...
16, జులై 2010, శుక్రవారం
కవితాభిషేకం! -12
కలిత సారస్వత కలశాబ్ధి వీచుల
నెలిమితోఁ జెలిమితో నీఁది యీఁది
ఘన మల్ల యుద్ధరంగస్థలోపరి మేటి
మల్లుర తోడుత మలసి మలసి
దండభోగాసంహతాది సర్వవ్యూహ
భిద్రహస్యంబులు వెదకివెదకి
రాజకీయరహస్యరాజితజ్ఞానంబు
విజ్ఞుల సంగతిఁ బెనిచి పెనిచి
యాత్మజనపాలనా సేవనానురోధ
సకల సాధన సామాగ్రి సంతరించి
రాజ్యపథగామి యగుఁ చుండె రాయలంత
ప్రజలు శ్రీకృష్ణుఁడని తన్నుఁ బ్రస్తుతింప.
క్షితి భర్తయుఁ గృతిభర్తయు
నతులిత కృతికర్త, వైరి హర్త, ప్రజాస
న్నుత వర్తియు, ధృతకీర్తియు
ధృత సంపన్మూర్తి కృష్ణదేవనృపతియే.
రాజా! వైభవజితధన
రాజా! తనుకాంతి విజితరాజా! విద్వ
ద్రాజా! ధృతజితభూభృ
ద్రాజా! రాహుత్తరాజ! రాజకరాజా!
తిరమౌ తావక దేశభక్త కలసద్విద్యా సుధారక్తికిన్
పరరాడ్భంజన శక్తికిన్, సకల దిగ్వ్యాప్తప్రధాసక్తికిన్
గురుసేవాస్థిరసక్తికిన్, బుధజనాకూత ప్రియప్రోక్తికిన్
చిరవాంఛాఫలసార భుక్తికి మదాశీర్వాద ముర్వీశ్వరా!
-అనంతపంతుల రామలింగస్వామి.
Labels:
royal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి