1.భరతమాతకు కనుల నెత్తుటి
చుక్కలెన్నియొ కారుచున్నవి
చూడజాలక వ్రాయుచుంటిని
భరత సుతుడా మేలుకో!
2. భరతదేశము ధ్వంసమైనది
తిరిగి ఇటుకలు పేర్చుకొనుచును
జాతిభవనము కట్టుకొందము
భరత సుతుడా మేలుకో!
3. దేవుడిచ్చిన మురుగుకాలువ
పేరు నదియను శాస్త్రజ్ఞానము
మనకు వలదని తెలుసుకొనుటకు
భరత సుతుడా మేలుకో!
4.తీర్థమందున స్నానమాడగ
సబ్బునూనెలు వలదు వలదని
మనదు పూర్వులు చెప్పినారలు
భరత సుతుడా మేలుకో!
5.నదులకడ్డముగానకట్టలు
కట్టి కాల్వలు తవ్వుకొనుటయె
నీటి వనరుల వాడకమ్మట
భరత సుతుడా మేలుకో!
6.కుంట చెరువులు పిల్ల కాల్వలు
చెరువు అలుగులో చెరువు నిండుట
నీరు దాచెడు పద్ధతిది గద
భరత సుతుడా మేలుకో!
7.వర్షమనగా నీటి చుక్కలు
నదిని చేరక మున్నె వానిని
వాడుకొనడము మరచిపోతిమి
భరత సుతుడా మేలుకో!
8.నీటి యుద్ధాల్జరుగ గలవని
ఊహసేయుటె గొప్పయందురు
నీటి వాడుక మేలు విధమును
భరత సుతుడా మేలుకో!
- వరిగొండ కాంతారావు
1 కామెంట్:
సంతోషం. శ్రీ వరిగొండ కాంతారావు గారిని వరంగల్ లో రెండు మూడు సాహితీ సదస్సులలో చూసాను. వ్యక్తిగత పరిచయం లేదు. వారి కవితలను మీ బ్లాగులో ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి