మన పురాణకావ్యాలు రామాయణ భారతాలను ఎందరో ఎన్నోరకాలుగా విశ్లేషిస్తున్నారు. వారివారి అవగాహనకు అక్షర రూపం కల్పించి గ్రంథస్తం చేస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా వ్రాసినా ఆ రచనలకు విశేషమైన ప్రాధాన్యం లభిస్తోంది. దానికి కారణం మూల రచనలైన వ్యాస భారతం, వాల్మీకి రామాయణాల వైశిష్ట్యమే. ప్రస్తుతం కస్తూరి మురళీకృష్ణ మహాభారతంలోని ద్రౌపది పాత్రను తీసుకుని ఆ పాత్ర ఆధారంగా భారత కథను మనకు సౌశీల్య ద్రౌపది అనే పేరుతో ఒక నవలిక రూపంలో అందిస్తున్నారు.
ఈ రచన నేపథ్యాన్ని రచయిత తన ముందు మాటలో చాలా వివరంగా తెలిపారు. ఇటీవలి కాలంలో మన భారతీయ ధర్మానికి ప్రతీకలైన పురాణ పాత్రలను దిగజారుస్తూ జరుగుతున్న దుష్ప్రయత్నాలకు, వాటికి లభిస్తున్న ప్రచారాలకు సమాధానంగా ఇటువంటి రచనల అవసరాన్ని గుర్తించారు రచయిత. దాని పర్యవసానమే ఈ సౌశీల్య ద్రౌపది.
కృష్ణుని నిర్యాణానంతరం ద్రౌపది పాండవులతో కలిసి హిమాలయాలకు పయనించడంతో ఈ కథ ప్రారంభమౌతుంది. ఆమె పాండవులందరి కంటె ముందు తనువు చాలిస్తుంది. భీమసేనుడు తమ కంటే ముందు ద్రౌపది మరణించడానికి కారణం గురించి ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ధర్మరాజు సమాధానం విన్న ద్రౌపది తనపై వచ్చిన అపోహను తలచుకుని నవ్వు కుంటుంది. తన జీవితంలో తాను అనుభవించిన అపోహలు, అవమానాలు, అపార్థాలను గుర్తు చేసుకుంటుంది.
కారణ జన్మురాలైన ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్ర ఛేదనతో చేపట్టటం, పాండవులు ఆమెను తీసుకుని కుంతివద్దకు వచ్చి భిక్ష తెచ్చామని చెప్తే ఆమె భిక్ష ఏమిటో చూడకుండా ఐదుగురినీ పంచుకోమనటం, తల్లి మాటను జవదాటని పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవటానికి సిద్ధ పడటం, ఐదుగురు భర్తలను పొందటానికి కారణము వ్యాసుని ద్వారా తెలుసుకోవటం, నియమోంఘల్లన చేసిన అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళి ఉలూచి, చిత్రాంగద, సుభద్రాదులను పెళ్ళి చేసుకుని రావటం, సుభద్ర అభిమన్యుడికి, ద్రౌపది ఉపపాండవులకు జన్మనివ్వటం, ధర్మజుని రాజసూయ యాగము, మయసభలో సుయోధనుని పరాభవము, ద్యుతక్రీడలో ధర్మరాజు ద్రౌపదితో సహా సర్వం ఓడిపోవటం, ద్రౌపది వస్త్రాపహరణ, పాండవుల వనవాస అజ్ఞాతవాసాలు, సైంధవ పరాభవము, కీచకవధ, రాయబారాలు, కురుక్షేత్ర సంగ్రామం, ఉపపాండవుల వధ, అశ్వత్థామ ప్రాణదానం ఇలా కథ సాగిపోతుంది. ఆయా సందర్భాలలో ద్రౌపది ఎదుర్కొన్న అవమానాలు, పడిన మానసిక సంఘర్షణ, క్షోభ, చూపిన సంస్కారం, నిండు సభలో అధర్మాన్ని ప్రశ్నించే తెగువ, తన పట్ల అనుచితంగా వర్తించేవారిపై చూపే క్రోధం, తనను అవమానించిన వారి నాశనం పట్ల నిర్లిప్తత, కనీసం ఒక తల్లికైనా పుత్రశోకం తప్పించాలన్న ఔన్నత్యం, క్షమాగుణం వీటన్నిటినీ రచయిత చక్కగా పాఠకుల కళ్ళముందు ఉంచుతున్నారు.
ఒక స్త్రీని చులకన భావంతో చూసి లైంగికవస్తువులా భావించే కాముకులకు ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది. మురళీకృష్ణ గారి శైలి ఆద్యంతం చదివించేలా వుంది. ఒకటి రెండు అక్షరదోషాలున్నా అవి పఠనానికి ఆటంకం కావు. ఇంత మంచి రచనను అందించిన రచయితకు నా అభినందనలు.
96 పేజీలున్న ఈ పుస్తకం వెల 50రూపాయలు మాత్రమే. కొనదలచినవారు నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాదు వారిని సంప్రదించండి.(ఫోన్ 040- 24652387)
6 కామెంట్‌లు:
ఒక స్త్రీని చులకన భావంతో చూసి లైంగికవస్తువులా భావించే కాముకులకు ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది.
హ హ భలే జోక్ చేసారండి.
ఇంకా పుస్తకావిష్కరణ జరగనే లేదు అప్పుడే సమీక్షా? ఏమైనా పుస్తకం గురించి బాగా వివరించారు.
@ అజ్ఞాతా! ముందు పుస్తకం చదివి మళ్ళీ కామెంట్ చెయ్యి.
@ అరిపిరాల సత్యప్రసాద్‌గారూ ధన్యవాదాలు. ఈ పుస్తకం ఇంతకు ముందే తెనాలితో ఆవిష్కరింపబడిందండీ!
పుస్తకం చదివి తీరాల్సిందేననిపిస్తోంది! పరిచయం చేసినందుకు నెనరులు.
"ఒక స్త్రీని చులకన భావంతో చూసి లైంగికవస్తువులా భావించే కాముకులకు ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది." - కాముకులు భుజాలు తడుముకునేట్టు చేసేలా ఉం దీవాక్యం. :)
ఈ కధ నేను ఆంధ్రభూమి మాసపత్రికలో చదివాను చాలా బావుంది."ఒక స్త్రీని చులకన భావంతో చూసి లైంగికవస్తువులా భావించే కాముకులకు ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది." ఈ మాట ఈనాటి స్త్రీలకే కాదు పురాణాలకాలం నాటి స్త్రీలకు కూడా స్వానుభవమే అని తెలుస్తుంది.
@చదువరి గారూ, @జ్యోతిగారూ మీ కౌంటర్లకు ధన్యవాదాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి