...

...

5, జనవరి 2011, బుధవారం

భరత సుతుడా మేలుకో! -20

188.స్త్రీని వస్తువు జేయుచుండెడు
       నాగరీకము మతము పోకడ
       రెండువిధముల ఎగ్గు మనిషికి
       భరత సుతుడా మేలుకో!

189.ఆడయైనచో మగకు చాలట
       ఆడువారికి సైతమితియె
       వావివరుసలు వలదువలదట
      భరత సుతుడా మేలుకో!

190.స్త్రీని జంపెడు దుష్టమోహపు
       రాక్షసత్వము పేరు ప్రేమట
       ప్రేమకర్థము మరచిపోతిమి
       భరత సుతుడా మేలుకో!

191.దేవుడిచ్చిన వరము కనుటను
       విషయమతివలు మరచిపోయిరి
       కనుట స్త్రీలకు చిన్నతనమట
      భరత సుతుడా మేలుకో!

192.మగకు మగకూ ఆడకాడకు
       పెండ్లిచట్టము వచ్చుచున్నది
       జంతువింతకు జారకున్నది
       భరత సుతుడా మేలుకో!

193.స్త్రీలు పురుషులు రూపభేదమె
       ఆత్మ రెండిటియందు ఒక్కటె
       ప్రేమ దేవుని పథకమెఱుగుము
      భరత సుతుడా మేలుకో!

194.మానమెఱుగని రీతి ఒడలును
       తారలెందరొ జూపుచుండగ
       మానవతులకు మానభంగము
       భరత సుతుడా మేలుకో!

195.పడక గదియో వెండితెరయో
       తేడా తెలియక పోవుచున్నది
       యువత రాక్షస క్రీడ మొదలిడె
       భరత సుతుడా మేలుకో!

196.ఆడతనమును విప్పి చెప్పెడు
       బట్టకట్టెడు అతివ పురుషుని
       లోని మృగమును తట్టిలేపును
       భరత సుతుడా మేలుకో!

197.వెన్నుపూసలు దెబ్బతీసెడు
       ఎత్తుమడమల కాలిజోళ్ళను
       అతివలెందుకొ ఇష్టపడుదురు
       భరత సుతుడా మేలుకో!

198.ఆడదంటే అంగవిభవమె
       అన్నభావన ప్రబలిపోయెను
       అబల రక్షణ పురుష ధర్మము
      భరత సుతుడా మేలుకో!

199.మానవత్వము మంట గలువగ
       మనిషి మృగముగ మారిపోయెను
       మృగము సిగ్గుతొ చావనున్నది
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 
 

కామెంట్‌లు లేవు: