...

...

23, జులై 2010, శుక్రవారం

కవితాభిషేకం! - 18

సీ||   ఆరొక్క రాగాల ఆలాపనల్ రాతి
                 కంబాలఁ జెక్కిన ఖ్యాత నగరి
       ఏడొక్క దిగ్గజా లేడాది పొడగున
                భువన విజయమేగు భూష నగరి 
       మూరు రాయరగండ మూర్ధన్య రత్నమౌ
                వికటఁపు వీథుల విశ్రుత పురి
       ఏడు ప్రాకారము లేర్పడఁ గట్టిన
                ప్రాంచద్భవనముల ప్రాకట పురి 


ఆ.వె||  ఎలమి మాధవుడిల యేర్పడఁ జూపిన,
         శశకములల చెలఁగి సారమేయ
         ములనుఁ దరిమి కొట్టు నేలఁ వెలసినట్టి
         అలఁరు కృష్ణరాయు హంపి నగరి.ఉ||    కాసుల పేరులెన్నిటినొ - గాదిలిఁ గూర్చియు శ్రీనివాసుకున్,
        దోసిలి నొగ్గి నో సుమవ - ధూటిని విష్ణువు కిచ్చినాడవో,
        భాసురమొప్ప హంపినల - ప్రాణములిచ్చితో రాలకున్, ధరా
        భాసిత భూవరా! జ్వలిత - భాస్కర శోభిత కీర్తి నీదయా!

చం||   స్తుతమతి యైన ఆంధ్రకవి - ధూర్జటి పల్కుల కేలగల్గెనో
        అతులిత మాధురీ మహిమ! - హంపి విరాజిత, రాజరాజుకున్
        ప్రతిపదమైనయట్టి మహ - రాజగు శ్రీనిధి కృష్ణరాయనిన్
        అతిశయ ప్రాపువంబొ?కవి - హంసల తోడగు కావ్యగోష్టులో?


                                                       రవి
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి