...

...

21, జులై 2010, బుధవారం

కవితాభిషేకం! - 17


    విజయనగర రాజ్య వినుతికెక్కెను కృష్ణ
              దేవరాయల కీర్తి దివ్యముగను
    రాజ్యపాలనమున రణమునందైనను 
              దౌత్యంబునను దిట్ట ధరణిలోన
    శిల్పకళలపెంచి శిల్పుల పోషించి
              కోటలు నిర్మించి గుడులు గట్టె
    కళల వర్ధిల జేసి కవులను పోషించె
              కవిగాను తెలుగులో కావ్యమల్లె


    ప్రజలు సుఖశాంతులందున వర్ధిలంగ
    రత్నముల పురవీధుల రాశివోసి
    అమ్మినారను వార్త నాడవని వెలిగె
    స్వర్ణయుగమనడానికి సాక్ష్యమదియె.


    రాయలన్న కృష్ణరాయలు గుర్తొచ్చు
    నాటిరాయలకును సాటి లేరు
    దేశభాషలందు తెలుగు లెస్సయనుచు
    చాటిచెప్పినట్టి మేటి రాజు


    ఆంధ్రభోజునగను అసమాన కీర్తితో
    తెలుగుభాష జగతి వెలుగు నటుల
    అష్టదిగ్గజముల నద్భుతకవులను
    ఆదరించె రాయలాదినంబు


                  -దుబ్బాకుల కృష్ణస్వామి


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి