...

...

6, జూన్ 2010, ఆదివారం

పుస్తక సమీక్ష -17 ద్రౌపది - తెలుగింటి ఆడపడుచు

[పుస్తకం పేరు: మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది, రచన: డాII ఎం.వి.రమణారెడ్డి, వెల: రూ.100/-, ప్రతులకు: డాII ఎం.వి.రమణారెడ్డి, రాయవరం, ఖాదరాబాదు (పోస్టు), ప్రొద్దుటూరు - 516362 కడప జిల్లా ఫోన్. నెం. 08564 - 251133 ]


కవిత్రయం మనకందించిన మహాభారతం ప్రతి తెలుగువాడి మనసును విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎంతగా అంటే ఈ భారత కథ మన తెలుగుదేశం నడిబొడ్డులో జరిగిందనే భ్రమను కలిగించేటంతగా. సంస్కృత మూలంనుండి సారాంశాన్ని గ్రహించి రకరకాల మార్పులు చేర్పులతో మన తెలుగు వాతావరణానికి అనుకూలంగా కవిత్రయం అనువదించిన ఆంధ్ర మహాబారతాన్ని ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త కావ్యం చదివినట్టే వుంటుంది. 

డాII రమణారెడ్డిగారు భారతంలోని ద్రౌపది పాత్రను కవిత్రయం తెలుగుదనం మూర్తీభవించిన విధంగా చిత్రించిన వైనాన్ని విశ్లేషిస్తూ రాసిన పుస్తకమిది. నన్నయ, తిక్కన, ఎర్రనల అనువాదంలో ఉన్న తేడాలను, వారి అభిరుచులను, వారి ప్రణాళికలను, వారి ప్రాధాన్యతలను, వారి సంకల్పాలను రమణారెడ్డిగారు ఈ పుస్తకంలో చక్కగా విడమర్చి చూపిస్తున్నారు. నన్నయ దృష్టి పాత్రల రూపకల్పన కంటే వైదిక ధర్మ ప్రచారాల మీద ఎక్కువ వుండటం వల్ల ఈయన సృష్టించిన పాత్రల లక్షణాలు సంస్కృత భారతంలోని పాత్రలకు భిన్నంగా కనిపించవని రచయిత అభిప్రాయ పడుతున్నారు. అయితే తిక్కన అభిమతం రచనలో తెలుగుదనం చొప్పించడం. "తెలుగు మాటలు ఉపయోగించినంత మాత్రాన తెలుగుదనం సమకూరదు. కూర్పుకు తెలుగు ’నుడికారం’ జతపడాలి; పాత్రలకు తెలుగు నడవడిక నేర్పించాలి. అందుకు తిక్కన ఎన్నుకున్నవి స్త్రీ పాత్రలు. కథానాయిక అయినందున ద్రౌపది ఆయన ప్రయత్నానికి తగిన ముడిసరుకు. తిక్కన ద్వారా జరిగిన సాంస్కృతిక సమ్మేళనము కారణంగా, ప్రతి తెలుగు మనసు భారతాన్ని సొంతం చేసుకుంది. అదేదో తన ఇంటిపట్టున జరిగిన కథగా భావించింది. ఎక్కడో యమునానది తీరంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామాన్ని పెన్నానది తిన్నెలమీద జరిగినంత దగ్గరికి తీసుకొచ్చిన ప్రతిభ తిక్కన బ్రహ్మది." "ఎర్రాప్రగడ తన సొంత అభిప్రాయాలను పక్కకునెట్టి నన్నయ శైలిలోనే భారతాన్ని సంపూర్ణం చేయాలని ప్రయత్నించినా తిక్కన ప్రభావం నుండి తప్పించుకోవడం ఆయనకు సాధ్యం కాలేదని హావభావ ప్రకటనల్లో ఎర్రన పాత్రలు అనుసరించే విధానమే చాటుతుంది" అని తీర్మానిస్తున్నారు.

            తిక్కన, నన్నయ అనువాద రీతుల్లో గల తేడాను పరిశీలిస్తూ రచయిత తిక్కన వైపే మొగ్గు చూపిస్తున్నారు. "ఇతర విషయాల్లో ఎన్నోచోట్ల మూలాన్ని వదిలేసి స్వతంత్రించిన నన్నయ స్త్రీపాత్రల చిత్రీకరణలో మాత్రం వ్యాసుని పంథానే అనుసరించాడు. అందుకే అరణ్యపర్వంలో ద్రౌపది ధర్మరాజుతో జరిపిన సంవాదంలో స్త్రీపాత్రకు సంక్రమించిన స్వేచ్ఛ ప్రతిబింబించినా గడుసుదనం కొరవడింది" అని అభిప్రాయపడుతూ, "భావాన్ని ప్రకటించే తీరులో నన్నయ ద్రౌపది కేవలం ఒక హరికథకురాలిగా కనిపిస్తుంది" అంటారు. అదే విరాటపర్వంలో కీచకుడు అవమానించిన రాత్రి భీమసేనునితో సంభాషించిన సందర్భంలో "...ఇక్కడ కూడా ద్రౌపదికి కష్టం కలిగింది; ఆ కష్టాన్ని రోదిస్తూనే తన భర్తతో చెబుతూ వుంది; ఇప్పుడు కూడా భర్తను ఒక కర్తవ్యానికి ప్రేరేపించడమే ఆమె ధ్యేయం. ఐనా, ఉద్రేకాన్ని వెళ్ళగక్కేతీరులో, ఆడ హరిదాసులా కాకుండా అచ్చం తెలుగింటి ఆడబిడ్డలా కనిపిస్తుంది తిక్కన ద్రౌపది" అని నిర్ధారణకు వస్తున్నారు. "తెలుగు భాషకు నన్నయ కావ్యగౌరవం కలిగించగా, తిక్కన దానికి సాహిత్య సామర్థ్యాన్ని ప్రసాదించాడు" అనేది రమణారెడ్డిగారి గట్టి నమ్మకం.

           ఇక ద్రౌపది పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ పుస్తకాన్ని వ్రాసినా మొత్తం మహాభారత కావ్యాన్ని రచయిత తమదైన పంథాలో విశ్లేషిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆయా పాత్రలు ప్రవర్తించేతీరు, పలికేపలుకులు ఆవిధంగానే ప్రవర్తించడానికి లేదా పలకడానికి వెనుక ఉన్న కారణాలను రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర మహాభారతంలో విస్తృతమైన రాజకీయ భూమిక వుండటం ఈ రచయిత కూడా రాజకీయవేత్త కావడం వల్ల పాఠకులకు భారతాన్ని ఒక కొత్తకోణంలో  పరిచయం కలిగిస్తున్నది ఈ పుస్తకం.

           ఇటీవలి కాలంలో ద్రౌపది పాత్రపై జరిగిన రచ్చ నేపథ్యంలో ఈ తెలుగు ద్రౌపదిని శీలపరీక్షకు పాఠకుల ముందు నిలబెట్టనందుకు రచయితను అభినందించాలి. 
                                          

కామెంట్‌లు లేవు: