...

...

4, జనవరి 2011, మంగళవారం

భరత సుతుడా మేలుకో! -18

169.పాలకడలిలొ పుట్టినాడట
       ఆదివైద్యుడు ధన్వంతరి
       అల్లోపతియే వైద్యమిప్పుడు
       భరత సుతుడా మేలుకో!

170.వేలయేండ్లకు మున్నె చరకుడు
       నేటి యం.డి.వలె ఫిజీషను
       శుశ్రుతుండొక గొప్ప సర్జను
       భరత సుతుడా మేలుకో!

171.సుషేణుండను వైద్య నిపుణుడు
       యుద్ధరంగమునందు లక్ష్మణు
       కాచినాడని ఎఱుగు కొరకని
       భరత సుతుడా మేలుకో!

172.నాసత్యా దస్రులనబడు
     కవలలశ్విను దేవతలుగద
     వైద్యమందున వారు దిట్టలు
     భరత సుతుడా మేలుకో!

173.పంచకరణుల శాస్త్రజ్ఞానము
       నాటివైద్యుల కుండినదియని
       ఎఱుగమైతిమి నమ్మమైతిమి
       భరత సుతుడా మేలుకో!

174.భ్రమలు గొలిపెడు సభాభవనము
       ధర్మరాజుకు మయుడు ఇచ్చెను.
       త్రిపురములు నిర్మించినపుడతడె
       భరత సుతుడా మేలుకో! 

175.మిహిర భాస్కర ఆర్యభట్టులు
       లెక్కకు మిక్కిలి శాస్త్రజ్ఞులు
       భారతావని బుట్టియుండిరి
       భరత సుతుడా మేలుకో!


176.అణువె సృష్టికి మూలమను
      సిద్ధాంతమున్నది భారతావని
      మూలపురుషుడు కణాదుండట
      భరత సుతుడా మేలుకో!


177.'ఖ'లో యుండెడివన్ని 'గోళ'ము
        లనుచు తెలిపిన భారతావని
        బల్లపరుపున భూమియనునా?
        భరత సుతుడా మేలుకో!


178.నవగ్రహమ్ముల మధ్య సూర్యుని
       ప్రతిష్ఠించిన ఆర్షధర్మము
       భూమి సృష్టికి కేంద్రమనునా?
       భరత సుతుడా మేలుకో!


179.తుప్పుపట్టని విజయస్థంభము
       కాకతీయుల ద్వార శిల్పము
       శాస్త్రజ్ఞానము కుదాహరణలు
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 

కామెంట్‌లు లేవు: