...

...

9, మే 2010, ఆదివారం

పుస్తక సమీక్ష 15 - కడలి కెరటం

[పుస్తకం: కడలి కెరటం, రచన: యస్వీ కృష్ణ, పేజీలు:32, వెల:రూ.3/-, ప్రతులకు: జయంతి పబ్లికేషన్స్, 19-12 పి&టి కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ -60]

                     ఈ పుస్తకానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేవలం ఒక కథ మాత్రమే పుస్తకంగా ముఖ్యంగా తెలుగుభాషలో వచ్చిన దాఖలాలు కనిపించటం లేదు. ఈ కడలి కెరటం అటువంటిదే. ఇది ఒకరకమైన సాహసోపేతమైన చర్య. కాపీరైట్ చట్టంపై వచ్చిన మొదటి కథ కూడా ఇదే.

                   32పేజీల ఈ చిన్ని పుస్తకంలో కథతో పాటు ఈ కథపై పలువురు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఉన్నాయి. అవి సేమ్యా పాయసంలో కిస్‌మిస్ జీడిపప్పుల్లా ఈ పుస్తకంలో కథకు రుచిని ఇస్తున్నాయి.

                   కడలి కెరటం కథ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమై రాత్రి సుమారు ఏడు ఏడున్నర గంటలకు ముగుస్తుంది. ఈ ఐదు గంటల వ్యవధిలో రెండు మూడేళ్ళ కథను వివరిస్తారు రచయిత. ఈ కథలో హీరో కూడా ఒక రచయితే. కథానాయకుడు జైలులో అడుగుపెట్టడంతో మొదలై జైలు నుండి బయటకు రావటంతో కథ ముగుస్తుంది. చర్లపల్లిలోని ఓపెన్ ఎయిర్ జైలు గురించి కథలో చక్కగా వర్ణించబడింది. ఈ జైలు గురించి వచ్చిన మొదటి కథ కూడా ఇదే కాబోలు. మనకు సినిమాల్లోనూ, నవలల్లోనూ పరిచయం ఉన్న సెంట్రల్ జైలుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ కథలోని జైలు. ఈ జైలు వర్ణన కాస్త విస్మయాన్ని కలిగిస్తుంది. జైలు లోపల వెడల్పాటి రోడ్లు, చుట్టూ చెట్లు, పార్కులు, విశాలమైన భవనాలు వీటిని వివరిస్తూ యూనివర్సిటీ క్యాంపస్‌లా ఉంది అంటారు. ఒక చోట ఈజైలును ప్రకృతి చికిత్సాలయంతో పోలుస్తున్నారు. మరో చోట ర్యాగింగ్ లేని మెడికల్ కాలేజితో పోలుస్తున్నారు రచయిత. ఇక కథలోకి వెళితే అమర్ ఒక రచయిత. అతని రచనల్లో సత్తా ఉన్నా సాహిత్య ప్రపంచంలో అతనికి పరిచయాలు లేకపోవడం వలన అవి ప్రచురణకు నోచుకునేవి కావు. అలాంటి సమయంలో ఓ ఛోటా రచయిత్రి ఇతని రచనలను కొని తన పేరుతో ప్రచురించుకుంటానని ప్రలోభ పెడుతుంది. ఆర్థికంగా కలిసివస్తుందని ఒప్పుకుంటాడు అమర్. ఆ విధంగా అతను ఘోస్ట్‌రైటర్‌గా మారి సదరు రచయిత్రి ఉత్తమరచయిత్రిగా ఎదగడానికి ఉపయోగపడతాడు. రెండేళ్ళు సాఫీగా నడుస్తుంది ఈ వ్యవహారం. అతడు తన పేరును అచ్చులో చూసుకోవాలనే కోరిక బలపడటంతో ఒక నవలను వ్రాసి తన పేరుతో ఒక పత్రికకు పోటీకి పంపుతాడు. ఆనవలకు బహుమతి వస్తుంది. అతనికి పేరు రావడం చూసి ఈర్ష్యతో తట్టుకోలేని ఆ రచయిత్రి ఆ నవల సీరియల్‌గా పత్రికలో ప్రారంభం కాకముందే తన పేరుతో రిలీజ్ చేసుకుని అమర్‌పై తన రచనని కాపీ కొట్టాడని కేసు బనాయించి కోర్టుకీడ్చి, జైలుకు రిమాండ్‌కు పంపిస్తుంది. అంతేకాక తన పరపతితో అతని ఉద్యోగాన్ని ఊడబెరికిస్తుంది. ఇదీ కథ. ఈ కథను జైల్లో వినడానికి సదానంద్ అనే పాత్ర సృష్టించబడింది. ఆ సదానంద్ జైలుకు రావడానికి అతనికో నేరచరిత్ర కల్పించబడింది. సదానంద్‌ను సాధువుగా చూపించటానికి అతని భార్యను నీచపాత్రగా చూపాల్సి వచ్చింది. ఇక్కడే మనకు యస్వీ కృష్ణ గారి  ప్రతిభ కనిపిస్తుంది. చివరకు అమర్ తన నవలను కన్నబిడ్డతో సమానంగా పేర్కొనడంతో కథ ముగింపు రక్తి కట్టించింది

                  ఈ కథలో అమర్ పాత్రపై మనకు సానుభూతి కలుగుతుంది. అయితే అమర్ తాను ఘోస్ట్‌రైటర్‌గా మారటాన్ని - పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల్నైనా పెంచి పోషించే స్థోమత లేనప్పుడు ఆ బాధ్యత వహించి, వారికి మంచి జీవితాన్నిచ్చి వెలుగులోకి తీసుకురాగల శక్తిసామర్థ్యాలున్న వారికి దత్తత ఇవ్వడంలో తప్పులేదనే - పోలికతో సమర్థించుకోవడం మాత్రం ఆక్షేపణీయం.

                 'నేనొక రచయితను. ఈ మాట ఇక్కడ చెప్పుకున్నంత ధైర్యంగా, బాహాటంగా బయట చెప్పుకోలేని పరిస్థితి నాది' అంటాడు అమర్ ఒక చోట. ఈ దుస్థితి ఏ రచయితకూ రాకూడదు. 

                 సింగిల్ టీ ఖర్చుతో ఓక మంచి కథను అందించిన యస్వీ కృష్ణ అభినందనీయుడు. రచయితా, పబ్లిషరూ ఒకరే అయితే ఆ పుస్తకం రచయిత అభిరుచికి తగ్గట్టుగా మంచి గెటప్‌తో వెలువడుతుంది అనడానికి ఈ పుస్తకం ఓ మచ్చు తునక.

[సాహితీ కిరణం మాసపత్రిక మే 2010 సంచికలో ప్రచురితం]      
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి