...

...

11, నవంబర్ 2010, గురువారం

దీనిభావమేమి?

శ్రీ కంది శంకరయ్యగారు తమ శంకరాభరణం బ్లాగులో ఇస్తున్న ప్రహేళికలు చూసి పొందిన ప్రేరణతో ఈ ప్రహేళికను తయారు చేశాను. ఈ పద్యంలో నేను చెప్పదలచినది ఏమిటోవివరించండి.

సీ. లీడరు తాతకు లీలగ తనయుడై
           నట్టియతని బావ నలరు బోడి
    సంగడించిన వాని సంప్రీతురాలి పె
           నిమిటికి తమ్ముడు నిజముగాను
    ఆతని తండ్రికి అత్త కొడుకు టెక్కు
           తెఱగునకధిపతి తఱచి చూడ
    మూడవయవతారముచె ప్రభావితుడైన
           శూరుని కనుగొన శోకలేమి!

తే.గీ. అతడు వితతమొనర్చిన ఆశయముల
       ననుసరించిన దివ్యగుణ యశకీర్తి
       చేసిన సముద్యమమునకు చేరుగడ
       సర్వసాక్షి యొసగు గాక సంపదలను!!

ఈ ప్రహేళికలోని ప్రత్యేకత ఏమిటంటే దీనిలో మూడు అంశాలున్నాయి. ఎరుపు రంగులో ఉన్నది లౌకిక అంశము అంటే ప్రస్తుత రాజకీయాలు, సినిమాలు, గాలి కబుర్లు మొదలైన వాటి ఆధారంగా చేసుకుని తయారు చేసినది అన్నమాట. ఇక ఆకుపచ్చ రంగులో ఉన్న భాగము పౌరాణిక సంబంధమైనది. అలాగే నీలం రంగులో ఉన్నది చారిత్రక అంశాలతో కూడినది. ఒక దానిలోనుండి మరో అంశానికి పోయినపుడు ఆ భాగంలోని పాత్రతో అన్వయించుకోవాలి. ఉదాహరణకు లౌకిక భాగములో సినీ నటుడు కృష్ణ చివరగా వచ్చాడనుకోండి అది పౌరాణిక భాగంలో వచ్చేసరికి శ్రీకృష్ణునిగా అన్వయించుకోవాలి. అర్థమయింది కదా ఇక ప్రయత్నించండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి