...

...

2, జనవరి 2011, ఆదివారం

భరత సుతుడా మేలుకో! -17

156.గతము మరచుట మేలు అనియెడు
       అయ్యవార్లకు కొదువలేదిట
       గతము చచ్చిన జాతి చచ్చును
       భరత సుతుడా మేలుకో!

157.పోరలను ఉరిదీయు బడిలో
       తల్లిదండ్రులె వేయుచుందురు
       ప్రహ్లాదుని తండ్రె మేలట
      భరత సుతుడా మేలుకో!

158.విద్యయందున విషము వలదని
       పూర్వజులు మరి చెప్పియుండగ
       నేడు విషమే విద్యయైనది
       భరత సుతుడా మేలుకో!

159.శిశువు పశువుగ మారిపోగల
       చదువు చెప్పెడు బడులు కలవిట
       హీనవిద్యతొ మనిషి నాశము
       భరత సుతుడా మేలుకో!

160.అక్షరమ్ముల విలువ నెఱుగక
       ఏబదారున కోతవెట్టిరి
       అల్పజ్ఞానులు ఘనతనొందిరి
       భరత సుతుడా మేలుకో!

161.డూమూవూలకు లొంగి సంస్కృత
       పదములె తెలుగయ్యె, నట్లే
       కొత్త పదములు చేర్చుకొనుటకు
       భరత సుతుడా మేలుకో!

162.వ్రాయు భాషకు పలుకు సంజ్ఞలు
       ఆంగ్లభాషలొ విడిగ నుండును
       తెలుగు భాషకు రెండు ఒక్కటె
       భరత సుతుడా మేలుకో!

163.మాట శబ్దము వ్రాత చిహ్నము
       మాట వ్రాతలు క్షరాక్షరములు
       వ్రాయబడినది భావి నిధి గద
       భరత సుతుడా మేలుకో!

164.వ్రాయుమాటకు స్థాయిగావలె
       భావి వారికి అర్థమవవలె
       అట్లు కానిచొ రచన వ్యర్థము
       భరత సుతుడా మేలుకో!

165.సృజన చేసెడి వాడె అర్థము
       చెప్పు స్థాయిలొ రచన యుండిన
       కవితొ పాటుగ రచన చచ్చును
       భరత సుతుడా మేలుకో!

166.అనుభవించిన వాడె రచనను
      చేయవలెనను నియమముండిన
      గర్భవతి కథ నరుడు వ్రాయడు
      భరత సుతుడా మేలుకో!

167.అనుభవమ్మే అర్హతనినచొ
      మానభంగము కథను వ్రాయగ
      పొందవలెగద మానభంగము
      భరత సుతుడా మేలుకో!

168.వేదమన్నది జ్ఞాన పేటిక
       మూత తెరిచెడు శక్తి కలిగిన
       సంస్కృతమ్మును పారవేస్తిమి
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి