...
20, జులై 2010, మంగళవారం
కవితాభిషేకం! - 16
సీ. మూరురాయరగండ! భారతీయ ప్రభుండ!
సర్వోన్నతోత్తమా! సర్వశ్రేష్ట!
రమ్య కన్నడరాజ్య రమణుడా! పూర్ణుడా!
ఆత్మీయ రసరాజ! ఆంధ్రభోజ!
సంగీత సాహిత్య సత్కళాభరణుడా!
భువన విజయ సత్య కవన విజయ!
వందనీయ చరిత సుందరాకారుడా!
సుప్రసన్న చిత్త! అప్రమత్త!
తే. వీరసైనిక! పాలకా! విమతజేత!
స్వజన రక్షకా! దుష్ట శిక్షణ ప్రణీత!
ధర్మ నిరత వీరవ్రతా! ధన్య చరిత!
తెలుగుభాషాప్రియ! కృష్ణదేవరాయ!
సీ. ద్రవిడ కర్ణాట కేరళ ఉత్కళలు యున్న
ఆంధ్రదేశమునందె యధిక ప్రేమ;
పదునారు భాషల పాండిత్యమున్నను
తేట తెలుగుయన్న తెగని ప్రేమ;
మతములన్నిటను సమత పాటించినా
వైష్ణవ మతమన్న పరమ ప్రేమ;
అష్టదిగ్గజముల నాదరించిన గాని
అల్లసాని యనిన నమిత ప్రేమ;
తే. గోపురములెన్నొ నిర్మించె గొప్పగాను
రత్నరాసులు వీధిలో రమ్యముగను
అమ్మజేసిన రాజేడి ఇమ్మహినను
సాహితీసమరాంగణ సార్వభౌమ!
సీ. పరదేశములతొ సంబంధాలు నెరపిన
భువి మౌర్య చంద్రగుప్తుడవు నీవు;
పరమతౌదర్యమ్ము ప్రకటించుకొనుటలో
సమ్రాట్ అశోకుని సాటి నీవు;
శౌర్య సాహసమొప్ప శత్రుసేనను గెల్వ
గ సముద్ర గుప్తుని ఘనత నీవు;
సత్కళలను బెంచి చక్కగా పోషింప
విక్రమాదిత్యుని వెలుగు నీవు;
తే. ప్రజల శ్రేయస్సుఁ గోరిన ప్రభువు నీవు;
ప్రేమ సామ్రాజ్యమేలిన విభుడవీవు;
సాటి నీకెవ్వ రభినవ సవ్యసాచి...
కీర్తివే నీవు అసహాయ కృష్ణరాయ!
సీ.కవితా పితామహుండవిరళ ప్రేమతో
మనుచరిత్రము నిచ్చె మాన్య చరిత!
ముక్కుతిమ్మన ముద్దుచెక్కిళ్ళ పారిజా
తాపహరణము గూర్చె ధన్యచరిత!
వైదుష్యవిభవమౌ వసుచరిత్రను భట్టు
మూర్తియందించెను పుణ్య చరిత!
శ్రీధూర్జటి కవీంద్రు ’శ్రీకాళహస్తీశు’
భక్తి కావ్యాలె వ్రాసె భవ్యచరిత!
తే. సాహితీలోకమున నీదె స్వర్ణయుగము!
సుందరమ్మైన కావ్య ప్రబంధయుగము!
ఉర్వి నీకీర్తి వెలుగును యుగముయుగము!
సరస కవిరాజ! నిను చూసి మురిసె జగము!
సీ. వికటకవి రామన్న విధుషీ విలాసమౌ
పాండురంగ మహాత్మ్యప్రభలు నిండె;
రామభద్రకవీంద్రు రమ్య ప్రణీతమౌ
రామాభ్యుదయ కీర్తి రమలు నిండె;
మాదయ్యగారి శ్రీ మల్లన్న నాణ్యమౌ
రాజశేఖర చరిత్రోజ నిండె;
కవిరాజ సూరన్న సువిశారదత్వమౌ
కళ(ల) పూర్ణోదయ కళలు నిండె;
తే. యుద్ధమే గాదు సుకవితా అద్దమందు
వెలుగు ఆముక్త మాల్యద విభుడవీవు!
మరలి చూడుమా మావైపు మహితమూర్తి
వినుతగుణ చక్రవర్తి! సద్విమల కీర్తి!
- దోరవేటి
Labels:
royal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి