...

...

14, నవంబర్ 2010, ఆదివారం

దీని భావమిదియె!

దీని భావమేమి అంటూ నేను ఇచ్చిన ఈ ప్రహేళికకు స్పందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు!


సీ. లీడరు తాతకు లీలగ తనయుడై

           నట్టియతని బావ నలరు బోడి

    సంగడించిన వాని సంప్రీతురాలి పె

           నిమిటికి తమ్ముడు నిజముగాను

    ఆతని తండ్రికి అత్త కొడుకు టెక్కు

           తెఱగునకధిపతి తఱచి చూడ

    మూడవయవతారముచె ప్రభావితుడైన

           శూరుని కనుగొన శోకలేమి!

తే.గీ. అతడు వితతమొనర్చిన ఆశయముల

       ననుసరించిన దివ్యగుణ యశకీర్తి

       చేసిన సముద్యమమునకు చేరుగడ

       సర్వసాక్షి యొసగు గాక సంపదలను!!

శ్రీయుతులు భైరవభట్ల కామేశ్వర రావు, ఊకదంపుడు, అజ్ఞాత గార్లు కొంతవరకు దీనిని సాధించారు. వారికి నా అభినందనలు. పై ప్రహేళికకు నేను అనుకున్న సమాధానం ఇది.
లీడరు - రానా (లీడర్ సినిమా హీరో!)


అతని తాత - రామానాయుడు
అతని తనయుడు - వెంకటేష్
అతని బావను - నాగార్జునను
అలరు బోడిన్ - అమలను (అలరుబోడి = భార్య)
సంగడించిన వాడు - రామ్‌గోపాల్ వర్మ (సంగడించుట అంటే జతపఱచుట అని అర్థం. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ షూటింగ్ సమయంలోనే అమల నాగార్జునల మధ్య ప్రేమ అంకురించి పెళ్ళికి దారితీసింది. ఆ విధంగా వారిని జతకలిపిన వాడు వర్మ.)
వాని సంప్రీతురాలు - శ్రీదేవి (రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవిని తన ప్రేయసిగా ఈ మధ్య సాక్షి ఫన్‌డేలోని ఒక శీర్షికలో తెగ చెప్పుకుంటున్నాడు. సంప్రీతి అంటే ప్రేమ.)
ఆమె పెనిమిటి - బోనీ కపూర్
అతనికి తమ్ముడు - అనిల్ (కపూర్).
ఇంతవరకు లౌకిక భాగము. తరువాతిది పౌరాణికము.
అనిలుని తండ్రి - శ్రీకృష్ణుడు (అష్టమహిషుల్లో ఒకరైన మిత్రవిందకు శ్రీకృష్ణుని కలిగిన సంతానంలో  అనిలుడు ఒకడు)
అతని అత్తకొడుకు - అర్జునుడు.
అర్జునుని టెక్కు తెఱగు - ఆంజనేయుడు (టెక్కు = జెండా,తెఱగు = గుర్తు)
అతనికి అధిపతి - రాముడు (అధిపతి = ప్రభువు)
రాముని మూడవ అవతారము - బుద్ధావతారం(రామ, కృష్ణ, బుద్ధ) 

ఇక చారిత్రకము.
బుద్ధునిచే ప్రభావితుడైన శూరుడు - అశోకుడు 
అతడు వితతమొనర్చిన ఆశయములు - శాంతి అహింసలు (వితతము = ప్రచారము)
వాటిని అనుసరించిన వ్యక్తి - గాంధి మహాత్ముడు.
అతను చేసిన సముధ్యమము - ఉప్పు సత్యాగ్రహము
దానికి చేరుగడ - దండి (చేరుగడ = నెలవు, స్థానము)
భగవంతుడు దండిగా (మెండుగా,సమృద్ధిగా) సంపదలను ఇచ్చుగాక అని ఈ పద్యం తాత్పర్యం. 

1 కామెంట్‌:

ఊకదంపుడు చెప్పారు...

బావుందండీ - మరొకటివ్వరూ