...

...

24, జూన్ 2010, గురువారం

రిపోర్ట్

23-6-2010 బుధవారం సాయంత్రం ఏ.ఎస్.రావు నగర్, హైదరాబాద్‌లో  కోకిలమ్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు గారి కొత్త కవితా సంపుటి ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల ఆవిష్కరణ సభ జరిగింది. కథాఋషి శ్రీ మునిపల్లె రాజు అధ్యక్షతన ఏర్పాటైన ఈ సభకు మరో కథారచయిత  శ్రీ విహారి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదట వేదికపై ఉన్న ప్రముఖులను శ్రీ పులిగడ్డ విశ్వనాథరావు సభికులకు పరిచయం చేశారు. తరువాత సభ ఇటీవల మరణించిన కవి వేటూరి సుందరరామమూర్తికి నివాళిగా రెండు నిముషాలు మౌనం పాటించింది. సభాధ్యక్షులు శ్రీ మునిపల్లె రాజు మాట్లాడుతూ కవి అనేవాడు మానవజీవితంలోని సంక్లిష్టమైన భయాందోళనలను దూరం చేయగలగాలని, కవి స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట కూడా అని అన్నారు. డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు వంటివారికి ప్రభుత్వ సంస్థలనుండి, విశ్వవిద్యాలయాలనుండి రావలిన గుర్తింపు, లభించవలసిన గౌరవం దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ విహారి పుస్తకాన్ని ఆవిష్కరించి డాక్టర్ అద్దేపల్లితో తన సాన్నిహిత్యాన్ని వివరిస్తూ మచిలీపట్నం విశేషాలను జ్ఞాపకం చేసుకున్నారు. అద్దేపల్లి కవిత్వంలో అనేక కవితా లక్షణాలున్నా అక్కడక్కడ అవసరం అనుకున్న చోట సూటిగా చెప్పేతత్వం ఉందని అవి పాఠకుని హృదయాన్ని తాకి వెంటాడుతూ వుంటుందని అన్నారు. సాధారణంగా కవితా సంపుటులకు పొడుగైన పేరు ఉండదని ఈ పుస్తకం పేరు పెట్టడం నుండే ఈ పుస్తకం ప్రత్యేకత మొదలౌతున్నదని అన్నారు. ఈ కవితాసంపుటిని శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమీక్షించారు. అద్దేపల్లి కవిత్వంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందనీ, వారు ఏ విషయంపై కవిత్వం వ్రాసినా చివరకు అందులో పీడిత వర్గాల ప్రస్తావన వచ్చి తీరుతుందని శ్రీ కొండ్రెడ్డి వివరించారు. తరువాత శ్రీ తంగిరాల చక్రవర్తి ఈ పుస్తకంపై, అద్దేపల్లి కవిత్వంపై తమదైన రీతిలో ప్రసంగించారు. ఈ పుస్తకంలోని కవితలన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని అన్ని భాషల్లోకి అనువాదం కావలసిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు తమ స్పందనను తెలియజేస్తూ తాను కవిమాత్రమే కాక విమర్శకుడు కూడా కావడం వల్ల తనకు అన్ని రాజకీయ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్నదని దానివల్లే గత 20 సంవత్సరాలుగా మనదేశంలో జరుగుతున్న సాంస్కృతిక దాడిని ముందునుంచే గుర్తించి తన కవిత్వాన్ని ఈ పోకడలకు వ్యతిరేకంగా వినిపిస్తున్నానని అన్నారు. తాను చిన్నప్పుడు చదువుకున్న విశ్వనాథ వారి నవల వేయిపడగలు తనపై కొంత ప్రభావాన్ని చూపిందన్నారు. ప్రస్తుతం యువకులనుండి మంచి మంచి కవిత్వం వస్తున్నదనీ, కానీ విమర్శ విషయంలో లోటు కనిపిస్తున్నదనీ దానిని భర్తీ చేయవలసిన బాధ్యత నేటి యువ సాహితీవేత్తలపై ఉందని అన్నారు. అద్దేపల్లి అభిమానులూ, శిష్యులూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభ ప్రారంభానికి ముందు కవితా పఠనం కూడా జరిగింది. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు డాక్టర్ అద్దేపల్లి బాల్యంపై వ్రాసిన గజల్‌ను పాడి వినిపించారు.  చివరగా శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.            

కామెంట్‌లు లేవు: