...

...

26, నవంబర్ 2010, శుక్రవారం

ఆదర్శం -ఆచరణ


 "ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్దం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది"
 - స్వామి శివానంద.

             మనిషి తన అంతరంగంలో అనునిత్యం పోరాడుతూనే వుంటాడు. తన ఆలోచనలు, ఆచరణలు, ప్రవర్తన న్యాయమైనవా? కావా? నిజాయితీతో కూడినదా? కాదా? అని మథన పడుతూనే వుంటాడు. ఈ అంతర్మథనం నుండే అతని వ్యక్తిత్వం బయటపడుతుంది. మనిషి తన జీవితంలో ఆదర్శాలను, నీతి నియమాలను, బాధ్యతలను, మార్పులను, తృప్తి - అసంతృప్తులను, జయాపజయాలను ఎదుర్కొనక తప్పదు.
           
            తెలుగునాట పేరున్న రచయితలలో అజీజ్‌గారు ఒకరు. వీరు కథ, నాటకం, నవల మొదలైన ప్రక్రియలలో తమదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అజీజ్‌గారి కలం నుండి జాలువారిన కొన్ని కథల కూర్పే "మనిషి" కథల సంపుటి. ఈ సంపుటిలోని కథలలో మనకు మానవీయ విలువలపై స్పష్టమైన దృక్పథం కనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఓ మంచి పని చేసి, వెలకట్టలేని ఆత్మతృప్తిని మిగుల్చుకోవాలి అంటారు ఒక కథలో. దేవుళ్ళ పేర, పెళ్ళి పేర, పుట్టినరోజు పేర, తద్దినాల పేర పెట్టే ఖర్చులో కొంత శాతమైనా అనాథలకు ఖర్చు చేయాలని సూచిస్తారు మరో కథలో. ధనం, కులం, మతం, గోత్రం, సంప్రదాయం వల్ల సాధ్య పడనిది ప్రేమ వల్లే సాధ్యపడుతుందని రేపటి తరం కథలో నిరూపిస్తారు రచయిత. ఏ సమాజంలో పుట్టి, ఏ సమాజంలో పెరిగి, ఏ సమాజం ద్వారా డబ్బు సంపాదిస్తున్నామో, అలాంటి సమాజానికి చేతనైన మంచి చేయలేక పోవడం అనైతికం అని రచయిత అభిప్రాయం. ఈ విషయాన్నే అనైతికం, రుణం, మనిషి, బాధ్యత కథలలో బలంగా చెబుతున్నారు. ఆదర్శాలనేవి కేవలం రచనల్లోనో, ఉపన్యాసాల్లోనో కాక నిజ జీవితంలో ఉండాలన్నది అజీజ్‌గారి గట్టి నమ్మకం. ఈ విషయం దాదాపు వీరి కథలన్నింట్లోనూ కనిపిస్తుంది. మనిషి   కథలో కొడుకును రిజిస్టర్ మ్యారేజి చేసుకొమ్మని చెప్పడంలోనూ, ఆదర్శం, మారాలి మనం కథల్లో కులాంతర వివాహం జరిపించడంలోనూ, రుణం కథలో అనాథలకు ఉపాధి చూపించడంలోనూ ఈ విషయం స్పష్టమౌతుంది. ఆమె నవ్వులో... అన్న కథలో ముగింపు వాక్యల్లో 'ఆమె నవ్వులో అమ్మతనం కనిపించింది' ఈ భావన నిజంగా ఆ కథకు గొప్పదనం చేకూర్చటమే కాక ఉదాత్తతను సంతరించుకునేలా  చేసింది. 
పాలకుల్లో స్వార్థం, అధికారుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ప్రజానీకంలో ఉదాసీనత వీటన్నిటిపై రచయిత ఉక్రోషం ఉప్పెన కథగా రూపొందింది. ఎర్రకాగితాలు కథలో ఎదుటివారి అవసరాన్ని తనకు అవకాశంగా మార్చుకునే అంజిబాబు, అంతరంగాలు కథలో సుధాకర్‌కు కనువిప్పు కలిగించిన పల్లీలు అమ్మేవాడు, ఆదెమ్మ కథలో మాతృత్వం కోసం ఎలాంటి పైనికైనా సిద్ధపడే స్త్రీమూర్తి వంటి వారు సమాజంలో విభిన్నమైన వ్యక్తిత్వాలకు ప్రతీకలు. 


           ఈ కథలన్నీ అజీజ్‌గారికి సమాజం పట్ల ఉన్న అవగాహనకు, పరిశీలనకు, నిబద్ధతకు అద్దం పడుతున్నాయి. ఇవి కడదాకా చదివిస్తాయి. ఆలోచనల్ను రేకెత్తిస్తాయి. ఈ కథలు చదివి మనం ఏ కొంచమైనా ప్రభావితులమైతే రచయిత విజయం సాధించినట్లే. ఈ పుస్తకానికి ప్రయోజనం ఒనగూరినట్లే. అందులో నాకేమాత్రం సందేహం లేదు. మీకు కూడా ఉండదని పుస్తకం చదివిన తర్వాత నిస్సంకోచంగా ఒప్పుకుంటారు.

-కోడీహళ్లి మురళీమోహన్
                            (మనిషి కథాసంపుటికి వ్రాసిన 'ముందు'మాట)

కామెంట్‌లు లేవు: