...

...

11, మార్చి 2011, శుక్రవారం

నేను సైతం!

ఒకటే పేరుతో ఈ రెండు కథలు కనిపించగానే కొంత ఉత్సుకత కలిగింది. దాదాపుగా ఒకే ఇతివృత్తాన్ని ఆధారంగా  చేసుకుని రాసినవి అని తెలిశాక ఉత్సుకత మరింత ఉత్సాహంగా మారింది. రెండూ ఇంచుమించు ఒకే సమస్యని ప్రతిబింబిస్తున్నాయి, ఒకటే పేరు కలిగి ఉన్నాయి కనక ఒకేచోట విశ్లేషిస్తే? అన్న ఆలోచన వచ్చింది. ఐతే ‘తురుపుముక్క ‘ గారి నిబంధన కొంత వెనక్కు తీసింది. అయినా సరే నాకెందుకో ఇది ఇలా రాస్తేనే బాగుంటుంది అని గట్టిగా అనిపించడంతో నా మౌస్ తీసుకుని ముందుకే కదిలాను ‘నేను సైతం’ అనుకుంటూ. శ్రీ పంజాల జగన్నాథం, శ్రీ డీ.కే. చదువులబాబు గార్లచే రాయబడ్డాయి ఈ రెండు కథలూ. పిల్లలని ఎంతో ప్రేమతో, ఆప్యాయతలతో, కొండంత ఆశలతో పెంచడం తరవాత వారి నిరాదరణకు గురి కావడం, ముఖ్యపాత్రలు అపార్ధం చేసుకున్న ఇతర పాత్రల ఉదాత్తమైన ఆశయసాధన లో తామూ భాగంగా మారడం మూల కథగా రెండింటిలోనూ కనిపిస్తుంది. తమ్ముడి బిడ్డలని సొంత బిడ్డలుగా సాకి, తన పెద్దవయసులో వారి తిరస్కారానికీ, నిరాదణలకీ గురి అయిన రాం నర్సయ్య కథ జగన్నాథం గారు రాసిన ‘నేను సైతం’. తమ్ముడూ, మరదలూ మందలించబోయినా వినని పిల్లలని చూసి విరక్తి చెందిన అతను తన గతాన్నీ, అందులో అర్ధం లేని అనుమానంతో, ఆవేశంతో తను దూరం చేసుకున్న భార్యనీ గుర్తుకు తెచ్చుకుని కలత చెందుతాడు. తరవాత తన జీవితంలో ఆమె లేక కలిగిన అగాధమంత లోటుని గుర్తించి తనని కలవాలని భద్రాచలం చేరతాడు అతను. అక్కడ మానవతకీ,అలుపెరగని సేవకీ నిదర్శనంగా నిలచిన తన భార్యనీ, ఆమెకి అన్నివిధాలా తోడుగా ఉన్న తన ప్రతిరూపాన్నీ చూసి ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు. తన వెంట తెచ్చుకున్న జి.పి.ఎఫ్, గ్రాట్యూటీ లాంటి వన్నీ ఇచ్చి ‘ నేను సైతం ‘ అనిపించుకుంటాడు. కథా, కథనమూ బావున్న ఈ కథ తెలంగాణా మాండలీకంలో రాసినట్టుగా కనిపిస్తుంది. రాం నర్సయ్య భార్యని వదిలేసి రావడానికి కారణాలు మరింత బలంగా చూపించి ఉంటే బావుండుననిపించింది నాకు. ముగింపు మాత్రం ‘ అన్నిరోజుల తర్వాత కలిసాడు కదా అని భర్త కాళ్ళమీద పడిపోవడమూ, నన్ను క్షమించండి లాంటి రొటీన్ డైలాగులు ‘ లేకుండా సహజంగానూ, ఉన్నతంగానూ ఉంది. ఇక ఇదే పేరుతో రాసిన చదువులబాబు గారి కధ కూడా ఒక పెద్దాయన పరంగా రాయబడింది. ఉత్తమపురుషలో చెప్పిన ఈ కథ కూడా కొడుకునెంతో ప్రేమించి, కళ్ళల్లో పెట్టుకుని పెంచి తరవాత ఆ కొడుకూ, కొడళ్ళ నిర్లక్ష్యానికీ, తిరస్కారానికీ గురి అవుతూ ఉండే అతని కథ. మనసులో కొండంత ఆవేదనతో, అశాంతితో బాధపడుతూ ఉంటాడు అతను. అయినా కూడా ఎప్పుడూ ఇల్లు పట్టకుండా ఆవారాగా తిరిగే ( అతని అభిప్రాయంలో) తిరిగే ఎదురింటి కొడుకుని చూస్తూ, అతనితో తన కొడుకుని పోల్చి చూసుకుని సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తనని వృద్ధాశ్రమంలో చేర్పించాలని కొడుకు ఏకపక్షనిర్ణయం తీసుకున్నప్పుడు కలత చెందిన మనసుతో తనంత తానుగా ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అక్కడ ఆ అనాథల ఆశ్రమాన్ని నడుపుతున్నది తను రోజూ బాధ్యత లేనివాడుగా చిరాకు పడే ఎదురింటి కుర్రాడేనని తెలిసాకా, తనతో తెచ్చుకున్న దస్తావేజులూ, పట్టాలూ ఆ అబ్బాయి అనంత్ నడిపే ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి ఈ ప్రయత్నానికి ‘ నేను సైతం’ అని సంతృప్తి చెందటంతో కథ ముగుస్తుంది. ఈ కథ కూడా బాగా రాసారు. కొన్నిచోట్ల ఎదురింటి అబ్బాయిని బలవంతంగా చెడ్డవాడుగా ( చివరిలో అసలు నిజం తెలియడానికి ముందు వరకూ) చూపించే ప్రయత్నం జరిగినట్టు అనిపించింది. తన ఇంటిలో జరిగే పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన అలా అనుకుని ఉండవచ్చేమో మరి. అతని గురించి ఏమీ తెలియకుండానే తన కొడుకుతో పోల్చి తన కొడుకు మంచివాడు అని అనుకోవాలని చూడడం కూడా అతని మనస్థితినే ప్రతిబింబిస్తోంది అనుకోవాలి. అందుకే అతను తను ఆశ్రమంలో చేరడానికి వెళుతూ కూడా అనంత్ నీ, అతని నిర్లక్ష్యాన్నీ చూసి అతని తల్లి గురించి జాలి పడతాడు, ఇలాంటి కొడుకున్నందుకు ఆమె ఒకనాడు ఆశ్రమంలో చేరాల్సి వస్తుంది అని. ఇది నిజమైన మానవ నైజం అనిపించింది నాకు. ఒకేపేరుతో రాయడమే కాక ఒకే రకమైన కథతో రాసిన ఈ రెండు కథలూ ఇంచుమించు ఒకేరకంగా సాగడమూ, ఒకే రకమైన ముగింపులతో ముగియడమూ ‘కాకతాళీయమే’ అయినా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కథాజగత్ లో కూడా ఇంచుమించు పక్కపక్కనే ఉండడం ( మధ్యలో మూడు కథల తేడాతో). కూడా చిత్రమే. ఈ రెండు కథలూ చదివినప్పుడూ, విశ్లేషించినప్పుడూ కూడా ఒక స్తితిలో నాకు ఒక్క కథే  చదివిన అనుభూతి కలిగింది. అదే ఇలా ఒకే విశ్లేషణ రాయడానికి ప్రేరణ.
ఈ కథల లింకులు: 1. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam---panjala-jagannatham

2. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nenu-saitam--di-ke-caduvulababu


(సౌజన్యం : మనసు పలికే)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి