తీర్పునెరుగని వ్యాజ్యమున్నను
కోర్టులిచ్చట సిగ్గుపడవుగ
భరత సుతుడా మేలుకో!
146.నీవు గెలిచిన నేను ధర్నా
నేను గెలిచిన నీవు ధర్నా
కోర్టుతీర్పుకు విలువలేదిక
భరత సుతుడా మేలుకో!
147.న్యాయ మమ్మెడు దుకాణముగా
న్యాయస్థానము మారిపోవగ
న్యాయదేవత ఏడ్చుచున్నది
భరత సుతుడా మేలుకో!
148.నిరసనకు మరి త్యాగనిరతికి
ఆత్మహత్యయె గొప్ప స్ఫూర్తిగ
చెప్పువారల దునుము కొరకని
భరత సుతుడా మేలుకో!
149.శవమునడ్డము పెట్టి ధర్నాల్
చేయుచుందురు కోర్కె తీరగ
శవము సాధనమగుట పతనము
భరత సుతుడా మేలుకో!
150.'బి.టి.'విత్తుల కూరగాయలు
తినుచు జనులు చచ్చుచుండగ
జనము తగ్గుటకిదియె మేలట
భరత సుతుడా మేలుకో!
151.పొట్టపగులగ మెక్కి ఇంకను
పరులఁగాల్చుక తినుటె బ్రతుకను
భావమొదవెను దేశమందున
భరత సుతుడా మేలుకో!
152.ధర్మరాజును ధర్మదేవత
ధర్మయముడిట పుట్టియున్నను
ధర్మమెరుగని జాతియైనది
భరత సుతుడా మేలుకో!
153.కన్ను నడువదు కాలు చూడదు
అయిననూ అవి కలిసియున్నవి
ఒకరి క్షేమము నొకరు అరయగ
భరత సుతుడా మేలుకో!
154.మంచి మాటను ఆచరింపగ
గుండె దిటువును కూర్చుకొనవలె
నిచ్చజచ్చెడు పిరికివైతివి
భరత సుతుడా మేలుకో!
155.వారసులమై పుట్టినందుకు
కీర్తిశేషులు సిగ్గుపడియెడు
విధముగా మన బ్రతుకులున్నవి
భరత సుతుడా మేలుకో!
- వరిగొండ కాంతారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి