...

...

5, మార్చి 2011, శనివారం

నన్ను ఆకట్టుకొన్న కథ ధనలక్ష్మి!


ధనలక్ష్మి కథ జీవితంలో నెగ్గుకు వచ్చే ఓ ఆడపడుచు కథ. ధనలక్ష్మి పాత్రలో చదువరి జీవితంపైన అపారమైన నమ్మకాన్ని, ఉత్సాహాన్ని చూస్తాడు. ఓటమిని అంగీకరించని పట్టుదలని చూస్తాడు. గెలుపుకై ఆమె శ్రమిస్తుంది. తన చుట్టూ ఉన్నవాళ్ళను కలుపుకు పోతుంది. తెలివి, చలాకీతనం, స్నేహభావం  ప్రతిబింబించేలా రచయిత ఆమె పాత్రని అద్భుతంగా మలచారు.

ఇతర పాత్రలు అన్నీ చక్కగా మలచబడి ధనలక్ష్మి వక్తిత్వాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. రామాంజనేయులు ధనలక్ష్మి భర్త. ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందనేది రామాంజనేయులు విషయంలో అక్షర సత్యం. ధనలక్ష్మి రామాంజనేయులుని ఎక్కడా తక్కువచేయకపోగా, తను వోడినట్లు నటించి తన ఆలోచనలను అతని నిర్ణయాలుగా మలచి , అతని సంపూర్ణ సహకారంతోనే అనుకొన్నవి సాధిస్తుంది. జయజయధ్వానాలు రామాంజనేయులకే. గెలుపు ధనలక్ష్మిదే.

మరొక సమర్థవంతమైన ప్రయోగం రచయిత కథలో ఒక పాత్ర కావడమే. ఇది పాఠకులకు కథ పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. కథ జీవవంతమౌతుంది. రామాంజనేయులు మాష్టారు, రచయిత భార్య లాంటి చిన్న పాత్రలు కూడా కథకు చక్కటి ఊతాన్నిచ్చాయి. 

కథ నడిచే రంగస్థలాన్ని రచయిత నమ్మదగ్గ విధంగా తయారు చేశారు. తాలుకా హెడ్‌క్వార్టర్ అనదగిన ఒక మోస్తరు ఊరు ఈ కథకు రంగస్థలం. అందులో జీవితాలని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఉదాహరణకి రచయిత తండ్రి గారి గుమాస్తాగిరి మించి ఆలోచించలేని మధ్య తరగతి మనస్తత్వం, శుభలేఖల్లో చి.సౌ.శకుంతల - బ్రాకెట్‌లో బి.ఎ.అని ఏ ముహూర్తాన అచ్చు వేశారో, ఆ బ్రాకెట్లు విడకపోగా "...మనమేం ఈ మహానగరంలో ఊళ్ళేలాలా ఉపన్యాసాలివ్వాలా" అని సాగదీస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా సెటిలై పోయేరచయిత భార్య వీరంతా పాఠకుణ్ణి కథలో ఇన్వాల్వ్ చేస్తారు. 

కథ చెప్పిన తీరు ప్రతి వాక్యాన్ని చదివించేలా ఉన్నది. తెలుగుతనం ఉట్టిపడుతోంది. మాండలీకాలను సమర్థవంతంగా ఉపయోగించి చదువరులను కథా వాతావరణంలోకి లాక్కువెళ్ళారు. ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూడండి. 'కానీ మూడోరోజున నాయుడుగారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేలు కొట్లోకి మారింది. రామాంజనేలు కాజా తిన్నాడు.' సున్నితమైన హాస్యం, చక్కటి పాత్రపోషణ ఈ కథకు జీవం పోశాయి. ఉపమానాలు, వర్ణన పాత్ర భావస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ వాక్యాన్ని చూడండి. 'అంతా విని అందర్నీ గమనిస్తున్న రామాంజనేలు మీసాలు మిరకాయలైనాయి. ముక్కుపుటాలెగిరి పడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పులిలా చూశాడు.' ముగింపు ధనలక్ష్మికి మల్లే చదువరికీ సంతృప్తిని ఇస్తుంది. ఇది అందరూ తప్పక చదివి ఆనందించదగిన కథ.

ఈ కథని కింది లింకులో చదవండి
.

-కె.ఫణిప్రసన్నకుమార్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి