...

...

2, జనవరి 2011, ఆదివారం

పుస్తక సమీక్ష - 20 సైన్స్ ఫిక్షన్ కథలు!

[పుస్తకం పేరు:సైన్స్ ఫిక్షన్ కథలు, రచన:కస్తూరి మురళీకృష్ణ, పేజీలు:80, వెల:రూ50/-, ప్రతులకు:నవోదయా బుక్ హౌస్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా,కాచిగూడా క్రాస్‌రోడ్స్, సుల్తాన్ బజార్, హైదరాబాద్-27]

రచయితగా ఒక ఇమేజ్‌కి బద్ధుడిని కాకూడదని, మూస రచనల ఊబిలో చిక్కుకోకూడదని విభిన్న ప్రక్రియలలో ప్రయోగాత్మకంగా చేస్తున్న రచనలలో భాగమే ఈ సైన్స్ ఫిక్షన్ కథలు అనే అర్థం వచ్చేట్లు రచయిత తన ముందుమాటలో వ్రాసుకున్నారు. అందుకు తగినట్టే ఈ పుస్తకం పాఠకులను మూస కథలనుండి దూరంగా పూర్తిగా కొత్తదైన ఒక 'వాతావరణం' లోకి తీసుకువెళ్తుంది.

వైజ్ఞానిక శాస్త్రరంగంలో జరుగుతున్న ప్రయోగాలకు, పరిశోధనలకు కొంత ఊహను జోడించి ఈ కథలను సృజించారు మురళీకృష్ణ. వీరికి ఫాంటసీకి, ఫిక్షన్‌కు మధ్య గల తేడా స్పష్టంగా తెలుసు. అయినా ఈ కథల్లో ముఖ్యంగా టైటన్లతో కరచాలనం, మిథ్యా సుందరి కథల్లో అక్కడక్కడ కొంత ఫాంటసీ తొంగి చూస్తూ ఉంది.  

మిథ్యాసుందరి, వైరస్ యుద్ధం, షాడో యూనివర్స్ నీడ, కీక్...కీక్...కీక్..., కాలం చూసిన సత్యం కథలు మన భూగ్రహం మీద నడిస్తే  మిగిలిన ఐదు కథలూ మనలను వేరే గ్రహాలకు తీసుకువెళతాయి. ప్రయోగం కథలో బుధగ్రహంలో మానవ నివాసయోగ్యతపై సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తే టైటన్లతో కరచాలనం కథలో శనిగ్రహానికి ఉపగ్రహమైన టైటన్ గ్రహంలో మానవాళికి అవసరమైన ఆహారధాన్యాలను పండించి వాటిని మన భూమికి దిగుమతి చేసుకునేట్లు రచయిత ఊహిస్తున్నారు.  నేనెవరిని కథలో మనిషి లక్షణమైన అసూయను రోబోకు ఆపాదిస్తే, కీక్...కీక్...కీక్... కథలో భావావేశాలకు అతీతం కాని మనుషులు రోబోలకు బానిసగా మారిపోయే వైనాన్ని చూపిస్తున్నారు రచయిత.    డార్క్ మాటర్ సిద్ధాంతాన్ని షాడో యూనివర్స్ నీడ కథలోనూ, వార్మ్ హోల్ గురించి పునఃసృష్టికి పురుటినొప్పులు కథలోనూ పాఠకులకు కొంత అవగాహన కల్పిస్తున్నారు.   వైరస్ యుద్ధం కథ ఇప్పటికే కొంత అనుభవంలోకి వచ్చిన కథ. ఈ మెయిళ్ల ద్వారా వైరస్‌ను, స్పైవేర్‌ను కంప్యూటర్లలోకి చొప్పించి విలువైన సమాచారాన్ని పాస్‌వర్డ్‌లను దొంగిలించి హ్యాకింగ్ ద్వారా దేశభద్రతకు సంబంధించిన విలువైన సమాచారం చేతులు మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మిథ్యాసుందరి కథ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువకులు కంప్యూటర్ గేములకు బానిసలుగా మారిన తీరును, వీటిని నిర్వహిస్తున్న గుత్తాధిపత్య సంస్థలు ప్రజలను నిర్వీర్యులుగా తయారు చేస్తున్న వైనాన్ని ఎత్తి చూపిస్తూంది.  టైం మెషీన్‌ద్వారా రెండు లక్షల సంవత్సరాల వెనక్కి గతంలో ప్రయాణించి అప్పటి విచిత్రజీవులతో చేసిన సాహసాన్ని వివరించే కథ కాలం చూసిన సత్యం. మానవ జాతిపతనంపై తన ఆక్రోశాన్ని ఆవేదనని చివరి కథ బెంటెల్గీస్‌లో బాలుడులో ఒక పాత్ర ద్వారా ఇలా పలికిస్తున్నారు మురళీకృష్ణగారు. "విశ్వంలో ఉన్న అత్యంత ప్రమాదకర జీవి మానవుడు. ఇతర జీవులు ప్రకృతిపై ఆధారపడి బ్రతుకుతాయి. ప్రకృతినుంచి ఎంత తీసుకుంటే అంత ప్రకృతికి తిరిగి అందిస్తాయి. కానీ మానవుడు స్వార్థపరుడు. ప్రకృతిని నిర్దేశించడం గొప్ప అనుకుని సర్వనాశనం చేసుకునే మూర్ఖుడు. విశ్వంలోని జీవులు ఆహారం కోసమే చంపుతాయి. కానీ భయంకరమైన మారణాయుధాలు తయారు చేసుకుని తమని తాము నాశనం చేసుకునే నీచులు మానవులు. పైగా వీళ్ళకి ఉన్న రోగం ఎదుటివాడిపై అధికారం చెలాయించడం." 

ఏది ఏమైనా  ఒక 'స్థాయి'గల పాఠకులు మాత్రమే చదివి అర్థం చేసుకోగల కథలు ఇవి. అయితే దానికి కారణం సబ్జెక్టే కానీ రచయిత ముమ్మాటికీ కాదు.                        




1 కామెంట్‌:

oremuna చెప్పారు...

The ebook is available on Kinige http://kinige.com/kbook.php?id=56