సాధ్వి మరులు గొనెను
(శంకరాభరణం బ్లాగు నుండి)    



60. గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే అనే సమస్యకు పూరణ


సఱ్ఱియలిస్టిక్ ఆర్టట
వెఱ్ఱికి పోకడలువేయి వీర్సిగ తరగా!
చిఱ్ఱెత్తుకొచ్చుఁ జూచిన
గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే!
(శంకరాభరణం బ్లాగు నుండి) 



61. జనసంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్ అనే సమస్యకు పూరణ


జనులే రాజ్యపు మూలమంచు జనతాసౌఖ్యమ్ము క్షేమమ్ములే
తన కర్తవ్యమటంచునమ్మి జనులన్ తాఁ దండ్రియై కాచుచున్
జనసంక్షేమము కొల్లఁగొట్టు పగతున్ శార్ధూలమై పోరి దు
ర్జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్. 
(శంకరాభరణం బ్లాగు నుండి) 


62. ఇనశశిబింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్ అనే సమస్యకు పూరణ

వనముల పాలు గాగ మది వ్యాకుల మేలనె వామలోచనా!
కనుగవ సూర్యచంద్రులయి కాంతులుజిమ్మెడి మాధవుండదే
మనలనుఁ గావవచ్చెనిటు మన్ననఁ జేయుచు చూడు ద్రౌపదీ!
యిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.


(శంకరాభరణం బ్లాగు నుండి) 


63. వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్ అనే సమస్యకు పూరణ

హర్షంబన్నది లేదు ఆశ మనిషిన్ ఆడింపగా కీర్తికై
తర్షుండై వనరాశులన్ దునిపి తా దర్పంపు హర్మ్యంబులన్
కర్షాకర్మము మాని నిల్ప భువిలో కల్లోలముల్ రేగగా
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖ మాసంబునన్.

(శంకరాభరణం బ్లాగు నుండి)  


64. మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్ అనే సమస్యకు పూరణ

మగనిని గూర్చిన తలపులు
మగువదె మదివిప్పి చందమామకు చెప్పెన్
మగడవి యెరుగునొ లేదో
మగఁడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

(శంకరాభరణం బ్లాగు నుండి)  









చివరగా 30జూలై  2011 వరకు నవీకరించబడినది.

8 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

అన్నీ శ్రమకొర్చి ఒకదగ్గర పెట్టనందుకు సంతోషమండి...
మీ ప్రోత్సాహముతో వారి కృషి తో మరిన్ని పద్యాలు వ్రాస్తారని ఆశిస్తూ .

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మురళీ,
చిన్నప్పటి నుండీ కార్టూన్లు వేయటం, ఆర్కిటెక్చర్ చేరడం ఇలా అన్ని విషయాల్లో ఇలానే ప్రోత్సహించావు. ఇక్కడా అంతే. ధన్యవాదాలు. పద్యాలని చూస్తే ముందు రాసినవాటిలో వ్యాకరణ ధోషాలు, భావ వ్యక్తీకరణలో ఇబ్బంది కనిపిస్తాయి. తరువాతి వాటిలో కొంత అభివృద్ధి కనిపిస్తోంది. ఇలా నా శైలిని నేను చూసుకొనే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. అమ్మ సంతోషిస్తుందని అనుకొంటాను.
ఫణి.

కామేశ్వరరావు చెప్పారు...

మీరిరువురూ సహోదరులని ఇంతదనుకా నేనెరుంగ లేదే! :-)

ఫణిగారు గుర్తించినట్టు రానురాను అతని పద్యాలు పదునెక్కడం స్పష్టంగా తెలుస్తోంది.

ఫణిగారూ, ఇలాగే మీ సాధన కొనసాగించండి. పద్య పూరణలనే కాక పద్య కవితలని కూడా వ్రాయడనికి ప్రయత్నించండి.

రవి చెప్పారు...

ఫణి గారి పద్యాలు వేటికవే అద్భుతంగా ఉన్నవి. మీ పద్యాలు నా వంటి ఔత్సాహికులకు మంచి ప్రేరణ. ఫణి గారికీ, మురళి గారికీ, చెరో వీరతాడు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

వూకదంపుడు గారికి, కామేశ్వర రావు గారికి, రవి గారికి ధన్యవాదాలు.
ఫణి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆంధ్రామృతం అందఁ జేసి అమ్మకి ఆనందం కలిగించిన మీ యిరువురినీ ఆ పరమాత్మ చక్కగా దీవించి; సాహితీ సేవను నిరాఘాటంగా మీ చే చేయించాలని కోరుకొంటున్నాను.అమ్మకు వందనములు.
భవదీయుడు;
చింతా రామకృష్ణా రావు

కంది శంకరయ్య చెప్పారు...

శంకరాభరణ రాగాలాప కంఠియై
ఉప్పొంగి ఉరుకుతున్నది ఫణిప్రసన్న కుమార్ గారి కవితాఝరి.
శుభమస్తు!

కథా మంజరి చెప్పారు...

అన్ని పద్యాలను ఒకే చోట చేర్చి, ఒక టపాగా ప్రచురించడం వల్ల అప్పట్టో చదవ లేక పోయిన వాటిని చదవడానికి, చదివిన వాటిని మరొక్క మారు చదవడానికీ వీలు కలిగింది. అంతే కాక, ఫణి గారి పద్య రచనా ప్రావీణ్యం తెలియ చెప్పే సమగ్ర వేదిక లభించినట్టయింది.

మీ ఇరువురు సోదరులకు హృదయ పూర్వక అభినందనలు.