...

...

13, జులై 2010, మంగళవారం

కవితాభిషేకం ! - 9




చిలికిన పాల మీఁగడల చెన్నుల, నిర్మలమైననీ యశ
శ్చుళుకిత సౌరభాంకములెసూ! మహితాంధ్ర పురంధ్రి కంఠ సీ
మల యలపచ్చి గంబురపు మాదిరియైనది, నీ చరిత్రలో
నిలిచినదోయి! యాంధ్రుల ఘనీవద్భుత ధైర్యకర్మముల్. 

ఆ కనుచూపులో విభవమందిన రాజసరేఖ ఘోర ర
మ్యాకృతి కాలపూరుషుని యంకము మెట్టిన, దాంధ్ర విష్ణుడే
నీ కరవాల జిహ్వ కల నిల్చి పఠించునో యేమొ! ప్రాక్తన 
శ్రీ కమనీయ విక్రమ రుచిక్రమ దీపిత గీత మాలికల్

హరిహర బుక్కరాయలు ’తథా’స్తని విత్తిన విత్తనమ్ము, నీ
తరమునఁ బూచి పండిన దుదారుడవీవని దేశదేశముల్
మురిసినవయ్య! యాంధ్రకులమున్వెలిగించిన దివ్యరూపి, నీ
చరణము, శాతవాహనుని సాక్షిగ మా యిలవేలుపౌఁ జుమీ!

కమ్మని తెన్గుబాస నుడికారముఁ దీర్చిన తాత, యాంధ్ర భా
గ్యమ్ము పురాతపః ఫలముఖమ్మున నిను సమాశ్రయించె, ఁబూ
తమ్మయి పోయె నీబ్రదుకు, త్యాగము పండినదోయి! నీ కథాం
కమ్ము దయాద్రి పచ్చరల కన్నియ కిన్నెర మీటుగావుతన్

అలవింధ్యాచల భూములందెనసి యార్యావర్తమున్దాకను
న్దెలుఁగున్దోటలఁ బెంచిపోయితివి తండ్రీ! నాఁడు బంగారపు
ల్కలతో నాంధ్ర ధరిత్రి పొంగినది, దుష్కాలంబు ప్రాప్తించి ని
ష్పలమై పోయిన నీ మహాశ్రమకు బాష్పస్నిగ్ధ ముగ్ధాంజలుల్.

                               - సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు.

2 కామెంట్‌లు:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

"చిలికిన పాల మీఁగడ చెన్నుల, నిర్మలమైననీ యశ-" లో "మీఁగడ" బదులు "మీఁగడల" అని ఉండాలేమో. చంధస్సు సరిపోవటము లేదు.
చక్కటి పద్యాలు కూర్చి ఒక చోట చేరుస్తున్నందుకు ధన్యవాదములు.

mmkodihalli చెప్పారు...

జిగురు సత్యనారాయణగారూ! మీరు సూచించిన విధంగా సవరించాను గమనించండి. నా టైపాటును సరిదిద్దినందుకు ధన్యవాదాలు!