[పుస్తకం: ఓటర్లకొకమాట, రచన: కీ.శే.అంబటిపూడి వెంకటరత్నం, పేజీలు:44, వెల:రూ.40/-, ప్రతులకు: శ్రీ ఎ.వి.సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఇ.నెం.బి-19/18-65/3 ఫ్లాట్ నెం.103, శ్రీసాయినివాస్, వెస్ట్ వెంకటాపురం, ఎం.యి.ఎస్.కాలనీ,అల్వాల్, సికింద్రాబాద్ 500 015 సెల్:9949849583]
అంబటిపూడి వారి పేరు వినగానే వెంటనే స్ఫురించేది వారు స్థాపించిన సాహితీ మేఖల. ఈ సంస్థ నల్గొండ జిల్లాలోనే కాక యావత్ తెలంగాణా ప్రాంతంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది.
ఈ ప్రభోదాత్మక కావ్యాన్ని అంబటిపూడివారు 1955లో వ్రాసి ప్రకటించారు. ఐదున్నర దశాబ్దాలు గడిచినా నేటి పరిస్థితులకు కూడా ఈ రచన అనుగుణంగా ఉన్నదని భావించిన సాహితీ మేఖలవారు ఈ కావ్యాన్ని పునర్ముద్రించారు. 119 పద్యాలు కలిగిన ఈ రచనకు రాళ్ళబండి శ్రీరామమూర్తిగారి వ్యాఖ్యానం శోభనిస్తోంది.
ఎన్నికల ముందు నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోమని ఓటరునుద్దేశించి అంబటిపూడి వెంకటరత్నంగారు చేసిన ఈ ఉద్బోధలో సామాజిక అసమానత, ఆర్థిక వ్యత్యాసం, ప్రజల మధ్య అనైక్యత మొదలైన అంశాలపై కవిగారి ఆందోళన కనిపిస్తోంది.
గాంధీజీ, ఇందిరాగాంధీ, మాక్స్‌ముల్లర్ మొదలైన వారిపై కవిగారికున్న అభిమానం ఈ పద్యాల్లో ద్యోతకమౌతున్నాయి. పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రశంసిస్తూ చెన్నపట్టణం ఆంధ్రులకు దక్కకపోవడానికి కారణమైన చక్రవర్తి రాజగోపాలాచారి దౌత్యాన్ని నిరసించారు. పాశ్చాత్య కవులైన షేక్స్‌పియర్, ఇలియట్, ఆర్నాల్డ్ తదితరుల పట్ల ఉన్న అభిమానం ఈ పద్యాల్లో కనిపిస్తుంది. పాఠకుల్లో రాజకీయ చైతన్యాన్ని, ప్రజా సమస్యలపీ స్పృహను కలిగింపజేసే ఈ రచన కవిగారి ప్రతిభా సంపత్తికి నిదర్శనం.
అంబటిపూడి వారి పద్యాలను చవి చూడటానికి మచ్చుకు రెండు ఇక్కడ చదవండి.
తినుటకు తిండి కట్టుకొన - తిన్నని బట్ట వచింప విద్దెయున్
మనకు హుళక్కియై మనసు - మాత్రము మిన్నున గాలిమేడ లే
పిన ఫలమేమి? యే ఘనులొ - పెద్దవి పెద్దవి గద్దెలందుకో
జనుటకు సాధనాల మయి - చంకలు గొట్టిన పొట్ట నిండునే.
'మీ వోటును మా కిం'డని
మీ వెంట ధనమ్ము తోడ మేకొను వారల్
పూవిలుతులొ భూపతులొకొ!
మీ విజ్ఞత లెట్టియెట్టి మెలకువ గనునో?
[సాహితీ కిరణం మాసపత్రిక మే 2010 సంచికలో ప్రచురితం]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి