...

...

8, జనవరి 2011, శనివారం

భరత సుతుడా మేలుకో! -22(చివరి భాగం)

209.ప్రభుత గోవుల గాఁచవలెనని
       రాజ్యాంగము వ్రాసికొనియును
       గోవుఁజంపెడు ప్రభుతలొచ్చెను
       భరత సుతుడా మేలుకో!

210.గుడులకమ్మెడు ఆవునేతిలొ
       పశుల క్రొవ్వుల నూనె కలిపెడు
       దుష్టరాక్షస తతిని గూల్చగ
       భరత సుతుడా మేలుకో!

211.వైద్యుడప్పుడు హరిసమానుడు
       అతడె ఇప్పుడు లచ్చిబానిస
       వృత్తి విలువల స్థాపనమ్ముకు
       భరత సుతుడా మేలుకో!

212.కవిత్వేతర కారణాలతొ
       కవికి గలిగెడు ఖ్యాతియెట్లన
       తీగనెరుగని మల్లెపందిరి
       భరత సుతుడా మేలుకో!

213.కాళ్ళు చేతులు కళ్ళనెరుగని
       మనిషివలె మన బ్రతుకులున్నవి
       తల్లి భారతి దుఃఖమెఱుగగ
       భరత సుతుడా మేలుకో!

214.నీవు ఏడ్చిన నాకు అశ్రువు
       నేను ఏడ్చిన నీకు అశ్రువు
       కారినప్పుడె మానవత్వము
       భరత సుతుడా మేలుకో!

215.నవ్వు ఏడ్పుల సంగమమ్మీ
       జీవితమ్మని ఎఱుగు కొరకని
       క్షమను శాంతిని ప్రోది చేయగ
       భరత సుతుడా మేలుకో!

216.ఎన్ని చెప్పిన దుఃఖమాగదు
       ఎంత రాసిన ఆర్తి తీరదు
       ఏమి చేతునొ తెలియకున్నది
       భరత సుతుడా మేలుకో!

217.ధర్మమును, శీలమ్ము సత్యము
       జ్ఞానధైర్యములను గుణమ్ములు
       పంచప్రాణాల్ భరత మాతకు
       భరత సుతుడా మేలుకో!

218. ఏది నిత్యం ఏదనిత్యం
        అని వివేచన చేసిచూడగ
        అనిత్యత్వమె నిత్యమైనది
        భరత సుతుడా మేలుకో!

219.తనువనిత్యం అయిననూ మరి
       ధర్మనిత్యత చాటుకొరకని
       తనువునిచ్చిన అదియె నిత్యం
       భరత సుతుడా మేలుకో!


శుభం.

- వరిగొండ కాంతారావు
    9441886824
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి