...

...

7, నవంబర్ 2011, సోమవారం

అనామిక


మనుషుల చేతి వేళ్లు ఐదింటిలో చిటికెన వేలుకు కనిష్ఠిక అని పేరు. దాని తరువాతి వేలును అనామిక అని అంటారు. ఆ వేలుకు అనామిక అని పేరు రావటానికి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకంలో యిలా సమర్థిస్తున్నాడు. 


శ్లో II  పురాకవీనాంగణ నాప్రసంగే I  కనిష్ఠి కాదిష్టిత కాళిదాసః
       ఆద్యాపితత్తుల్యక వేరభావా I  దనామిసార్థబతీబభూవా II


ఈ శ్లోకం తాత్పర్యం గమనిస్తే  ఏ వస్తువునైనా మనం లెక్కించేటప్పుడు ఎడమ చేతి వేళ్లు చాపి కుడిచేతి చూపుడు వేలుతో ఒకటి అని ఎడమచేతి చిటికెన వేలు మడిచి, రెండు అని దాని తరువాతివేలును మడిచి క్రమంగా లెక్కపెడతాము. పూర్వకాలమందు కవులను లెక్క పెట్టవలసి వచ్చినప్పుడు కాళిదాసు పేరు మొదట చెప్పి చిటికెన వేలు (కనిష్ఠిక)ను ముడుచుచు వచ్చారు. అది మొదలుకొని నేటి వరకు కాళిదాసుతో సమానుడైన కవీశ్వరుడు రెండవవాడు లేకపోవుటచే చిటికెన వేలు తరువాత ఉన్న వేలును మడిచి లెక్క చెప్పుటకు కవి దొరకలేదు. ఆ వేలుకు నామకుడు ఎవ్వడూ  దొరకలేదు కాబట్టే ఆ వేలుకు అనామిక అనే పేరు సార్థకమైనదని ఆ కవి చమత్కారంగా చెప్పాడు.  పనిలోపనిగా కాళిదాసు గొప్పతనాన్ని కవి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.

(చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి మనోరమ పత్రికనుండి)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి