...

...

29, జులై 2010, గురువారం

బహుమతి పొందిన కథా విశ్లేషణలు!!!

తెలుగు బ్లాగర్లకు మేము నిర్వహించిన కథాజగత్ కథావిశ్లేషణ పోటీలో బహుమతి పొందిన విశ్లేషణలు ఇక్కడ చదవండి. కొడిగట్టరాని చిరుదీపాలు - రచన : అంబికా అనంత్ విశ్లేషణ : సి.ఉమాదేవి
కాంతిని ప్రజ్వరిల్లడం దీపలక్షణం.దీపం కొడిగట్టిందా, వెలుగు కాంతి విహీనమై దీపపు ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల కంటి పాపలు,వారింట వెలసిన చిరుదీపాలు. అమ్మా నాన్నల వెన్నెల వెలుగులు ఈ దీపాలు.మరి ఈ దీపాలు కొడిగట్టితే...? పర్యవసానం దారుణంగా ఉంటుంది. ఈ హెచ్చరిక నేపథ్యంగా చెప్పబడిన కథ అంబికా అనంత్ గారి కొడిగట్టరాని చిరుదీపాలు. కథా ప్రారంభంలోనే చెప్పినట్లు పెద్ద కంపెనీ డైరక్టర్ అయిన ఆనంద్,పేరు మోసిన గైనకాలజిస్టుగా డాక్టరు విమల దంపతులు ఆనందానికి చిరునామానే! వారి ఆనందంలో పాలుపంచుకుంటూ, మనవడితో ఆడుకుంటూ తన శేషజీవితాన్ని సంతోషంగా గడిపే ప్రకాశ రావు ఆనంద్ తండ్రి. కూతురి,అల్లుడి పని ఒత్తిడి,తీరికలేని దినచర్య అతడిని నిత్యము బాధిస్తూనే ఉంటుంది. ఇక వారి ఒక్కగానొక్క కొడుకు విజయ్ పదేళ్ల వయసు వాడే కాని ఆధునిక టెక్నాలజీలో తాతకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినవాడు. తల్లిదండ్రుల ఒడిలోకాక కంప్యూటర్ ఒడిలో సేదతీరడం నేర్చుకున్నవాడు. సమయాభావంవల్ల తమతో గడపలేని సమయాన్ని కంప్యూటర్ తో గడపమని తాము దగ్గరలేని లోటును అది భర్తీ చేస్తుందని అపోహపడ్డారు ఆనంద్,విమల. కాని మీటలునొక్కే చిన్నారిచేతులు పీకలునొక్కే స్థాయికి చేరగలవని ఊహించలేకపోయారు. కంప్యూటరును తమబిడ్డ ఎలా వినియోగిస్తున్నాడు? అందులో ఏ కార్యక్రమాలను వీక్షిస్తున్నాడు? ఆడే ఆటలేమిటి? స్నేహితుల దగ్గర కాపీ చేసుకునే సి.డిలు ఎలాంటివి? ఇవన్నీ పెద్దలు తెలుసుకోవాలి. పిల్లలు కంప్యూటర్ గూటిలో పొదిగే ఆలోచనలను పసికట్టలేకపోతే జరిగే అనర్థాలకు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమే కారణం. అందుకే ఆనంద శిబిరమైన ఇల్లు ప్రకాశరావు ఆకస్మిక మృతితో ఆనంద్,విమల జీవితంలో ఆనందపు పుట చిరిగి పోయింది. ప్రశాంతంగా సాగిపోయే జీవనంలో ప్రకాశరావు మరణం పోలీసులతోసహా అందరు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అతడిది సహజ మరణంకాదు. ఎవరో తలపై గట్టిగా మోదడంతో మరణం సంభవించినట్టుంది అని అందరికీ అర్థమవుతుంది. దొంగతనంకాలేదు. నగలు పోలేదు. అతడి మరణం ఒక మిస్టరీగా మారిపోతుంది. తాతపోయినప్పటినుండి విజయ్ కలత నిద్రే! తాత జ్ఞాపకాలతో కొడుకు బాధపడుతున్నా డనుకుంటుంది విమల. విమల తన సీనియర్ డాక్టర్ వర్మ దగ్గరకు కొడుకును తీసుకుని వెళ్తుంది. అతడు పిడియాట్రిక్ సైకియాట్రిస్ట్ రమేష్ తో కలిసి విజయ్ మానసిక స్థితిని పరీక్షిస్తాడు. పాఠకులలో ఆలోచనలను రేపి బాధ్యతలేని తల్లిదండ్రులు భుజాలు తడిమి చూసుకునేలా కథనమిక్కడ ఉద్వేగభరితంగా వుంది. రచయిత్రి రచనలో కథా పరిణితి పెరిగిన సందర్భమిదే. మనదేశం పూర్తిగా అమెరికాగా మారిపోయిందా అని భయం పొటమరిస్తుంది. కంప్యూటర్ లో చెస్ ఆడవచ్చుకదా అనే సలహా విజయ్ కు పాత చింతకాయ పచ్చడిలా తోచింది. అవన్నీ ఔట్ డేటెడ్ అంటాడు. షాడోవారియర్,బ్లడ్,కార్మెగెడ్డాన్ వంటి క్రూయల్ గేమ్స్ గురించి ఉద్వేగభరితంగా,ఉద్రేకపూరితంగా విజయ్ చెప్తున్నప్పుడు వర్మ అంతా గ్రహిస్తాడు. ఓడిపోతానేమోనన్న భయంతో, తానే గెలిచి తీరాలన్న పట్టుదలతో డాక్టరు రమేష్ గొంతు పట్టుకున్న విజయ్ లాంటి పిల్లలు తయారుకాకూడదు అనుకుంటే కుక్కలున్నాయి జాగ్రత్త అన్నచందాన,క్రూరమైన గేమ్ సి.డిలున్నాయి జాగ్రత్త అని కంప్యూటరుపై బోర్డు పెట్టాల్సివస్తుంది. వీడియో గేమ్స్,కంప్యూటర్ గేమ్స్ ఆడని చిన్నారులు లేరు. చాక్లెట్ల కోసం మారాము చేసే పిల్లలు నేడు గేమ్స్ సి.డిలకై మారాము చేయడం గమనార్హం. పిల్లల కేరింతలు విని మురిసిపోయేవారు ఆ కేరింతలు ఏ కారు క్రిందో మనిషిని తొక్కేస్తున్న సి.డి.గేమ్ తాలూకు వికటానందమేమో చూడండి. బుద్ధిబలానికి,మేధో వికాసానికి కంప్యూటరు వినియోగపడాలే కాని కేకలు,అరుపులు పిల్లల వీరత్వం అని భ్రమసే తల్లిదండ్రులూ బహు పరాక్! వీరత్వమనుకుని క్రూరత్వానికి బానిసలయితే దీపకాంతులతో వెలగవలసిన పసిజీవితాలు మలిగిపోతాయన్న నిజాన్ని ఉరుకులు పరుగుల మీదున్న నేటి పెద్దలు గ్రహించాలి. ఈ నిజాలను తన పదునైన కథనం ద్వారా హెచ్చరించిన అంబికా అనంత్ గారు అభినందనీయులు. మృత్యుభయాన్ని హరించి మృత్యుక్రీడలకు పసిపిల్లలు బలవుతున్నారు. నిప్పుల నృత్యాలు, పుర్రెల విందులు,యాక్సిడెంట్ల విన్యాసాలతో మృగయావినోదం పొందే చిన్నారుల మనసులు కలుషితమై పోతున్నాయి. కరుణ స్థానంలో కార్పణ్యానికి స్థావరమైన వారి ఆలోచనలు వినాశనానికి దారితీయకముందే పెద్దలు జాగ్రత్త పడాలని కాస్త ఘాటు దృశ్యపరంగానే చెప్పారు అంబికా అనంత్ గారు. అమెరికాలో తన సహాధ్యాయులను,టీచరును షూట్ చేసిన ఆన్ డ్రూ గోల్డెన్,మిల్ జాన్సన్ ల ప్రవర్తనకు ఇంచుమించు సరిధాటిగా ప్రవర్తించిన విజయ్ ప్రవర్తనకు ఎవరు బాధ్యులు? గేమ్ లో తన స్కోరును మించిపోతున్న తాత స్కోరును కట్టడి చేయాలంటే తాత జీవిత స్కోరునే నొక్కేసిన విజయ్ లాంటి పిల్లలు సమాజంలో తయారైతే మొత్తం సమాజమే రోగగ్రస్థమవుతుంది అని జాగ్రత్తలు సూచిస్తందీ కథ. శైలి,శిల్పంవంటి విషయాలనుకాక కథకు తీసుకున్న అంశం ముఖ్యపాత్ర పోషించడం ఈ కథను గొప్పకథల జాబితాలోకి చేరుస్తుంది. తెరతీయగరాదా - రచన : కోడూరి శ్రీరామ మూర్తి విశ్లేషణ : చామర్తి మానస గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన. కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది. వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..! స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో.. ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి. కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది. ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..! ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను. "మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం. ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.. " Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి. "తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం. రంగు తోలు - రచన : నిడదవోలు మాలతి విశ్లేషణ : శ్రీలలిత ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే మనుషులందరూ భిన్న జాతులకు చెందిన వారయినా అందరిలోనూ ప్రవహించేది ఎర్రని రక్తమే అని భిన్నత్వం లో ఏకత్వం చూపించడం. ప్రాణి భూమ్మీద పడగానే ఆడా మగా నిర్ధారించుకున్నాక వెంటనే తలయెత్తే ప్రశ్న తెలుపా నలుపా అని చెప్పుకోడంలో తప్పు లేదేమో. ఒకే యింట్లో వున్న తోబుట్టువుల మధ్య కూడా ఈ భేద భావం కనిపిస్తుంది. మరీ కొందరిళ్ళల్లో అయితే అన్నదమ్ముల పిల్లల మధ్య తేడాలు చెప్పడానికి తెల్లసూర్యం నల్ల సూర్యం అని అనడం కూడా మామూలే. ఒకింటి వాళ్ళు, ఒక ప్రాంతంవాళ్ళ మధ్యలోనే ఇటువంటి అనుభవాలున్ననీలవేణి మరి పాశ్చాత్యదేశాల్లో నివసించాల్సి వచ్చినప్పుడు జరిగిన అనుభవాల సారమే ఈ కథ. మనిషి సంఘజీవి. ఒక్కడూ వుండలేడు. నలుగురితో కలిసి మెలిసి వుండాలనుకుంటాడు. ఆ కలవడం కూడా తనవాడయితే బాగుంటుందని సహజంగానే అనిపిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తి మనకి ఎదురయితే ముందు మనం అతని భౌతిక స్వరూపాన్ని చూస్తాం. నలుపా--తెలుపా, పొడుగా--పొట్టా, లావా--సన్నమా, పెద్దా--చిన్నా, ఇలాగ. వెంటనే మనకి తెలీకుండానే మన మనసులోఒక అభిప్రాయం యేర్పడిపోతుంది. కాని అన్నింటికన్నా మనం ముందు గుర్తించేది ఒంటి రంగు. పుట్టు ఛాయా, పెట్టు ఛాయా అని పైపైన ఎన్ని పూతలు పూసుకున్నా అసలు ఒంటి రంగు పట్టినట్టు తెలుస్తుంది. అలా గుర్తించినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలూ అలాగే వుంటాయి. అవి మనవాడే కలుపుకుందాం అన్న భావనా అయివుండవచ్చు లేకపోతే మనవాడు కాదనే భేదభావం కానీ, లేదా ఒక్కొక్కసారి వివక్ష కానీ అయివుండవచ్చు. మూడేళ్ళపాప ఒక్కత్తీ రోడ్డు మీద తల్లి కోసం ఏడుస్తూ వుంటే, ఆ పిల్ల ఒంటి రంగు చూసి దూరం నుంచే సానుభూతి వాక్యాలు పలుకుతూ, నీలవేణిది కూడా ఆ పిల్ల లాగే తెల్లతోలు కాదని గుర్తించి, మీ పిల్లని చూసుకోవాలి కదా అన్నప్పుడు కలిగిన ఆశ్చర్యం కన్న-- అంత చిన్న పిల్ల కూడా కేవలం నీలవేణి ఒంటి రంగు చూసి తన జాతే ననుకుంటూ వచ్చి కాళ్ళకు చుట్టుకు పోవడం ఆమెకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాత నీలవేణిని రోడ్డు మీద అటకాయించి కొందరు వ్యక్తులు ఆమె బేగ్ లాక్కుంటున్నప్పుడు ఒక నల్లతోలు మనిషి ఆమె కోసం వాళ్ళతో దెబ్బలాడి గాయాల పాలవడంతో, పోలీసులూ, వైద్య సదుపాయం రావడంతో, కథ ముగిసినా ఆ సమయం లో నీలవేణి మనోభావాలు రచయిత్రి బాగా వివరించారు. మనుషులు భౌతికంగా కనపడడానికి రకరకాల రంగుల్లో వున్నా ఆ మనుషులందరికీ లోపల రక్తం రంగు మటుకు ఒక్కటే కదా.. అదే ఎరుపు అంటూ మనుషులందరిలోనూ వున్న ఏకత్వాన్ని ఎత్తి చూపించడం ముగింపుకి అందమిచ్చింది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి