...

...

26, సెప్టెంబర్ 2011, సోమవారం

జ్యోతి ముచ్చట్లు!

అలనాటి పత్రికలు శీర్షికన కొన్ని పాత పత్రికల ముఖపత్రాలను మీతో పంచుకోవాలనుకున్నాను. అయితే పంతుల జోగారావు గారి సూచన మేరకు అప్పుడప్పుడు ఆయా పత్రికల గురించి నాకు తెలిసిన విశేషాలను మీతో పంచుకుంటాను. నేను చిన్నప్పుడు ఎక్కువగా అభిమానించిన పత్రిక జ్యోతి మాసపత్రిక. ఇది 1962 ఆ ప్రాంతాలలో విజయవాడనుండి వెలువడటం ప్రారంభించింది. వి.వి.రాఘవయ్యగారు ఈ పత్రికను నడిపేవారు. కొంతకాలానికి ఈ పత్రిక మద్రాసుకు తరలి పోయింది. వి.వి.రాఘవయ్య చనిపోయిన తర్వాత ఆయన శ్రీమతి లీలావతి రాఘవయ్య సుమారు 2 దశాబ్దాలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ పత్రికను నడిపారు. అందమైన ముఖచిత్రంతో వెలువడే ఈ పత్రిక ప్రతి నెలా ఒక నవలానుబంధం  ప్రచురించేది. ఈ పత్రిక ద్వారా లబ్ద ప్రతిష్టులైన ఎందరో రచయితల రచనలు వెలుగు చూశాయి. రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, కేతు విశ్వనాథ రెడ్డి, కోరుకొండ సత్యానంద్, లల్లాదేవి, మల్లాది వెంకటకృష్ణ మూర్తి, యండమూరి వీరేంద్ర నాథ్,  భమిడిపాటి రామగోపాలం, హితశ్రీ, మధురాంతకం రాజారాం, అవసరాల రామకృష్ణారావు, ఆదివిష్ణు, ఎన్.ఆర్.నంది, ద్వివేదుల విశాలాక్షి, దాశరథి, కె.రామలక్ష్మి,  నారాయణరెడ్డి, వరవరరావు మచ్చుకు కొన్నిపేర్లు. ఆ తర్వాత కొన్ని రోజులు హైదరాబాదు నుండి వెలువడేది.  ఈ పత్రికలో నాకు చాలా బాగా నచ్చిన శీర్షిక శ్రీశ్రీ నిర్వహించిన పదబంధ ప్రహేళిక. 1976 నుండి 1983 వరకూ ఈ శీర్షికను శ్రీశ్రీ చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. తర్వాత కొన్నాళ్ళు ఆరుద్ర గళ్ళనుడికట్టు పేరుతో ఈ పత్రికలోనే పజిల్‌ను నిర్వహించాడు. ఈ రెండు శీర్షికలూ అప్పట్లో పాఠకుల అభిమానాన్ని చూరగొంది. శ్రీశ్రీ పదబంధ ప్రహేళికను చూసి ఈర్ష్య పడి విమర్శించేవారు అప్పట్లో ఎక్కువ మందే ఉండేవారు. యామిజాల పద్మనాభస్వామి గారి విమర్శకు శ్రీశ్రీ ఘాటైన సమాధానమే చెప్పారు ఓ సంచికలో.

1990 ప్రాంతాల్లో (సరిగ్గా తెలియదు) ఈ పత్రిక మూతపడినట్టు గుర్తు. దాట్ల నారాయణమూర్తి రాజు కొన్నాళ్ళు సంపాదకుడిగా ఉన్నట్టు జ్ఞాపకం.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి