...

...

5, జనవరి 2011, బుధవారం

భరత సుతుడా మేలుకో! -19

180.పాత పొత్తము మనము చదువము
       చదువు వానిని మూర్ఖుడందుము
       మూర్ఖుడెవడో తెలుసుకొనుటకు
       భరత సుతుడా మేలుకో!

181.బ్రతుకు తెరువే చదువు అయినది
       పొట్టపోతయె తెలివి అయినది
       జంతుధర్మమ్మనగనిదియే
       భరత సుతుడా మేలుకో!

182.మార్కులొక్కటి ర్యాంకులొక్కటి
       మాత్రమే మరి చదువు అనియెడు
       కొండ చిలువల బడిని చంపగ
       భరత సుతుడా మేలుకో!

183.ప్రశ్నాపత్రములమ్ముకొని యెడు
      నీచునైనను టీచరందురు
      నిప్పు చెదలకు లొంగిపోయెను
      భరత సుతుడా మేలుకో!

184.చదువ జాలక బ్రతుక జాలక
       అపజయమ్మును చవిచూడజాలక
       చచ్చువారల కాచుకొరకని
       భరత సుతుడా మేలుకో!

185.విద్యగఱపెడు అయ్యవారల
       ఉచ్చనీచములెఱుగకుండిన
       జాతి మొత్తము భ్రష్టుపట్టును
       భరత సుతుడా మేలుకో!

186.మనసు ఎరుగని వెర్రివానికి
       పేరు చివరన పెక్కు డిగ్రీల్
       మేలుపుత్తడి తొడుగు శవమునకు
       భరత సుతుడా మేలుకో!

187.మెదడు వానిది వానగుంటయె
       మనసు మొత్తము మురికి కూపము
       జాతిహితముకు ఉపన్యాసము
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి