...

...

27, జులై 2010, మంగళవారం

కథాజగత్ కథావిశ్లేషణ పోటీ ఫలితాలు!


ఇంతవరకూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న పోటీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పోటీకి ముందు ముగ్గురు నిష్ణాతులైన న్యాయనిర్ణేతలను పెడదామనుకొన్నాము. అయితే పోటీకి వచ్చిన ఎంట్రీలు కేవలం 17 మాత్రమే కావడంతో ఒక్కరు మాత్రం న్యాయనిర్ణేతగా ఉంటే చాలనుకున్నాము. మా అభ్యర్థనను మన్నించి న్యాయనిర్ణేతగా ఉండటానికి అంగీకరించిన డా.దేవరాజు మహారాజుగారికి మా కృతజ్ఞతలు. వారు ఎంతో బిజీగా ఉండికూడా ఈ పోటీ తీర్పును వెలువరించడంలో సమయాన్ని వెచ్చించినందుకు వారికి మా ధన్యవాదాలు. ఇక ఈ పోటీ ఫలితాలు డా.దేవరాజు గారి మాటల్లోనే...  

తీర్పు 
  
తెలుగు కథానికా శతజయంతి సందర్భంగా 'తురుపుముక్క' నిర్వాహకులు కథాజగత్‌లో వంద కథలు ప్రకటించారు. ఆ వంద కథల మీద సమీక్షావ్యాసాల పోటీ నిర్వహించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా నిలిచిన సమీక్షల్ని మాత్రమే నిర్వాహకులు స్వీకరించి, రెండు దశలుగా వడబోసి, చివరగా నాకు పదిహేడు సమీక్షా వ్యాసాలు, ఆయా కథల ప్రతులు అందించారు. 
ఇక నేను చేసిన పని ఏమిటంటే...ముందుగా సమీక్షావ్యాసాలన్నీ చదివాను. ఆ సమీక్షలు కలిగించిన ఉత్సుకత ఆదారంగా ఆయా కథల్ని కూడా చదివాను.
కథలోని భావాన్ని, స్ఫూర్తిని, మానవీయ విలువల్ని, అంతర్జాతీయ అవగాహనని, ప్రాంతీయ ప్రత్యేకతల్ని అంది పుచ్చుకుని, రాసిన సమీక్షా వ్యాసాల్ని వేరు చేశాను. అప్పుడు ఎనిమిది వ్యాసాలు మిగిలాయి. 
స్వోత్కర్ష లేకుండా, కథా రచయితలమీద పిచ్చి అభిమానం ప్రకటించకుండా కేవలం విషయ ప్రధానంగా, లోతైన విశ్లేషణతో, తమదైన శైలిని, మంచి భాషని నిలుపుకున్న సమీక్షా వ్యాసాలు వేరు చేశాను.  
చివరగా - నేటి తరం పాఠకులకు అనువైన విధంగా స్నేహ పుర్వకంగా హెచ్చరిస్తూ, అత్యవసరంగా జాగ్రత్త వహించాల్సిన అంశాలను సమీక్షకులు ఎంత బలంగా ఎత్తి చూపారు అనే విషయమ్మీద దృష్టి కేంద్రీకరించి ఎన్నుకున్న వ్యాసాలను ఒక వరుస క్రమంలో పెట్టాను. అవి ఈ విధంగా వచ్చాయి. 
మొదటి స్థానం: సి. ఉమాదేవి - కొడిగట్టరాని చిరుదీపాలు: అంబికా అనంత్ కథ. 
రెండవస్థానం: చామర్తి మానస - తెరతీయగ రాదా: కోడూరి శ్రీరామమూర్తి కథ 
మూడవస్థానం: శ్రీలలిత - రంగుతోలు : నిడదవోలు మాలతి 
విజేతలకు అభినందనలు!  
ఎక్కువమంది మహిళలే బ్లాగులు నిర్వహిస్తున్న విషయం కూడా ఈ పోటీ వల్ల తేటతెల్లమయింది. 
- డాక్టర్ దేవరాజు మహారాజు
కవి, రచయిత, ప్రొఫెసర్ 
న్యాయ నిర్ణేత 
పోటీలో మొదటి బహుమతి(2116/-) పొందిన సి.ఉమాదేవి, రెండవ బహుమతి(1116/-) గెలిచిన చామర్తి మానస, మూడవ బహుమతి (516/-)నందుకొంటున్న శ్రీలలిత గారలకు తురుపుముక్క శుభాభినందనలు తెలియ జేస్తున్నది. వారు వెంటనే తమ వివరాలను (ఎవరి పేరు మీద చెక్ పంపాలి, చిరునామా, ఫోన్ నెంబరు, ఇ మెయిల్ అడ్రసు వగైరా) mmkodihalli@gmail.comకు పంపవలసినదిగా కోరుతున్నాము. విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసినవారు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి