...

...

13, మార్చి 2012, మంగళవారం

పుస్తక సమీక్ష 22 - తెలంగాణా ఆడబిడ్డ నాయకురాలు నాగమ్మ


[పుస్తకం పేరు: నేను... నాయకురాలు నాగమ్మని మాట్లాడుతున్నా..! ఆత్మ కవిత కవులు: కె.వి.నరేందర్, సంగెవేని రవీంద్ర; వెల: 50/-; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి అన్ని బ్రాంచీలు]

పల్నాటి చరిత్రలో ప్రధాన భూమిక వహించిన నాగమ్మ స్వగతం ఈ దీర్ఘకవితలో చదవవచ్చు. నాయకురాలు నాగమ్మ స్వస్థలం తెలంగాణా ప్రాంతమైన కరీంనగర్ జిల్లా ఆరవెల్లి గ్రామం అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వ్రాసిన ఈ దీర్ఘ కవితలో ఆమెను విలన్‌గా చిత్రిస్తూ పురుషాధిక్య సమాజం చేసిన కుట్రను కవులు ఎండగడుతున్నారు. భారతదేశపు తొలి మంత్రిణిగా నాగమ్మకు తగిన గుర్తింపు రాలేదని ఆవేదన చెందుతున్నారు.

ఈ పుస్తకంలో ఆరవెల్లి గ్రామంలో ఉన్న నాగమ్మ గుడికి చెందిన ఫోటోలు అనుబంధంగా ఇచ్చారు. పల్నాటి చరిత్ర పై వచ్చిన పుస్తకాలు, సినిమాలలో ఆరవెల్లి ప్రస్తావన వచ్చిన సందర్భాలను ఈ పుస్తకంలో ఉటంకించారు.

పుట్టిన ఊరిని వదిలి ఎక్కడో పల్నాటికి వలసవెళ్ళి తనేమిటో నిరూపించుకున్న తొలి మహిళా మహామంత్రిణి నాగమ్మ గురించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పరిశోధకులు నిర్లిప్తంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు కె.వి.నరేందర్, సంగెవేని రవీంద్ర గార్లు. ఇది కొంతవరకు సబబే.

అయితే ఎన్.టి.రామారావు నటించిన పల్నాటి యుద్ధం సినిమాకు చెందిన సి.డి.కవర్‌పై నాగమ్మ పాత్రధారిణి భానుమతి ఫోటోలేక పోవడంపై ఒక వైపు యాదృచ్ఛికమేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ మరో వైపు దీని వెనుక  సాంస్కృతిక, చారిత్రక కుట్ర ఉందేమోనని వీరు సంశయిస్తున్నారు.  ఇది ప్రతి విషయంలోనూ తెలంగాణాకు అన్యాయం జరిగిపోతుందని నిరూపించాలని తాపత్రయపడే సగటు తెలంగాణావాది మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నది.  సి.డి.కవర్‌పై భానుమతి ఫోటో లేకపోవడం అల్పాతి అల్పమైన విషయం. ఇందులో చారిత్రక కుట్ర, సాంస్కృతిక కుట్ర లాంటి పెద్ద పెద్ద మాటలు వాడడం వీరి అసహనానికి అద్దం పడుతోంది. నిజంగానే తెలంగాణావాసి అయిన నాగమ్మ పాత్రను కించపరిచే కుట్ర జరిగివుంటే దానిని నిరూపించడానికి ఆ సినిమాలో భానుమతి పాత్రను తక్కువ చేసి చూపించారా? ఆ సినిమా పై అలనాటి పత్రికల్లో వచ్చిన రివ్యూల్లో భానుమతి పాత్ర గురించి ప్రస్తావించారా? లేదా? ప్రస్తావిస్తే మిగితా పాత్రలతో పోలిస్తే ఎక్కువగా లేదా తక్కువగా పేర్కొన్నారా? ఆ సినిమా పోస్టర్లలో, స్టిల్స్‌లో ఎన్.టి.ఆర్., గుమ్మడిలతో పాటుగా భానుమతి చిత్రం ఉందా లేదా? మొదలైన విషయాలను పరిశీలించి చూడాల్సి వుంది. ఇవేవీ చేయకుండా కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయడం చూస్తే వీరి పట్ల జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేము.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి