...

...

5, జులై 2010, సోమవారం

కవితాభిషేకం ! -1


సీ. తొలఁగె ధూమకేతుక్షోభ జనులకు, 
          నతి వృష్టి దోష భయంబు వాసెఁ
    గంటకాగమ భీతి గడచె నుద్ధత భూమి,
          భృత్కటకంబెల్ల నెత్తు వడియె
    మాసె నఘస్ఫూర్తి మరుభూములందును
          నెల మూఁడు వానలు నిండఁ గురిసె
    నాబాలగోపాల మఖిల సద్వ్రజమును,
          నానందమున మన్కి నతిశయిల్లెఁ

తే.గీ. బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ
       జారుసత్త్వాఢ్యుఁడీశ్వర నారసింహ
       భూవిభుని కృష్ణరాయఁ డభ్యుదయ మొంది
       పెంపు మీఱంగ ధాత్రిఁ బాలింపుచుండ.

మ. అలపోత్రిప్రభు దంష్ట్ర, భోగివరభోగాగ్రాళిఱా, లుద్భటా 
     చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్ రాయఁగా నైన మొ
    క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణ రా
    యల బహామృగనాభి సంకుమద సాంద్రాలేప పంకంబునన్.

ఉ. క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తిఁ బొ
   ల్పారు మిడుంగుఱుంబురువు లంచు వెసన్ గొనిపోయిపొంత శృం
   గారవనద్రుమాళి గిజిగాఁడులు గూఁడులఁ జేర్చు దీపికల్
   గారహిఁ గృష్ణరాయమహికాంతుని శాత్రపట్టణంబులన్

సీ. తొలుదొల్త నుదయాద్రి శిలఁదాకి తీండ్రించు, 
                నసిలోహమున వెచ్చనై జనించె,
    మరి కొండవీడెక్కి మార్కొని నలియైన,
                యల కసవాపాత్రు నంటి రాఁజె,
    నట సాఁగి జమ్మిలోయఁ బడి వేఁగి దహించెఁ
                గోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
    గనకగిరి స్ఫూర్తిఁ గరఁచె గౌతమిఁ గ్రాఁచె 
                నవుల నా పొట్నూర్ రవులుకొనియె,

తే.  మాడెములు ప్రేల్చె, నొడ్డాది మసి యొనర్చెఁ,
     గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱవఁ
     దోఁకచిచ్చన నౌర యుద్ధరతఁ గృష్ణ
     రాయబాహు ప్రతాప జాగ్రన్మహాగ్ని.  
                                     - అల్లసాని పెద్దన 
(ఈ శీర్షికలో రోజూ రాయల ప్రశస్తిని తెలియజేసే వివిధ కవులు పలు సందర్భాలలో చెప్పిన పద్యాలను చదవండి)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి