మ. నరసాధీశ్వరు కృష్ణరాయ జగతీనాథా! భవత్కీర్తిన్
సురకల్లోలిని వీఁగి భర్గుని జటాజూటంబు ప్రాపించె నా
హరుఁడవ్వాహిని వార్ధిముంచుట భయస్వాంతాంగుఁడై పూనెనౌ
గరిచర్మంబు, కపాలమున్, భసితమున్, ఖట్వాంగమున్, శూలమున్.
సీ. అమిత ప్రతాప బాలార్క విస్ఫూర్తిచే
నదన గోల్పడియె నయ్యుదయ శిఖరి
భేరీ ధణంధణా ఘోరనాదములచే
వినుకొండ దుర్గంబు విఱిగిపడియె
వాహినీ సవుతాబు వాహాముఖంబు రా
లక్కయై కరఁగె బెల్లంబుకొండ
క్రూర రాహుత ఖడ్గకులిశ ధారలచేతఁ
గొలసి బెట్రువగట్టెఁ గొండవీడు
గీ. కూలె బెజవాడ కంపించెఁ గొండపల్లి
పగిలెఁ గటకంబు గగ్గోలు వడియె ఢిల్లి
యేకధాటిగ నీవు దండెత్తినపుడు
కీర్తితోపాయ ధౌరేయ! కృష్ణరాయ!
సీ. జంభారిగంభీర రంభాకుచస్తంభ
సంభోగ గరిమ నీ సమర మహిమ
చింతామణిక్రాంత సంతాన నిశ్రాంత
శాంతికరంబు నీ సత్యకీర్తి
ధాటీ సమారంభ భేటీ రణభేరు
భేరీరవంబు నీ భీమగరిమ
చండోగ్రదండమై ఖండించు రిపునసి
ఖండించి వైచు నీఖడ్గధార
గీ. చంద్రచందన మందార చారు రుచిర
కుటిల గోక్షీర సురరాజ కుంతనముల
నవఘళించు నీకీర్తి యఖిలదిశల
కీర్తి రాధేయ! నరసింహకృష్ణరాయ!
- చాటువులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి