...

...

26, డిసెంబర్ 2010, ఆదివారం

భరత సుతుడా మేలుకో! -11

92.ప్రజాస్వామ్యమునందు ఏలిక
    మాతృస్థానము ఓటు ప్రక్రియ
    మాతృహత్యకు పూనె నేలిక
    భరత సుతుడా మేలుకో! 
             

              93.తండ్రి త్యాగము చేసి చచ్చెను
                   కాన కొడుకుకు ఏలు హక్కట
                   ప్రజాస్వామ్యము మరచినారము
                   భరత సుతుడా మేలుకో!

94.దేశమేలగ ఇచట పుట్టుట
    అంత ముఖ్యము కాదనందురు
    పరుల జెండా మోతువా మరి
    భరత సుతుడా మేలుకో!

                  95.భార్యతో సంసారమైనను
                      అధిష్టానము ఆజ్ఞమేరకె
                      బానిసలు నీ పాలకులు మరి
                     భరత సుతుడా మేలుకో!

96.నాయకుండన వెంట తిరిగెడు
     వెధవలందరి పనులు జేసెడు
     వాడు అనుకొను రోజులొచ్చెను
     భరత సుతుడా మేలుకో!

              97.నేరగాళ్ళకు జూదగాళ్ళకు
                   అన్ని పార్టీల్టిక్కెటులిచ్చును
                  వారలేలెడు దేశమా ఇది
                  భరత సుతుడా మేలుకో!

98.ఎవని పాటికి వాడె రాజై
     తన సమస్యను తీర్చుకొనునట
     కడుపు నిండగ నోరు వలదట
    భరత సుతుడా మేలుకో!

              99.బూతు మాటలె నీతి యనుచును
                  పలుకుచుండెడు పెద్దవారలు
                 ఉద్యమాలను నడుపుచుండిరి
                భరత సుతుడా మేలుకో!

100.కోట్లకొలదిగ ప్రజల ధనమును
       కొల్లగొట్టిన పాలకులకిక
       పదవి విడిచిన శిక్షయుండదు
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి