...

...

2, మార్చి 2011, బుధవారం

సంస్కారం కథపై అను ఊసులు.

మానవ సంబంధాలు డబ్బుతోనూ, సమాజం పట్ల భయంతోనూ ఎలా ముడిపడి ఉన్నాయో చూపించిన...కాకాని చక్రపాణిగారు రాసిన 'సంస్కారం' కథ నాకు నచ్చింది. మొదటి వాక్యమే 'పోయాడు, పీడా పోయింది అని అనుకుని ఆమె స్వాంతన పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఏడవకపోతే, సమాజం ఆడిపోసుకుంటుంది.' మనం చాలానే పనులు సమాజానికి భయపడి చేస్తుంటాము కానీ ఇష్ట పడి చేయం అనే విషయాన్ని విశదపరుస్తుంది. హరినారాయణ కూతురు, కొడుకుల సంభాషణలు తండ్రి పోయాడన్న బాధ కన్నా ఇంటిని దక్కించుకోవాలన్న ఆత్రం - కూతురికి, తనకు రావలసిన డబ్బు దక్కించుకోవాలన్న ఆరాటం - కొడుకుకి ఉన్నట్లు తెలుపుతాయి. తమ పిల్లల భవిష్యత్తును తామె చేతులారా ప్రేమ పేరుతో ఎలా కాలరాస్తారో హరినారాయణ పాత్ర ద్వారా చూపించారు. కర్మకాండలు దగ్గరకు వచ్చేసరికి కూతురు ఎంత డబ్బు మనిషి అయినప్పటికీ, తమ్ముడు చేయననేసరికి, ఆచారాలు నిర్వహించకపోతే ఏమవుతుందో అనే భయం వల్ల కర్మకాండలు నిర్వహించటానికి అవసరమయిన డబ్బు ఇవ్వటానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ ధనవ్యమోహం కంటే భయమే డామినేట్ చేసింది. మానవ సంబంధాలలో డబ్బో భయమో... ఈ రెండూ ప్రాముఖ్యత వహించినంతగా, ఇంక ఏమీ లేవు అని రచయిత చాలా చక్కగా చెప్పారు.  ఈ కథలోని ఉదాత్తమైన పాత్ర భాగ్యలక్ష్మి మామగారిది. ఆ పాత్ర చేత జన్మతోనే ఎవరూ అస్పృశ్యులు కారు, బుద్ధి చేత తప్ప అని ఒక చోట అనిపిస్తారు. భాగ్యలక్ష్మి పాత్ర ఎప్పుడూ భర్త చేసే పనులకు బాధ పడటం తప్పించి ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచన చేసినట్లు కనిపించలేదు. ఎంతసేపూ భర్తను ఒక పీడగానే తలపోసింది. ఆర్థిక ఇబ్బందులనుంచి ఎలా బయట పడాలి అని కూడా ఆలోచించినట్లు కనపడదు. ఇదే విషయం తన మామ తనతో అన్నట్లు అనిపిస్తుంది. ("నువ్వు ఇతర్లను 'పీడ' అనుకుంటూ బతికావు. నీ మొగుడి చావుతో 'పీడ' పోయిందనుకున్నావు! నీ బతుకునుండీ ఎదగటానికి నువ్వేం ప్రయత్నించావమ్మా?" అని ఆయన ప్రశ్నించినట్లయి ఉలిక్కిపడింది భాగ్యలక్ష్మి.) అప్పుడు తన బతుకు తను ఇప్పటికయినా బతకటం మొదలెట్టాలి అని అనుకుంటుంది. కథకు ఇది చక్కటి ముగింపు. 

కథలోని ఈ క్రింది వాక్యాలు నాకు చాలా నచ్చాయి.


"ఇంక మిగిలింది ప్రేమా ఆప్యాయతలూ కాదు, కర్మకాండే! మంచీ, మర్యాదా, సంస్కారాలు లేవు. మిగిలిందల్లా అంతిమ సంస్కారం పట్ల నమ్మకం. అది జరక్కపోతే మనకేమన్నా పీడ పట్టుకుంటుందేమో నన్న భయమూ మిగిలింది"

"పీడ ఎక్కడో లేదు. మన ఆలోచనల్లోనే ఉంది. క్రియాశీలమైన ఆలోచనతో, ప్రవర్తనతో పీడ తొలగిపోతుంది."



ఈ కథను ఈ క్రింది లింక్‌లో చదవవచ్చు.


http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/sanskaram---kakani-cakrapani


-అను

(సౌజన్యం : ఊహలు - ఊసులు)  


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మురళీ మోహన్ గారు, నా అభిప్రాయాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు.